చదువుతోనే సరి... ఆటలకు చోటేది ?

  • అవుట్‌‌‌‌‌‌‌‌ డోర్‌‌‌‌‌‌‌‌ గేమ్స్‌‌‌‌‌‌‌‌కు దూరం అవుతున్న స్టూడెంట్లు
  • స్కూళ్లు, కాలేజీల్లో ఆడుకోను జాగ లేదు.. ఆడించేటోళ్లు లేరు
  • చదువు, ర్యాంకుల ధ్యాస తప్ప ఆటలను పట్టించుకోని ప్రైవేట్‌‌‌‌‌‌‌‌ స్కూళ్లు
  • నిధుల్లేక నియోజకవర్గాల్లో నిలిచిపోయిన మినీ స్టేడియాలు 
  • ‘మన ఊరు మన బడి’లో ఆటలకు దక్కని చోటు

మంచిర్యాల, వెలుగు : పిల్లలకు చదువుతో పాటు ఆటల్లోనూ ట్రైనింగ్‌‌‌‌‌‌‌‌ ఇచ్చినప్పుడే వారు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. ఫిజికల్‌‌‌‌‌‌‌‌, మెంటల్‌‌‌‌‌‌‌‌ ఫిట్‌‌‌‌‌‌‌‌నెస్‌‌‌‌‌‌‌‌ కోసం పిల్లలను ఆటల వైపు ఎంకరేజ్‌‌‌‌‌‌‌‌ చేయాలని ప్రజాప్రతినిధులు, ఆఫీసర్లు చెప్పడమే తప్ప ఆ దిశగా చర్యలు తీసుకోవడంలో మాత్రం విఫలం అయ్యారు. గత ప్రభుత్వం ఆటలను ఏమాత్రం పట్టించుకోకపోవడంతో స్కూళ్లు, కాలేజీల్లో కనీసం ప్లేగ్రౌండ్స్‌‌‌‌‌‌‌‌ కూడా లేకుండా పోయాయి. దీంతో పిల్లలు బుక్స్‌‌‌‌‌‌‌‌తోనే కుస్తీ పడుతూ, ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌ గేమ్స్‌‌‌‌‌‌‌‌తో టైంపాస్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారు. గత బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ సర్కార్‌‌‌‌‌‌‌‌ ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఓ మినీ స్టేడియం మంజూరు చేసినా నిధులు విడుదల చేయకపోవడంతో ఒక్కటి కూడా పూర్తి కాలేదు. రెండేండ్ల కింద ‘మన ఊరు మన బడి’ ప్రోగ్రాం కింద గవర్నమెంట్‌‌‌‌‌‌‌‌ స్కూళ్లలో 12 రకాల సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యం ఇచ్చినా అందులో ఆటలకు మాత్రం చోటు కల్పించలేదు.

