Bathukamma Special: తెలంగాణ పల్లెల్లో.. జనం మాటల్లో బతుకమ్మ గాథలు ఇవీ..!

తుకమ్మ గురించి పాటల్లో, మాటల్లో ఎన్నో కథలు, గాథలు ప్రచారంలో ఉన్నాయి. కొన్ని చారిత్రక విషయాలతో సంబంధించినవి. మరికొన్ని పురాణ సంబంధమైనవి కాకున్నా, పురాణ పాత్రలకు బతుకమ్మకు సంబంధాన్ని కలిపే కథలు. ఇవే కాకుండా ఒకనాటి ప్రజల జీవితం, కష్టాల నుంచి పుట్టిన పండుగని చెప్పే గాథలూ ఉన్నాయి. కొన్ని కథల మధ్య సారూప్యత, మరికొన్ని కథల మధ్య వైరుధ్యం ఉంది. ఎవరు నమ్మే కథని వారు పాడుకుంటున్నారు..

ధర్మాంగుడి కథ

చోళరాజు ధర్మాంగదుడు.. జైనుడు. ఆయనకు వంద మంది కొడుకులు. అందరూ యోధులే. ఒక్కరూ మిగల్లేదు. అందరూ యుద్ధంలో వీరమరణం చెందారు. లక్ష్మీదేవి అనుగ్రహంతో కొన్నాళ్లకు వారికి ఓ ఆడపిల్ల పుట్టింది. ఆ బిడ్డని శివుడు 'నిండు నూరేళ్లు బతుకమ్మా' అని దీవించిండు. ఆ బిడ్డ మంచిగా బతకాలని కోరుకుంటూ ఆమెకు 'బతుకమ్మ' అని పేరు పెట్టారట. ఆమెను వివాహం చేసుకునేందుకు విష్ణుమూర్తి కూడా అవతరించాడు. చక్రాంగుడి పేరుతో అవతరించిన విష్ణుమూర్తి ఆ బతుకమ్మను వివాహమాదాడు. ఆ బతుకమ్మను లక్ష్మి స్వరూపంగా భావించి, పూలతో అలంకరించి పండుగ చేసుకునే సంప్రదాయం. ఆనాటి నుంచి ఉన్నదని, చోళ దేశపు రాజుగారి బిద్దే ఈ బతుకమ్మ అని.. జానపద సాహిత్య పరిశోధనలో ప్రసిద్ధుడైన ప్రొఫెసర్ బిరుదురాజు రామరాజు అభిప్రాయం.

రాణీ రుద్రమ దేవి

బతుకమ్మ గురించి కాకతీయుల కాలం నాటి రచనల్లో ప్రస్తావన ఉంది. కాకతీయ సామ్రాజ్యానికి ఏలిక అయిన రాణి రుద్రమ దేవే బతుకమ్మ అనే కథ కూడా జనం నోళ్లలో నానుతోంది. రాణీ రుద్రమ యుద్ధ సమయంలో ఒక మహిళను కాపాడేందుకు ప్రయత్నించిదట. ఆ ప్రయత్నంలో రుద్రమ చనిపోతుంది. ఆ చుట్టూ ఉన్న మహిళలు ఆమెను 'బతుకమ్మా బతుకమ్మా' అన్నారట. కానీ ఆమె బతకలేదు. ఆ అమ్మ బతకాలని కోరుకున్న వాళ్లంతా రాణీ రుద్రమను బతుకమ్మ పేరుతో కొలుస్తున్నారని మరో కథా ప్రచారంలో ఉంది. రుద్రమదేవి తన మనవళ్లకు ఆరోగ్యం బాగాలేకపోతే బతుకమ్మ పండుగ జరిపించిందనేది కూడా ఉంది.

వదినా సురదళ్ల కథ

పూర్వం అక్కమ్మ అనే యువతి ఉండేదట. ఆమెకు ఏడుగురు అన్నలు. ఏడుగురు వదినలు. పెద్ద వదిన అసూయతో అక్కెమ్మను చంపాలనుకుంది. అన్నలు పనిమీద ఊరికి పోయిన రోజు చూసి పాలలో విషం కలిపి మరదలికి ఇచ్చింది. ఆ పాలు తాగిన అక్కమ్మ చనిపోయింది. ఆ శవాన్ని ఊరి బయట పాతిపెట్టింది. ఆమెను పాతి పెట్టిన చోట ఓ తంగేడు మొలిచింది. ఊరికి పోయిన అన్నలు తిరిగొచ్చారు. విగరబూసిన తంగేడుని చూసి ఓ అన్న పూలను తెంపబోయాడు. ఆ తంగేడు చెట్టులోని చెల్లెలి అత్యతన చావు గురించి చెబుతుంది. అప్పుడా అన్నలు 'నీకేం కావాలో కోరుకో' అంటే 'తంగేడు పూవుల్లో నన్ను చూసుకోండి. ఏటా నా పేరుమీద పండుగ చేయండని కోరిందట. అప్పుడా అన్నలు ఏటా చెల్లెల్ని గుర్తు చేసుకుంటూ. బతుకమ్మ ఆడిస్తున్నరట..

