స్ట్రీమ్ ఎంగేజ్ ..  ఫైర్ ఫైటర్స్​

  • టైటిల్ : అగ్ని, 
  • ప్లాట్​ ఫాం : అమెజాన్ ప్రైమ్ వీడియో
  • డైరెక్షన్ : రాహుల్ ధోలాకియా 
  • కాస్ట్ : ప్రతీక్ గాంధీ, దివ్యేందు, సాయి తంహంకర్, సయామి ఖేర్, జితేంద్ర జోషి, ఉదిత్ అరోరా, కబీర్ షా

విఠల్‌‌‌‌రావ్ సర్వే (ప్రతీక్ గాంధీ) ముంబయిలోని పరేల్ ఫైర్​ స్టేషన్​ చీఫ్​గా పనిచేస్తుంటాడు. ఎలాంటి పరిస్థితిని అయినా ధైర్యంగా ఎదుర్కొంటాడు. ముందుండి తన టీమ్​ని నడిపిస్తాడు. అతనిది ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం. అతని ఫ్యామిలీ గవర్నమెంట్ఇచ్చిన పాత క్వార్టర్స్‌‌లో ఉంటుంది. విఠల్​ భార్య(సాయి తంహంకర్) అతన్ని అర్థం చేసుకుని సర్దుకుపోతుంటుంది. అతని కొడుకు మాత్రం విఠల్​ కష్టాలను అర్థం చేసుకోడు. పోలీస్​గా పనిచేస్తున్న అతని మామ సమిత్ సావంత్ (దివ్యేందు) ఆడంబరాలను చూసి ఎట్రాక్ట్​ అవుతుంటాడు. విఠల్ మాత్రం అలాంటివాటికి దూరంగా ఉంటాడు. అది అతని కొడుక్కి నచ్చదు. దాంతో విఠల్ బాధపడుతుంటాడు. ఆ బాధను రెగ్యులర్​గా తన బెస్ట్ ఫ్రెండ్ మహదేవ్ నిగాడే (జితేంద్ర జోషి)తో కలిసి విస్కీ తాగుతూ పంచుకుంటుంటాడు. అలాంటి టైంలో నగరం అంతటా అనుమానాస్పదంగా ఫైర్​ యాక్సిడెంట్లు జరుగుతుంటాయి. వాటికి కారణం ఒక సైకో కిల్లర్​. అందుకే అతన్ని పట్టుకోవడానికి పోలీసులు ఎంట్రీ ఇస్తారు. కానీ.. వాళ్లంతా ఫైర్​ ఆఫీసర్ల పట్ల చులకన భావంతో ఉంటారు. ఒకసారి ఫైర్​ ఆఫీసర్​ అవనీ (సయామి ఖేర్) క్రైమ్ సీన్‌‌లోకి వెళ్తుంటే కార్డ్‌‌లు ఆడుతూ బిజీగా ఉన్న ఫిట్‌‌నెస్ లేని పోలీసులు ఆపేస్తారు. ఆ తర్వాత విఠల్​ ఏం చేశాడు? ఈ కేసుని ఎలా పరిష్కరించాడు? తెలుసుకోవాలంటే సినిమా పూర్తిగా చూడాలి. 

ఆ సిడీలో  ఏముంది? 

  • టైటిల్ : విక్కీ విద్యా కా వో వాలా వీడియో,
  •  ప్లాట్​ ఫాం : నెట్​ఫ్లిక్స్​, 
  • డైరెక్షన్ : రాజ్ శాండిల్య,
  •  కాస్ట్ : రాజ్‌కుమార్ రావ్, త్రిప్తి డిమ్రీ, విజయ్ రాజ్, మల్లికా షెరావత్, రాకేష్ బేడి, అర్చన పురాణ్ సింగ్, టికు తల్సానై, ముఖేష్ తివారీ

ఈ కథ 1997లో మొదలవుతుంది. విక్కీ (రాజ్‌‌కుమార్ రావు) ఉత్తరప్రదేశ్‌‌లోని రిషికేశ్‌‌లో మెహందీ ఆర్టిస్ట్‌‌గా పనిచేస్తుంటాడు. డాక్టర్​ విద్య (త్రిప్తి డిమ్రీ)ని పెండ్లి చేసుకుంటాడు. ఇద్దరి ఆలోచనలూ ఒకేలా ఉంటాయి. వాళ్లు హనీమూన్​ కోసం గోవా వెళ్తారు. ఆ క్షణాలను ఎప్పటికీ మర్చిపోకూడదు అనే ఉద్దేశంతో హనీమూన్​ నైట్‌‌ని వీడియో తీసుకుంటారు. ఆ ఫుటేజిని సిడీలో సేవ్​ చేసి పెట్టుకుంటారు. ఇంటికి తిరిగి వెళ్లాక ఒకరోజు సిడీని ప్లేయర్​లో వేసి వీడియో చూస్తారు. కానీ.. ప్లేయర్​ నుంచి బయటికి తీయడం మర్చిపోతారు. అదేరోజు ప్లేయర్​తోపాటు ఆ సిడీని కూడా ఒక దొంగ ఎత్తుకెళ్తాడు. ఆ వీడియో బయటికి వస్తే.. వాళ్ల పరువు పోతుందని దానికోసం వెతకడం మొదలుపెడతాడు విక్కీ. చివరికి సీడీని సాధిస్తాడు. కట్​ చేస్తే.. అది అచ్చం వాళ్ల సీడీలాగే ఉన్న మరో సీడీ. అందులో ఉన్న వీడియోను చూసి విక్కీ షాక్​ అవుతాడు. ఇంతకీ అందులో ఉన్నదేంటి? వాళ్ల సీడీ ఏమైంది? తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాలి. 

అమ్మ పోరాటం

  • టైటిల్ : మేరీ, 
  • ప్లాట్​ ఫాం : జీ5,
  •  డైరెక్షన్ : సచిన్ దారెకర్,
  •  కాస్ట్ : సాయి దేవధర్, తన్వి ముండ్లే, సాగర్ దేశ్‌ముఖ్, చిన్మయ్ మాండ్లేకర్

తారా దేశ్‌పాండే (సాయి దేవధర్) కెమిస్ట్రీ టీచర్​గా పనిచేస్తుంటుంది. తన కూతురు మనస్వి (తన్వి ముండ్లే)పై రోహిత్ జమ్వాల్ (యష్ మల్హోత్రా), అతని ఫ్రెండ్స్​ కలిసి అత్యాచారం చేస్తారు. తర్వాత ఆమెని రోడ్డు పక్కన పడేసి వెళ్లిపోతారు. తార పోలీసులను ఆశ్రయిస్తుంది. న్యాయం చేయాలని కోరుతుంది. కానీ.. నేరం చేసినవాళ్లంతా బాగా డబ్బున్నవాళ్లు. వాళ్ల కుటుంబాలకు సమాజంలో పలుకుబడి ఉంటుంది. దాంతో.. వాళ్లను శిక్ష పడదు. అయినా.. తార వెనక్కి తగ్గకుండా పోరాటం చేస్తుంటుంది. చివరకు తానే ప్రతీకారం తీర్చుకోవడానికి ప్లాన్​ చేస్తుంది. ఒక సాధారణ మహిళ తన కూతురికి న్యాయం చేయగలిగిందా? లేదా? అనేదే మిగతా కథ.