ఆడుకోను జాగ లేదు... జాగా ఉంటే ఆడించేటోళ్లు లేరు

రాష్ట్రంలోని చాలా ప్రభుత్వ స్కూళ్లలో ఆట స్థలాలే లేవు. గ్రౌండ్‌‌‌‌‌‌‌‌ ఉన్న చోట పీఈటీలు, ఫిజికల్‌‌‌‌‌‌‌‌ డైరెక్టర్లు లేరు. గత ప్రభుత్వం స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌ కిట్లను సప్లై చేయకపోగా, బయట కొందామన్నా నిధులు ఇవ్వలేదు. దీంతో స్టూడెంట్లు సరైన ట్రైనింగ్‌‌‌‌‌‌‌‌ లేక ఆటల్లో రాణించలేకపోతున్నారు. ప్రైవేట్‌‌‌‌‌‌‌‌ స్కూళ్లలో అయితే పరిస్థితి మరింత అధ్వానంగా ఉంది. యాజమాన్యానికి ఎప్పుడు చూసినా చదువు, ర్యాంకుల ధ్యాస తప్ప ఆటలు ఆడించాలన్న కనీస ఆలోచన కూడా లేకుండా పోతోంది. కాగితాల్లో కనిపిస్తున్న ప్లేగ్రౌండ్స్‌‌‌‌‌‌‌‌ బయట మాత్రం కనిపించడం లేదు. గ్రౌండ్స్‌‌‌‌‌‌‌‌ లేకపోవడంతో మార్నింగ్‌‌‌‌‌‌‌‌ ప్రేయర్‌‌‌‌‌‌‌‌ నిర్వహించడానికి కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎక్కడైనా కాస్తంత జాగా ఉన్నా అది స్కూల్‌‌‌‌‌‌‌‌ బస్సులను పార్కింగ్‌‌‌‌‌‌‌‌ చేయడానికే సరిపోతుంది. ఆగస్ట్‌‌‌‌‌‌‌‌ 15, రిపబ్లిక్‌‌‌‌‌‌‌‌ డే సందర్భంగా పిల్లలకు రోడ్లపై, ఖాళీ ప్రదేశాల్లో ఆటల పోటీలు నిర్వహిస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదంతా తెలిసినా ఆఫీసర్లు మాత్రం కనీసం పట్టించుకోకుండా స్కూళ్లకు పర్మిషన్లు ఇచ్చేస్తున్నారు.

బుక్స్‌‌‌‌‌‌‌‌, టీవీలు, సెల్‌‌‌‌‌‌‌‌ఫోన్లకే పరిమితం

స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌ గేమ్స్‌‌‌‌‌‌‌‌ను అటు ప్రభుత్వం, ఇటు స్కూల్స్‌‌‌‌‌‌‌‌, పేరెంట్స్‌‌‌‌‌‌‌‌ పట్టించుకోకపోవడంతో పిల్లలు ఆటలకు దూరం అవుతున్నారు. స్కూల్‌‌‌‌‌‌‌‌ నుంచి ఇండ్లకు పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. హోంవర్క్‌‌‌‌‌‌‌‌ కంప్లీట్‌‌‌‌‌‌‌‌ కాగానే టీవీలకు అతుక్కుపోతున్నారు. కొవిడ్‌‌‌‌‌‌‌‌ లాక్‌‌‌‌‌‌‌‌డౌన్‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌ క్లాస్‌‌‌‌‌‌‌‌ల పుణ్యమాని సెల్‌‌‌‌‌‌‌‌ఫోన్లకు అలవాటుపడ్డారు. తల్లిదండ్రులు సైతం పిల్లల చేతికి మొబైల్స్‌‌‌‌‌‌‌‌ ఇచ్చి తమ పనుల్లో నిమగ్నం అవుతున్నారు. అటు స్కూళ్లలో, ఇటు ఇండ్లలో ఆటుకోవాలని చెప్పే వారు లేకపోవడంతో పిల్లలు టీవీలు, ఫోన్లతో కాలం గడుపుతున్నారు. వాట్సప్‌‌‌‌‌‌‌‌, ఫేస్‌‌‌‌‌‌‌‌బుక్‌‌‌‌‌‌‌‌, యూట్యూబ్‌‌‌‌‌‌‌‌ వీడియోలు, రీల్స్‌‌‌‌‌‌‌‌ చూస్తూ, ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌ గేమ్స్‌‌‌‌‌‌‌‌ ఆడుతూ టైమ్‌‌‌‌‌‌‌‌పాస్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారు. ఆటలకు కనీస టైం కూడా కేటాయించకపోవడంతో ఫిజికల్‌‌‌‌‌‌‌‌గా, మెంటల్‌‌‌‌‌‌‌‌గా వీక్‌‌‌‌‌‌‌‌ అవుతున్నారని పలు స్టడీస్‌‌‌‌‌‌‌‌ వెల్లడిస్తున్నాయి. ఎక్కడైనా గల్లీల్లో కాస్తంతా జాగా ఉంటే పిల్లలు క్రికెట్‌‌‌‌‌‌‌‌ ఆడుకుంటూ కనిపిస్తున్నారు. అసలు స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌ అంటే క్రికెట్‌‌‌‌‌‌‌‌ ఒక్కటే అన్నట్లు తయారైంది. ఆటల్లో రాణించే స్టూడెంట్లకు విద్య, ఉద్యోగాల్లో 2 శాతం రిజర్వేషన్‌‌‌‌‌‌‌‌ ఉన్నప్పటికీ వాటి వైపు ఎంకరేజ్‌‌‌‌‌‌‌‌ చేసేవారు లేకపోవడంతో పిల్లలు అన్ని రకాలుగా నష్టపోతున్నారు.

