మిస్టరీ : రాతి తలలు!

ఓ రైతు పంట వేసేందుకు భూమిని సిద్ధం చేస్తుంటే.. పేద్ద రాయి ఒకటి కనిపించింది. దగ్గరికి వెళ్లి చూస్తే.. అది భారీ తల శిల్పం. వేల ఏండ్ల క్రితం ఆ తలను రాళ్లతో శిల్పంగా చెక్కారని తేలింది. ఆ చుట్టు పక్కల తవ్వకాలు జరిపితే అలాంటివే మరో 16 దొరికాయి. వాటిలో ఒక్కొక్కటి ఒక్కో ఆకారంలో, సైజులో ఉన్నాయి. ఓల్మెక్ నాగరికత కాలం నాటి శిల్పాలు అవి అని తేల్చిచెప్పారు ఆర్కియాలిజిస్ట్​లు. కానీ... వాటిని ఎవరు చెక్కారు? ఎందుకు చెక్కారు? ఆ తలలు ఎవరివి? అనేది మాత్రం ఇప్పటికీ తేల్చలేకపోయారు. 

అది1862. మెక్సికోలోని దక్షిణ వెరాక్రూజ్‌ ప్రాంతం. అక్కడ మొక్కజొన్న చేను వేయడానికి చెట్లు, పొదలతో కూడిన ఒక ప్రాంతాన్ని ఎంచుకున్నాడు ఒక రైతు. ఆ భూమిని సాగుకు అనుకూలంగా మార్చేందుకు ముందుగా పొదలు, కొమ్మలు నరికేయాలి అనుకున్నాడు. ఆ పని చేస్తుండగా అతనికి ఒక గుండ్రటి రాయి కనిపించింది. అదేంటా అని దాని దగ్గరికి వెళ్లి చూశాడు. ఆ రాయిని పైకి లేపే ప్రయత్నం చేశాడు.

కానీ.. అది చాలా లోతుకి పాతుకుపోయినట్టు ఉండడంతో పైకి లేపడం సాధ్యం కాలేదు. ఇక లాభం లేదని ఆ రాయి చుట్టూ తవ్వడం మొదలుపెట్టాడు. అప్పుడు అర్థమైంది. అది మామూలు రాయి కాదు.. చెక్కిన మనిషి తల శిల్పం అని. కాకపోతే.. అది తలకిందులుగా ఉంది. దాంతో ఇక లాభం లేదని అధికారులకు సమాచారం ఇచ్చాడు. అక్కడ పరిశోధనలు చేసిన ఆర్కియాలజిస్ట్​లు ఆ తలకు ‘‘ట్రెస్ జపోట్స్ కొలోసల్ హెడ్ 1” అని పేరు పెట్టారు. అది ఓల్మెక్ నాగరికత కాలం నాటిదని గుర్తించారు. 

అలాంటివి మొత్తం 17

పురావస్తు శాస్త్రవేత్తలు ఆ చుట్టుపక్కల నాలుగు ప్రదేశాల్లో తవ్వకాలు జరిపి మొత్తం 17 రాతి తలలను కనుగొన్నారు. వాటిని ఓల్మెక్ కొలోసల్ హెడ్స్ అని పిలుస్తున్నారు. కొన్ని వేల ఏండ్ల క్రితం అక్కడ బతికిన వాళ్ల గురించి ఎన్నో వివరాలను ఆ తలల వల్ల తెలుసుకోగలిగారు. ఓల్మెక్ నాగరికత క్రీస్తు పూర్వం1400 నుండి 400 మధ్యలో దక్షిణ మధ్య మెక్సికోలోని ఉష్ణమండల లోతట్టు ప్రాంతాల్లో డెవలప్‌ అయ్యింది. ప్రస్తుతం ఆ ప్రాంతం వెరాక్రూజ్, టబాస్కోల్లో  ఉంది.

ఈ నాగరికతకు సంబంధించిన క్యాలెండర్ వ్యవస్థ, చిత్రలిపి, దేవతల విగ్రహాల్లాంటివి దొరికినప్పటికీ ఇప్పటికీ చాలా విషయాలు తెలియలేదు. కానీ.. వాళ్లలో విలక్షణమైన కళాకారులు ఉన్నారని ఈ భారీ తలలు చెప్తున్నాయి. ఈ తలలు దొరికిన సాన్ లోరెంజో, లా వెంటా, ట్రెస్ జపోట్స్​ను ఓల్మెక్ నాగరికతకు ప్రధాన కేంద్రాలుగా గుర్తించారు. వాటిలో కొన్ని  నిటారుగా ఉన్నాయి. మరికొన్నింటిని కావాలనే తలకిందులుగా పాతిపెట్టారు. 

