స్ట్రీమ్ ఎంగేజ్..ఈగో దెబ్బ తింటే...

  • టైటిల్​     :   పార్కింగ్​
  • డైరెక్షన్​​     :   ​రామ్ కుమార్ బాలకృష్ణన్
  • కాస్ట్​  ​    :    ​హరీష్ కళ్యాణ్, ఎం.ఎస్. భాస్కర్, ఇందూజ రవిచంద్రన్ 
  • లాంగ్వేజి     :    తమిళం 
  • ప్లాట్​ ఫాం     :     డిస్నీ+హాట్ స్టార్ 

ఈశ్వర్ (హరీష్ కళ్యాణ్)  ఐటీ ఉద్యోగి. అతిక (ఇందూజ రవిచంద్రన్) అతని భార్య.  అతిక ఇంట్లో పెద్దలకు తెలియకుండా ప్రేమ పెండ్లి చేసుకుని వేరు కాపురం పెడతాడు ఈశ్వర్. ఒక బ్రోకర్ ద్వారా ఏకరాజ్ (ఎం.ఎస్. భాస్కర్) ఇంట్లో అద్దెకు దిగుతాడు. ఇల్లు పాతగా ఉన్నా ఎలాగోలా  అడ్జస్ట్ అయ్యి ఉంటుంటాడు. సాఫ్ట్ వేర్ కంపెనీలో జాబ్. మంచి జీతం. భార్యను బంగారంలా చూసుకుంటాడు.  

ఈశ్వర్ కుటుంబం పై ఫ్లోర్​లో ఉంటుంటే..  గ్రౌండ్ ఫ్లోర్​లో ఏకరాజ్ కుటుంబం ఉంటుంది. ఏకరాజ్ మహా పిసినారి అని చెప్పడానికి అతని డొక్కు బైక్ చూస్తే చాలు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ కారు కొనుక్కునే కెపాసిటీ ఉన్నా కొనడు. అంతెందుకు ఇంట్లో రోజువారీ అవసరాలకు వాడే సామాన్లు పాడైనా కొనడు. మిక్సీ గిన్నె పాడైతే.. సొంతంగా రిపేర్​ చేస్తాడు. అలాంటి ఈ వ్యక్తి ఇంటి పైన అద్దెకుంటాడు ఈశ్వర్​.
 

ఆఫీసుకి వెళ్లేందుకు కష్టమవుతుందని కారు కొంటాడు.  ఇక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది. ఏకరాజ్ బైక్​కి, ఈశ్వర్ కారుకి పార్కింగ్ సరిపోదు. ఇంటి ఓనర్​తో ‘మీది బైకే కదా.. అడ్జస్ట్ అవ్వండి’ అంటాడు ఈశ్వర్​. దాంతో ఏకరాజ్​ అహం దెబ్బ తింటుంది. అప్పటికప్పుడు కారు కొంటాడు. ఇప్పుడు ఇద్దరికీ కార్లు ఉంటాయి. ఈ పార్కింగ్ స్థలం మీద ఎవరి ఆధిపత్యం నడుస్తుంది? ఈ క్రమంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? అనేది కథ. 
 

పార్కింగ్ అనేది చాలా సహజంగా ఉండే సమస్య.  ఎప్పుడూ... ఏదో ఒక చోట.. ఎవరో ఒకరు ఫేస్ చేస్తూనే ఉంటారు. దీన్ని సినిమాగా తీయడం ఒక ఎత్తు అయితే.. చాలా సహజంగా తెరకెక్కించడం మరొక ఎత్తు. సినిమా చూస్తున్నంత సేపు ఆ ఇష్యూ మన ఇంటి పక్కనే, మన మధ్య జరుగుతున్నట్టే ఉంటుంది. జీవితంలో ఎప్పుడూ ఎలాంటి మచ్చ లేకుండా జీవించే మనుషుల మధ్య ఈగో వస్తే ఎలా ఉంటుందనే విషయాన్ని ఈ సినిమాలో చాలా బాగా చూపించాడు దర్శకుడు.