మెహందీ.. టాటూ ఉంటే నో ఎంట్రీ...నగలు, షూస్​ వేసుకున్నా నో పర్మిషన్​

  • నేటి నుంచి 'గ్రూప్​ ‌‌‌‌3' పరీక్షలు
  • ఉమ్మడి జిల్లాలో 153 సెంటర్లు..  50,939 మంది అభ్యర్థులు
  • సెంటర్ల వద్ద 144 సెక్షన్‌ అమలు

యాదాద్రి, నల్గొండ, వెలుగు : గ్రూప్ 3 ఎగ్జామ్​కు స్టిక్ట్ రూల్స్ అమలు చేయనున్నారు. అభ్యర్థులు మెహందీ పెట్టుకున్నా.. టాటూలు వేసుకున్నా అనుమతి ఇవ్వమని ఆఫీసర్లు తేల్చి చెప్పారు. ఆభరణాలు, షూస్​ వేసుకున్నా.. సెల్​ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్​ ఐటమ్స్ వెంట తెచ్చుకున్నా పర్మిషన్ ఇవ్వమని స్పష్టం చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో గ్రూప్ 3 పరీక్షకు ఆఫీసర్లు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 

పరీక్షల నిర్వహణపై కలెక్టర్లు ఇలా త్రిపాఠి, తేజస్​ నందలాల్ పవార్, హనుమంతరావు పలుమార్లు రివ్యూలు నిర్వహించి ఆదేశాలు జారీ చేశారు. రీజినల్‌ కో–ఆర్డినేటర్స్, స్ట్రాంగ్‌రూమ్, జాయింట్‌ కస్టోడియన్స్, పోలీస్‌ నోడల్‌ ఆఫీసర్స్, చీఫ్‌ సూపరింటెండెంట్స్, డీవో, ఫ్లైయింగ్‌ స్క్వాడ్స్​ను నియమించడంతోపాటు సెంటర్లలో ఏర్పాట్లను పరిశీలించారు. ఎగ్జామ్ సెంటర్ల వద్ద 144 సెక్షన్‌ అమలు చేయనున్నారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు సెంటర్​ వద్దకు గంట ముందే చేరుకోవాలని సూచించారు. 

నేడు రేపు గ్రూప్‌ 3 పరీక్ష..

ఈనెల 17, 18న గ్రూప్‌ 3 పరీక్షలు నిర్వహిస్తున్నారు. 17న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం12.30 వరకు పేపర్‌-1 (జనరల్‌ స్టడీస్‌ అండ్‌ జనరల్‌ ఎబిలిటీస్‌) పరీక్ష, మధ్యాహ్నం 3 నుంచి 5.30 వరకు పేపర్‌--2 హిస్టరీ, పాలిటీ అండ్‌ సొసైటీ పరీక్ష ఉంటుంది. 18న ఉదయం 10 నుంచి 12.30 వరకు పేపర్‌--3 ఎకానమీ అండ్‌ డెవలప్​మెంట్‌ పరీక్ష జరగనుంది. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు గంట ముందుగానే సెంటర్లకు చేరుకోవాలని ఆఫీసర్లు ప్రకటించారు. అరగంట ముందుగానే గేట్లు మూసి వేస్తామని స్పష్టం చేశారు. 

153 సెంటర్లు..  50,939 మంది అభ్యర్థులు..

గ్రూప్‌ 3 నిర్వహణ కోసం నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో 153 సెంటర్లు ఏర్పాటు చేశారు. సూర్యాపేటలో 30, కోదాడలో 20, నల్గొండలో 60, మిర్యాలగూడలో 28, యాదాద్రి జిల్లా భువనగిరిలో 15 సెంటర్లు ఏర్పాటు చేశారు. సూర్యాపేట జిల్లాలో 6543, నల్గొండ జిల్లాలో 28,353 మంది, యాదాద్రిలో 6043 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. 

రూల్స్ కచ్చితంగా పాటించాలి..

గ్రూప్ -3 పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. ఎలాంటి అవకతవకలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఎగ్జామ్స్​కు హాజరయ్యే అభ్యర్థులు టీజీపీఎస్సీ నిబంధనలు కచ్చితంగా పాటించాలి. అనుమతించని వాటిని వెంట తెచ్చుకొని ఇబ్బంది పడొద్దు.- తేజస్ నందలాల్ పవార్, కలెక్టర్, సూర్యాపేట 

మెహందీ.. ఆభరణాలు ఉంటే..

ఎగ్జామ్​కు హాజరయ్యే అభ్యర్థులకు ప్రత్యేకంగా సూచనలు చేశారు. ప్రతి అభ్యర్థిని తనిఖీలు చేయనున్నారు. అభ్యర్థులు మెహందీ, టాటూలు వేసుకున్నా, ఆభరణాలు ధరించినా పరీక్షకు అనుమతించరు. అదే విధంగా షూస్​ వేసుకున్నా, సెల్​ ఫోన్​తో పాటు ఎలక్ట్రానిక్​ వస్తువులు ఏవైనా తెచ్చిన పర్మిషన్​ ఇవ్వరు.ప్రతి అభ్యర్థి బ్ల్యూ లేదా బ్లాక్​ పెన్నులు వెంట తెచ్చుకోవాలని సూచిస్తున్నారు. హాల్ టికెట్​ను కలర్​లో డౌన్​ లోడ్​ చేసుకోవాలని, దానిపై లేటెస్ట్​ ఫొటో అతికించాల్సి ఉంటుంది. ఫొటో సరిగా లేకుంటే గెజిటెడ్ ఆఫీసర్ సంతకం విధిగా తీసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా గుర్తింపు కార్డు కచ్చితంగా తీసుకొని రావాలని సూచించారు.