Yummy Food : ముంత మసాలా తరహాలో స్ట్రాబెర్రీ మసాలా..!

మొన్నా మధ్య మ్యాగీ మిల్క్ షేక్.. నిన్నటికి నిన్న చాక్లెట్ సమోసా పావ్.. ఇంటర్నెట్ లో తెగ వైరల్ అయ్యాయి. ఇప్పుడు స్ట్రాబెర్రీ మసాలా వంతు. వినడానికే విచిత్రంగా ఉన్న ఈ కాంబినేషన్ కి బంగ్లాదేశ్లో ఎక్కువే. ఈ రెసిపీ సేమ్ టు సేమ్ మన ముంత మసాలాలానే ఉండటంతో ఇండియాలోనూ ఫ్యాన్స్, హాట్ టాపిక్ అయింది. 

ఈ వెరైటీ స్ట్రాబెర్రీ రెసిపీని ఇన్స్టాగ్రామ్లో 'అవర్ కలెక్షన్' అనే పేజీలో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో.. అచ్చం ముంత మసాలా బండిని పోలి ఉంది సెటప్. ఒకతను స్ట్రాబెర్రీలను కడిగి చిన్న చిన్న ముక్కలుగా చేశాడు. వాటిని జార్లోకి తీసుకొని, అందులో ఉప్పు, కొన్ని మసాలాలు కూడా వేసి మూతపెట్టాడు. దాన్ని బాగా షేక్ చేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకున్నాడు. 

స్ట్రాబెర్రీ మసాలాని అందుకోవడానికి జనాలు 'క్యూ' కట్టారు. ఈ వీడియోని ఇప్పటివరకు 70 లక్షల మంది చూశారు. కాకపోతే మనవాళ్లు కొందరు మా స్పెషల్ డిష్ ని పాడు చేయకండి అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఏదేమైనా ఈ వారం ఇంటర్నెట్ సెన్సేషన్ అయింది ఈ స్ట్రాబెర్రీ మసాలా.