ఎలా చెక్కారు? 

ఈ భారీ ఓల్మేక్ తలలను అగ్నిపర్వత బసాల్ట్ బండరాళ్లతో చెక్కారు. ఇవన్నీ ఏకశిలా శిల్పాలే.  కేవలం తలలు మాత్రమే చెక్కడం ఈ నాగరికత ప్రత్యేకత. ఈ శిల్పాల్లో ముఖ్యంగా తలలకు కవచాల్లాంటివి ఉన్నాయి. ఒక్కో తల ఒక్కో పరిమాణంలో ఉంది. చిన్నవి సుమారుగా 1.47 మీటర్లు (4.8 అడుగులు) ఎత్తు ఉన్నాయి. పెద్దవి 3.4 మీటర్ల (11.2 అడుగులు) ఎత్తు వరకు ఉంటాయి. ఒక్కో శిల్పం బరువు 6 నుండి 50 టన్నుల వరకు ఉంది. మరో విషయం ఏంటంటే..  ఇప్పటివరకు దొరికిన17 తలల్లో ప్రతి ఒక్కటీ ప్రత్యేకమైనదే. ఒకదానితో మరొకదానికి పోలికలు లేవు.

దీన్ని బట్టి అవి దేవుళ్ల విగ్రహాలు కాదు. మనుషులవే అని నిర్ధారించారు. కానీ.. ఇలా ప్రత్యేకంగా కొంతమంది విగ్రహాలనే ఎందుకు చెక్కారు. అందులోనూ తలలు మాత్రమే ఎందుకు చెక్కాల్సి వచ్చిందనేది ఇప్పటికీ మిస్టరీనే. అన్ని శిల్పాల ముఖాల కవళికల్లో పరిపక్వత కనిపించింది. నిగనిగలాడే బుగ్గలు, చప్పిడి ముక్కు.. అన్నింటిలో ఈ లక్షణాలు కనిపించాయి. వీటిలోని చాలా తలల్లో పెదాలు దొడ్డుగా ఉన్నాయి. అందరికీ  తలల మీద హెల్మెట్ లాంటి ఒక సేఫ్‌గార్డ్‌ ఉంది. ఇలాంటివి మెసోఅమెరికన్ సంస్కృతుల్లో యుద్ధం చేసేవాళ్లు, నాయకులు మాత్రమే పెట్టుకునే వాళ్లు. అంతేకాదు.. ఈ హెల్మెట్లు ర్యాంక్ లేదా రిలేషన్‌ని సూచించేందుకు వివిధ డిజైన్లలో ఉన్నాయి. కొన్ని హెల్మెట్లలో పక్షి, జాగ్వర్‌‌లాంటి ఆకారాలు కనిపించాయి. 

తలల్లో స్కిల్స్‌ 

ఈ తలలు చెక్కిన వాళ్ల బుర్రల్లో మంచి స్కిల్స్ ఉండడం వల్లే ఇంత అద్భుతంగా చెక్కగలిగారని ఆర్కియాలజిస్టులు అన్నారు. ఇవి చెక్కిన వాళ్లకు రాళ్ల మీద బోలెడంత నాలెడ్జ్‌ ఉంది. అందుకే బాగా చెక్కారు. ఈ తలలు చెక్కడానికి కూడా రాతి పనిముట్లే ఉపయోగించి ఉంటారని ఎక్స్​పర్ట్స్ చెప్పారు.

శిల్పాల కోసం వాడిన రాళ్లు ఈ ప్రాంతానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉండేవి. లోహ పనిముట్లు లేని ఆ కాలంలో అక్కడినుంచి ఇంత పెద్ద రాళ్లను ఎలా తీసుకొచ్చారనేది కూడా మిస్టరీనే. మరో విషయం ఏంటంటే.. ఈ తలలు చెక్కడానికి  కొన్ని నెలలు పట్టేదట. పెద్ద తలలు చెక్కడానికి ఏకంగా కొన్ని ఏండ్లు పట్టేదట. 

తమ పాలకుల స్మారకాలుగా అప్పటివాళ్లు ఈ ఓల్మెక్ కొలోసల్ హెడ్స్ చెక్కించారని ఆర్కియాలజిస్టుల్లో ఎక్కువమంది నమ్ముతున్నారు. కానీ.. వాస్తవం ఏంటనేది ఇప్పటికీ తెలియరాలేదు. పైగా వాటిలో కొన్నింటిని పెద్దగా.. కొన్నింటిని చిన్నగా ఎందుకు చెక్కారు? కొన్నింటిని నేలలో తలకిందులుగా పాతిపెట్టడానికి కారణమేంటి? అనేది ఇప్పటికీ తెలియలేదు.