యంగ్‌‌‌‌‌‌‌‌ ఇండియా స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌ స్కూల్‌‌‌‌‌‌‌‌ ఏర్పాటుపై కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ ఫోకస్‌‌‌‌‌‌‌‌

రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌ గేమ్స్‌‌‌‌‌‌‌‌పై ఫోకస్‌‌‌‌‌‌‌‌ చేసింది. యూత్‌‌‌‌‌‌‌‌ను నేషనల్‌‌‌‌‌‌‌‌, ఇంటర్నేషనల్‌‌‌‌‌‌‌‌, ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌ లెవల్‌‌‌‌‌‌‌‌లో తీర్చిదిద్దేలా యంగ్‌‌‌‌‌‌‌‌ ఇండియా స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌ స్కూల్‌‌‌‌‌‌‌‌ ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. ఇందుకోసం సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి ఇటీవలే శంకుస్థాపన చేశారు. వచ్చే అకాడమిక్‌‌‌‌‌‌‌‌ ఇయర్‌‌‌‌‌‌‌‌లోనే ఈ స్కూల్‌‌‌‌‌‌‌‌ను ప్రారంభించనున్నట్లు సీఎం ప్రకటించారు. కొత్తగా స్టేడియాలను సైతం నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అలాగే స్కూళ్లలో స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌ పీరియడ్‌‌‌‌‌‌‌‌ ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గతంలో ప్రకటించారు. దీంతో క్రీడాకారులకు మంచి భవిష్యత్‌‌‌‌‌‌‌‌ ఉండబోతోందని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


మంచిర్యాలలో ఇదీ పరిస్థితి... 

మంచిర్యాల జిల్లాలో 108 గవర్నమెంట్‌‌‌‌‌‌‌‌ హైస్కూళ్లు ఉండగా గత ప్రభుత్వం 58 ఫిజికల్‌‌‌‌‌‌‌‌ డైరెక్టర్​పోస్టులు మాత్రమే శాంక్షన్‌‌‌‌‌‌‌‌ అయ్యాయి. ప్రస్తుతం 47 మంది పీడీలు, ఐదుగురు పీఈటీలు ఉండగా మిగతా ఆరు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. హైస్కూళ్లలో ఎప్పటినుంచో పనిచేస్తున్న పీఈటీలు తమను అప్‌‌‌‌‌‌‌‌గ్రేడ్‌‌‌‌‌‌‌‌ చేయాలని కోరినా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ సర్కార్‌‌‌‌‌‌‌‌ వచ్చాక పీఈటీలను పీడీలుగా అప్‌‌‌‌‌‌‌‌గ్రేడ్‌‌‌‌‌‌‌‌ చేసింది. మరో 50 స్కూళ్లకు పీఈటీ, పీడీ పోస్టులను మంజూరు చేయకపోవడంతో స్టూడెంట్లు ఆటలకు దూరం అవుతున్నారు. జిల్లాలో 749 గవర్నమెంట్‌‌‌‌‌‌‌‌ స్కూళ్లకు గానూ 381 స్కూళ్లలో మాత్రమే ప్లే గ్రౌండ్స్‌‌‌‌‌‌‌‌ ఉన్నాయి. అలాగే 10 గవర్నమెంట్‌‌‌‌‌‌‌‌ జూనియర్‌‌‌‌‌‌‌‌ కాలేజీలు ఉండగా కేవలం బెల్లంపల్లిలోనే ఫిజికల్‌‌‌‌‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌ ఉన్నారు.