పురుగులు అన్నం పెడుతున్నారని ఆందోళన

  • గుండ్లపల్లి మహాత్మా జ్యోతిబాపూలే గురుకులంలో ఘటన
  • విద్యార్థుల తల్లిదండ్రుల నిరసన

 
గన్నేరువరం, వెలుగు:
గన్నేరువరం మండలంలోని రాజీవ్ రహదారి గుండ్లపల్లి స్టేజి వద్ద నిర్వహిస్తున్న మహాత్మా జ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాలలో ఆదివారం పురుగుల అన్నం పెట్టారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు  ఆదివారం వండిన అన్నంలో తెల్ల పురుగులు వచ్చాయని విద్యార్థులు తల్లిదండ్రులకు భోజనాన్ని చూపించారు. హాస్టల్లో విద్యార్థులకు అందించే భోజనం మరి అధ్వానంగా ఉందని మురుగునీరు నిలువ ఉండి దుర్గంధం వెదజల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ హాస్టల్ ఆకస్మికంగా తనిఖీ చేసి అధ్వానంగా ఉన్న హాస్టల్ నిర్వహణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినప్పటికీ హాస్టల్ నిర్వహణలో ఎలాంటి మార్పు రాలేదన్నారు.  విద్యార్థుల బాగోగులు మరిచి ఇష్టారాజ్యంగా విధులు నిర్వహిస్తున్న ప్రిన్సిపాల్, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని  తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. మురుగునీటి సమస్యను వెంటనే పరిష్కరించకుంటే గురుకుల పాఠశాల ముందు ధర్నా నిర్వహిస్తామని 
హెచ్చరించారు.