మున్సిపల్ ​కార్పొరేషన్​ ఏర్పాటుకు  ప్రతిపాదనలు సిద్ధం!

  • కొత్తగూడెం, పాల్వంచ పట్టణాలను కలుపుతూ ప్లాన్

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : జిల్లాలో కొత్తగా మున్సిపల్​కార్పొరేషన్​ ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీలతో పాటు పలు ఏజెన్సీ గ్రామాలను విలీనం చేస్తూ కార్పొరేషన్​ ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలు రూపొందించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో ఆఫీసర్లు ఆ పనిలో నిమగ్నమయ్యారు. కార్పొరేషన్​ ఏర్పాటుపై సాధ్యాసాధ్యాలతో ఆఫీసర్లు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. 

లీడర్ల కృషితో ప్రతిపాదనలకు ఆదేశం.. 

కొత్తగూడెం–పాల్వంచ మున్సిపాలిటీలను కలుపుతూ కార్పొరేషన్​ ఏర్పాటుపై తన వంతు కృషి చేస్తానని ఎన్నికల టైంలో కొత్తగూడెం ఎమ్మెల్యే సాంబశివరావు హామీ ఇచ్చారు. ఇదే విషయమై డీప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస​రెడ్డి నియోజకవర్గ ప్రజలకు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్​ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్​ రెడ్డి భద్రాచలంలో పర్యటించిన టైంలో ఆయనకు ఎమ్మెల్యే సాంబశివరావు వినతిపత్రం ఇచ్చారు. కార్పొరేషన్​ ఏర్పాటుపై పలుమార్లు తుమ్మల, భట్టి, పొంగులేటి ద్వారా ఎమ్మెల్యే సీఎం దృష్టికి తీసుకెళ్లారు.

ఈ క్రమంలో కార్పొరేషన్​ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలను పంపాలని కలెక్టరేట్​కు ఇటీవల ప్రభుత్వం నుంచి ఆదేశాలొచ్చాయి. కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీలతో పాటు లక్ష్మీదేవిపల్లి, చుంచుపల్లి, సుజాతనగర్​ మండలాల్లోని ఏఏ గ్రామాలు విలీనం చేయవచ్చన్న వివరాలు నివేదికల రూపంలో అందజేయాలని కోరడంతో ఆ పనిలో ఆఫీసర్లు నిమగ్నమయ్యారు. ఇప్పటికే కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీలకు సంబంధించి జనాభా, వార్డుల వివరాలను కలెక్టరేట్​కు ఆఫీసర్లు పంపించారు. లక్ష్మీదేవిపల్లి, చుంచుపల్లి, సుజాతనగర్​ మండలాల్లోని ఏఏ గ్రామాలు విలీనం అవుతున్నాయి, జనాభా వివరాలను తయారు చేస్తున్నారు. 


కార్పొరేషన్​ఏర్పాటులో కీలకాంశాలు..

పారిశ్రామిక ప్రాంతంగా పేరొందిన కొత్తగూడెం–పాల్వంచ మున్సిపాలిటీలను కలుపుతూ కార్పొరేషన్​ ఏర్పాటు. జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గం మాత్రమే జనరల్ ​సీటు.కేటీపీఎస్, నవభారత్, ఎన్ఎండీసీ, సింగరేణి హెడ్​క్వార్టర్​తో పాటు పలు పరిశ్రమలు, రైల్వే స్టేషన్​, కొత్తగూడెం, పాల్వంచ ప్రాంతాల్లో ఉన్నాయి. 

కొత్తగూడెం–పాల్వంచ మున్సిపాలిటీలు పది కిలోమీటర్ల ​పరిధిలో ఉన్నాయి. 

కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీలతో పాటు సుజాతనగర్​ మండలంలోని సుజాతనగర్, వేపలగడ్డ, మంగపేట గ్రామాలు, చుంచుపల్లి మండలంలోని విద్యానగర్​ కాలనీ, చుంచుపల్లి, త్రీ ఇంక్లైన్, రుద్రంపూర్, గౌతంపూర్​ గ్రామాలు, లక్ష్మీదేవిపల్లి మండలంలోని లక్ష్మీదేవిపల్లి, ప్రశాంత్​ నగర్, చాతకొండ గ్రామ పంచాయతీలు, కారుకొండ, పాల్వంచ మండలంలోని బసవతారకం కాలనీ, జగన్నాధపురం, కేశవాపురం, సోములగూడెం, రంగాపురం, నాగారం ప్రాంతాలను కలుపుతూ ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు. 

 ఆయా ప్రాంతాలతో కూడి కార్పొరేషన్​ఏర్పడితే అర్బన్​ పాపులేషన్​ 2.77.823 ఉండే అవకాశాలున్నాయి. కొత్తగూడెం మున్సిపాలిటీలో 92,654 మంది, పాల్వంచ మున్సిపాలిటీలో 95,823 మంది, చుంచుపల్లి మండలంలో 30,460, లక్ష్మీదేవిపల్లి మండలంలో 30,302 మంది, సుజాతనగర్​ మండలంలో 29,178 మంది జనాభా కార్పోరేషన్​లో కలిసే అవకాశాలున్నాయి.