కన్యకా పరమేశ్వరి కథ

వైశ్యుల కుల దేవత వాసవి. ఆమె అందానికి విష్ణువర్ధన మహారాజు ముగ్ధుడైపోతాడు. ఆమెను పెండ్లాడాలని నిశ్చయించుకుంటాడు. వాసవిని తనకిచ్చి వివాహం చేయాలని ఆమె తండ్రి కుసుమ శ్రేష్టిని అడుగుతాడు. విష్ణువర్ధన మహారాజు వేరే కులంవాడు. ఆయనకు బిడ్డనివ్వడం ఇష్టం లేదు. కానీ ఆ రాజు వదిలిపెట్టేలా లేదు. ఈ విపత్కర స్థితిలో కన్యకాపరమేశ్వరి ఆలయంలోని హోమంలో దూకి, అగ్నికి ఆహుతవుతుంది. అప్పటి నుంచి ఆమె ఆత్మాహుతి చేసుకున్న రోజున బతుకమ్మ పండుగ జరుపుకుంటున్నారని ఓ కథ ప్రచారంలో ఉంది. బతుకమ్మ ఆడే వైశ్యులు ప్రధానంగా ఈ కథనే విశ్వసిస్తారు.

గంగా గౌరీ సంవాదం

శివుడు గంగను తలపై మోస్తాడు. శివుడిని పూజించే వాళ్లందరూ శివుడి తలపై గంగను కూడా పూజిస్తున్నారు. పూజలందుకున్న గంగను చూసి పార్వతి అసూయపడింది. బాధతో ఉన్న పార్వతిని తల్లి చేరదీసి అడిగింది. తల్లితో తనగోడు వెళ్లబోసుకుంది పార్వతి. పార్వతిని ఓదార్చుతూ.. "నిన్ను ఆ గంగపై పూల తెప్పలా తేలిస్తా, అందరూ పూజించేలా చేస్తాన'ని ఊరడిస్తుంది. తల్లి చెప్పినట్లుగా పార్వతి (గౌరమ్మ) బతుకమ్మగా మారిందట. ఆ గౌరమ్మను అందరూ పూజిస్తూ గంగలో వదులుతున్నారట.

పార్వతీ వరప్రసాదం

వందల ఏళ్ల కిందట. సంతానం లేని దంపతులు పార్వతిని ప్రార్థించారట. వాళ్లకు ఓ రోజు అమ్మాయి దొరుకుతుంది. తమ కోరిక తీర్చుతూ పార్వతి ఈ బిడ్డను ప్రసాదించిందని, ఇది పార్వతి వరమని వాళ్లు నమ్మారు. ఆ అమ్మాయిని ప్రేమగా పెంచి, పెద్ద చేశారు. పెద్దయ్యాక ఆమె చాలా మహిమలు చూపేది. ఆ మహిమలు చూసి అందరూ ఆమె చుట్టూ చేరేవాళ్లు. ఆమెను కొలవడం మొదలుపెట్టారు. అట్ల బతుకమ్మ పండుగొచ్చింది. 

బిడ్డ..బతుకమ్మ

ఒకామెకు పుట్టిన బిడ్డలు పుట్టినట్లే. చనిపోతున్నరట. ఎంతోమంది. చనిపోయిన తర్వాత ఇంకో బిడ్డ పుట్టింది. బిడ్డ పుట్టాలని, ఆమె బతకాలని ఆమె ప్రార్థించిందట. పార్వతి కరుణించి. ఓ బిడ్డను ప్రసాదించిందట. ఆమెకో బిడ్డ పుట్టింది. ఆ బిడ్డకు 'బతుకమ్మ' అని పేరు పెట్టుకున్నారు. ఆ పేరున్న బిడ్డ బతికింది. అప్పటి నుంచి ఆ పేరుతో బిడ్డలు బతకాలని బతుకమ్మ పండుగ జరుపుకుంటున్నట్లు ఓ కథ చెప్పుకుంటారు.

బతుకమ్మ

భూస్వాముల వేధింపులు తాళలేక ఒక బాలిక ఆత్మహత్యాయత్నం చేసుకుందట. ఊరి జనమంతా ఆమె చిరకాలం బతకాలని కోరుకుంటూ బతుకమ్మా' అని దీవించారట. స్త్రీల బాధలకు అదో ఉదాహరణ. ఆ స్త్రీల బాధల్ని తలచుకుంటూ, ఆడవాళ్లకు ఇటువంటి ఆపదలేవీ రాకుండా ఉండాలని కోరుకుంటూ ఆ స్త్రీలందరూ బతుకమ్మ ఆడుతున్నారట.

.. వెలుగు దర్వాజ