అరేక్ మాల్... అరేక్ మాల్.. ఉల్లిగడ్డలో.. రోజూ ఉదయం లేచిన దగ్గర నుంచి ఇలాంటి పిలుపులు వింటూనే ఉంటాం. పొట్ట కూటి కోసం కాళ్లరిగేలా ఊళ్లు తిరిగి వస్తువులు అమ్ముకునే చిరువ్యాపారులను చూస్తూనే ఉంటాం. వాళ్ల లైఫ్ ఎలా ఉంటుందో తెలుసా? వాళ్లెంత కష్టపడతారో తెలుసా?
మహబూబాబాద్ అర్బన్, వెలుగు చీకట్లు పోకముందే నిద్ర లేచి ఊళ్లకు పోవాలి. చీకటి పడేదాక సరుకులు అమ్ముకుని ఇంటికి రావాలి. పొద్దంతా ఎండనక వాననక ఊళ్లు తిరగాలి. ప్రతి రోజూ ఈ ఉరుకులు పరుగులు తప్పవు. కొందరు చిరువ్యాపారులు సరుకుల మూటలు నెత్తిపై పెట్టుకుని, ఇంకొందరు సైకిల్ మీద తిరుగుతూ, తోపుడు బండ్లపై సరుకులు పెట్టుకుని రోజంతా అమ్ముతుంటారు. ఒక్కోరోజు బేరాలు కావు. పైసలు రావు. అయినా నిరాశ పడకుండా మరుసటి రోజు ఉదయాన్నే గంప నెత్తిన పెట్టుకుని వెళ్తారు. ఇలా నాలుగైదు రోజులు సరుకులు అమ్ముడు పోలేదో ఇక పిల్లా జెల్లా అంతా పస్తులుండాల్సిందే. ఇలా తమ బతుకు బండి లాగేందుకు పల్లె ప్రజల ముంగిటికే సరుకులు తీసుకొస్తున్నారు చిరువ్యాపారులు. వాళ్లు పట్టణాల్లో హోల్ సేల్ లో వస్తువులు కొని పల్లెల్లో అమ్ముకుని బతుకుతున్నారు.
తక్కువ ధరకే
అల్లం, వెల్లుల్లి, ఉల్లిగడ్డ, రెడీమేడ్ డ్రెస్సులు, చెప్పులు, గిన్నెలు, ప్లాస్టిక్ వస్తువులు ఒక్కటేమిటి అన్ని నిత్యావసర వస్తువులు వాకిలి ముందుకు తీసుకొచ్చి అమ్ముతుంటారు. చిరువ్యాపారులు. అది కూడా మార్కెట్ ధర కంటే తక్కువకే. పట్టణాలకు వెళ్లలేని పల్లె జనాలు ఇంటి దగ్గరే కావాల్సిన వస్తువులు కొంటున్నారు. 'తక్కువ ధరకు దొరుకుతున్నాయి. మార్కెట్లో కొనడం కంటే వీళ్ల దగ్గర కొనడమే బెటర్' అంటున్నారు పల్లె జనాలు.
పాతికేళ్లుగా అమ్ముతున్నా
పాతికేళ్లుగా ఊరూరు తిరిగి గిన్నెలు అమ్ముతున్నా. ఇరవై ఏళ్ల క్రితం నా భర్త చనిపోయాడు. ముగ్గురు అమ్మాయిల పెళ్లిళ్లు చేశాను. ఇద్దరు అబ్బాయిలను చదివిస్తున్నాను. హోల్ సేల్ దుకాణం నుంచి సామాన్లు తీసుకొచ్చి ఊళ్లలో అమ్ముతాను. రోజుకు వంద రూపాయల నుంచి ఐదువందల వరకు మిగులుతాయి. దాసరి బజార్లో చాలా కుటుంబాలు ఇదేపని చేస్తున్నాయి. పెట్టుబడి కోసం ముందుగా ఫైనాన్స్ తీసుకొస్తాం. సరుకులు అమ్మిన తర్వాత వడ్డీతో కలిపి ఇచ్చేస్తాం. ప్రభుత్వం రుణాలు ఇప్పిస్తే ఇలా అప్పులు చేసే బాధ తప్పుతుంది.