జగిత్యాల జిల్లాలో బాలుడిపై వీధికుక్క దాడి.. తీవ్రగాయాలు

జగిత్యాల: ఇటీవల కాలంలో వీధికుక్కల దాడులు పెరిగిపోయాయి. ముఖ్యంగా చిన్నారులపై దాడి చేస్తున్నాయి. మంగళవారం (జూలై 16) జగిత్యాల జిల్లాలోని బీర్పూర్ మండలం మనగెలలో వీధిలో ఆడుకుంటున్న బాలుడిపై వీధి కుక్క దాడి చేసింది. ఒక్కసారిగా బాలుడిపైకి దూకి ముఖం, చెవులు, తలపై  తీవ్రంగా గాయపర్చింది. బాలుడు ఎంతగింజుకున్నా వదిలిపెట్టలేదు.. స్థానికులు వచ్చి కర్రలతో కుక్కను బెదిరించడంలో అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఇదంతా స్థానికంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో రికార్డు అయింది. తీవ్రంగా గాయడిన బాలుడిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. 

నాలుగు రోజు క్రితం  ఘట్ కేసర్ లో కూడా ఇద్దరు మహిళలపై వీధికుక్కలు దాడి చేశారు. రైల్వే శాఖలో ఉద్యోగం చేస్తున్న అన్నపూర్ణ, లక్ష్మీ గురువారం రైల్వే క్వార్టర్స్ వైపు వెళ్తుండగా వీధికుక్కలు ఇద్దరి మహిళలపై ఒక్కసారిగా దాడి చేశాయి. అన్నపూర్ణ అనే మహిళను కిండ పడేసి ముక్కు, మొహంపై కరిచి తీవ్రంగా గాయపర్చాయి. లక్ష్మీ అనే మహిళను కూడా గాయపర్చాయి. వారి అరుపులు విన్న స్థానికులు వీధి కుక్కలను తరిమేశారు. ఘట్ కేసర్ లో వీధి కుక్కల బెడద తీవ్రంగా ఉందని స్థానికులు మున్సిపల్ అధికారులను ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు. 

మరోవైపు గత బుధవారం  సంగారెడ్డి పట్టణంలోని శాంతి నగర్ లో ఆరేళ్ల బాలుడిపై వీధికుక్కల  గుంపు దాడి చేయడంతో షాజన్ పాషా అనే బాలుడికి తీవ్రగాయాలయ్యాయి. ఇంటి ముందు ఆడుకుంటుండగా కుక్కలు దాడి చేశాయి. 

గడిచిన వారం రోజుల్లో వీధి కుక్కల దాడుల ఘటనలు నాలుగైదు జరిగాయి. బాధితులు వీధికుక్కల బెడద నుంచి రక్షించాలని కోరుతున్నారు.