సిరిసిల్ల ఇంజినీరింగ్ కాలేజీలో అడ్మిషన్లు ఫుల్‌‌.. సౌలత్‌‌లు నిల్‌‌

  • 1200 మందికి మూడే రూములు
  • రేకుల షెడ్డులో క్లాసుల నిర్వహణ 
  • అరకొర వసతులతో ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు
  • డిగ్రీ కాలేజీని విభజించడంతో ఆ విద్యార్థులకు తప్పని అవస్థలు 


రాజన్నసిరిసిల్ల, వెలుగు: సిరిసిల్ల ఇంజినీరింగ్‌‌ కాలేజీలో సౌలత్‌‌ల్లేక స్టూడెంట్స్‌‌ ఇబ్బందులు పడుతున్నారు. కాలేజీలోని డిగ్రీ కాలేజీని విభజించి 1200 మందికి మూడు రూమ్‌‌ల్లోనే క్లాసులు నిర్వహిస్తున్నారు. 2021-–22లో సిరిసిల్ల పట్టణం సమీపంలోని అగ్రహారం డిగ్రీ కాలేజీలో ఇంజినీరింగ్‌‌ కాలేజీని ఏర్పాటు చేశారు. డిగ్రీ కాలేజీని విభజించి అటు ఇంజినీరింగ్ ఇటు డిగ్రీ క్లాసులు నిర్వహిస్తున్నారు. దీంతో  రెండు కాలేజీలకు సరిపోనూ క్లాస్‌‌ రూముల్లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. నాలుగేండ్లుగా ఇంజినీరింగ్‌‌ కాలేజీలో విద్యార్థుల సంఖ్య పెరుగుతుండగా క్లాస్​ రూమ్‌‌లు పెరగకపోవడం గమనార్హం. 

బిల్డింగ్‌‌ నిర్మాణ హామీని మరిచారు. 

2021-–22లో సిరిసిల్ల జేఎన్టీయూహెచ్‌‌ను ప్రారంభించారు.  అదే సంవత్సరం అధికారులు మున్సిపల్ పరిధిలోని పెద్దూర్ శివారులో 80 ఎకరాల స్థలాన్ని పరిశీలించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందజేశారు. కాలేజీ ప్రారంభమయ్యాక మూడేండ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం పక్కా భవనం నిర్మించలేదు. దీంతో నాలుగేండ్లుగా ఇంజినీరింగ్ విద్యార్థులు రేకుల తాత్కాలికంగా నిర్మించిన రేకుల షెడ్లలో క్లాసులు వింటున్నారు.

 మరోవైపు అగ్రహారం డిగ్రీ కాలేజీలో ఇంజినీరింగ్ క్లాసులు నిర్వహిస్తుండటంతో డిగ్రీ విద్యార్థులు సైతం ఇబ్బందులకు గురువుతున్నారు. దశాబ్దాల కింద  నిర్మించిన కాలేజీలో కొన్ని గదులు శిథిలావస్థకు చేరుకున్నాయి. దాదాపు ఆరు గదులు శిథిలావస్థలో ఉండగా వాటిని పూర్తిగా మూసేశారు. దీంతో డిగ్రీ విద్యార్థులకే సరిపోకుండా తక్కువ రూములలో క్లాస్ నడుపుతున్నారు.ఇందులోనే పార్టేషన్ చేసి ఇంజినీరింగ్ కాలేజీని నడపడంతో రెండు కాలేజీలకు క్లాస్‌‌ రూమ్‌‌లు సరిపోవడం లేదు. ఇంజినీరింగ్ విద్యార్థుల కోసం కాలేజీ ఆవరణలో తాత్కాలికంగా రేకుల షెడ్లు వేశారు. 

ALSO READ : హర్యానా పీఠం ఎవరిదో మరి.!

 ముగ్గురే రెగ్యులర్‌‌‌‌.. మిగతా అంతా కాంట్రాక్ట్​ ఫ్యాకల్టీలే.. 

ఇంజనీరింగ్ కాలేజీలో ఏటా అడ్మిషన్లు పెరుగుతున్నాయి. 2021–-22లో 109 మంది విద్యార్థులతో ప్రారంభమైన కాలేజీ ప్రస్తుతం 1200 మంది విద్యార్థులు ఉన్నారు. సీఎస్‌‌ఈ, ఈసీఈ, ఈఈఈ, మెకానికల్, సివిల్, టెక్స్ టైల్ విభాగంలో మొత్తం 1200 మంది విద్యార్థులు ఉన్నారు. సెకండియర్, థర్డ్ ఇయర్ విద్యార్థులకు ల్యాబ్‌‌ల కోసం రెండు రూములు రిపేర్ చేయించి వాడుతున్నారు.

 మరోవైపు ఫ్యాకల్టీ కొరతతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. కాలేజీలో కేవలం మూడు మాత్రమే రెగ్యులర్ పోస్ట్ లు ఉన్నాయి. ప్రిన్సిపాల్, ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్‌‌‌‌ మాత్రమే రెగ్యులర్‌‌‌‌ కాగా.. మిగతా గెస్ట్‌‌, కాంట్రాక్ట్‌‌ ఫ్యాకల్టీతో నెట్టుకొస్తున్నారు. కాగా కాలేజీలో టెక్స్‌‌టైల్స్‌‌ కోర్సు ప్రవేశపెట్టగా.. ఇందులో జీరో అడ్మిషన్లు నమోదయ్యాయి. తొలి ఏడాది 8 మంది చేరినా ఆ తర్వాత ఇతర బ్రాంచీలోకి మారారు.