విగ్రహాలతో రాజకీయాలా

మన దేశంలో ఎందరో వ్యక్తులు అనేక మంచి పనులు చేసి, ఎందరికో  స్ఫూర్తినిచ్చి, రాజకీయాలలో,  సాహిత్యంలో,  కళలలో పరిణతి సాధించి మహానుభావులు అయ్యారు.  ఆ మహానుభావులను మనం గుర్తుంచుకోవడానికి ఎంచుకున్న అనేక మార్గాలలో ఒకటి వారి విగ్రహాల ప్రతిష్టాపన.  ఒకప్పటి విగ్రహాలు  చరిత్రను  గుర్తు చేసేవి.  ఇప్పుడు చరిత్రను తమకు తోచినవిధంగా ప్రకటించుకునే చర్యలలో భాగంగా విగ్రహాలను ఉపయోగిస్తున్నారు.

అభివృద్ధికి చిహ్నాలుగా కూడా వాడుతున్నారు. పర్యాటక అభివృద్ధికి ఎత్తయిన విగ్రహాలు ప్రతిష్టిస్తున్నారు. కొందరు వ్యక్తిగత విగ్రహాలను, పాలాభిషేకాలను ప్రోత్సహిస్తున్న తీరుచూసి ఆశ్చర్యపోతున్నారు. కాకపోతే,  ఈ మధ్య కాలంలో రాజకీయ అవసరాలకు విగ్రహాలను ఒక ఆయుధంగా ఉపయోగిస్తున్నారు. ఒక్కప్పుడు ఈ పరిణామం సానుకూల దృష్టితో చూసిన రాజకీయ పార్టీలు,  నాయకులు  ప్రస్తుతం పోటీపడి దీనిని కలుషితం చేస్తున్నారు.

స్వాతంత్య్రం వచ్చి70 ఏండ్లకుపైగా అయింది.  ప్రజలను ఏకం చేయడానికి  స్వయం పాలన వంటి స్పష్టమైన లక్ష్యంతో ఆలోచన  చేయకపోగా.. భారతదేశం అంటే ఏమిటి? ఎలా ఉండాలనే దానిపై  పోటీ,  వైరుధ్యభరితమైన ఆలోచనలు పాలకుల్లో ఉన్నాయి.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడలి విగ్రహ రాజకీయాలు జోరుగా ఉండేవి.  తెలంగాణా సెక్రెటేరియెట్ చుట్టూ విగ్రహ రాజకీయం కొనసాగుతున్నది. తెలంగాణాలో కొంత భిన్నంగా తెలంగాణా తల్లి విగ్రహం మీద – ఆ తల్లి ఎట్లా ఉండాలి అనే దాని మీద వాదనలు అవుతున్నాయి. ఈ సమస్య మిగతా రాష్ట్రాలలో లేదు.

ఓట్లు,, సానుభూతి, కీర్తి కోసం విగ్రహాల ఏర్పాటు

భారతదేశంలో విగ్రహం ఏ ప్రయోజనం కోసం ఉపయోగపడుతుంది? విగ్రహాలను తొలగిస్తే చరిత్రలో కొంత భాగాన్ని తుడిచివేయడమే అని భావించేవారు ఉన్నారు. పుస్తకాలలోనే కాకుండా ప్రజల మధ్య చరిత్రను సజీవంగా ఉంచడానికి, గుర్తుంచుకోవడానికి విగ్రహాలు ఉపయోగపడతాయి. మురికి నీటి వ్యవస్థ ఏర్పాటు పరిశుభ్రతకు ముఖ్యం. అటువంటి పనికి కూడా దొరకని నిధులు విగ్రహాల ప్రతిష్టాపనకు అందుతున్నాయి. అంటే, సమాజం, పాలకుల ప్రాధాన్యతలు ఎట్లా మారుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. మహిళల విగ్రహాలు చాలా తక్కువ.

ప్రాంతీయ వివక్ష కూడా ఉంది అనే ఆరోపణ ఈనాటిది కాదు. తమకు సంబంధించిన అనేకమంది మహా నేతలను, వ్యక్తులను గుర్తించలేదు అనే భావన చాలా వర్గాలలో ఉంది. విగ్రహాల పోరులో ఆధిపత్య పోరుఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మాయావతి అందరి కన్నా రెండు అడుగులు ముందుకేసి కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఒకే చోట విగ్రహాలను ఏర్పాటు చేసి, దానిని ఒక పర్యాటక కేంద్రంగా మార్చారు. తెలంగాణాలో  కూడా విగ్రహాల  ప్రతిష్టాపన పోటీ మెల్లగా రాజుకుంటున్నది. అర్థబలం, అంగబలం, అధికార బలం ఉంటే  విగ్రహ ప్రతిష్టాపన చాలా సులువు.

ప్రతి కూడలిలో విగ్రహాలు వెలుస్తున్నాయి. కూడలి విగ్రహాలు కొన్ని సందర్భాలలో అధికార, ప్రతిపక్ష పార్టీలు, లేదా ఒకే పక్షంలోని  రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరుగా మారడం మనకు తెలిసిందే. ఈ రోజు ప్రజలందరికి చెందవలసిన విగ్రహాలు ఒక ప్రాంతం లేదా వర్గం లేదా కులం లేదా మతం చెందిన వ్యక్తులు లేదా గుంపుల ఆస్తులుగా భావిస్తున్నారు. భారత స్వాతంత్ర్యం కోసం పోరాడిన భగత్ సింగ్ ఒక సంస్థ కార్యక్రమాలకు పరిమితం అవ్వడం, శివాజీ లాంటి యోధుడు ఒక మతానికి చెందిన వ్యక్తిగా చిత్రీకరించడం మనకు తెలిసిందే.

భారతదేశ రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ దళితుల ప్రతినిధిగానే మిగిలిపోవడం మనం గమనిస్తున్నాం.  మహాత్మా గాంధీ విగ్రహాలకు కూడా ఈ దుస్థితి తప్పలేదు. తెలంగాణా తల్లి తెలంగాణ చిహ్నం అని అందరూ భావిస్తున్నా, రెండు పార్టీల మధ్య ఆ తల్లి రూపురేఖల మీద ఏర్పడిన పోటీ ఆ భావనకు అవకాశం లేకుండా చేసింది. 

దుస్థితిలో మహనీయుల విగ్రహాలు

10 మార్చి  2011నాడు  హైదరాబాద్​లోని  హుస్సేన్ సాగర్ చెరువు కట్టపై (ట్యాంక్ బండ్) మీద జరిగిన విగ్రహాల విధ్వంసంలో ఎవరినీ కూడా చట్టపరంగా శిక్షించిన దాఖలాలు లేవు. కేసులు పెట్టినట్లు పత్రికలలో సమాచారం వచ్చింది. ఈ ఉదంతంలో తీవ్రమైన సెక్షన్లతో కేసులు పెట్టడంరాజకీయ ఒత్తిడుల వలన పరిణమిస్తుంది. అప్పట్లో ఈ సంఘటనపై, మీడియా, పోలీసులు, రాజకీయ నాయకుల స్పందన అనూహ్యం.

కవులు, సాహిత్యకారుల స్పందన ఇంకా ఆశ్చర్యం కలిగించింది. ధ్వంసం అయిన విగ్రహాలు ప్రాచీన కవులు, సంఘ సంస్కర్తలవి  కాబట్టి స్పందించారు అనుకున్నా,  మరుసటి రోజు జరిగిన ర్యాలీలో తెలంగాణ ఉద్యమంపై అసందర్భం, అనవసర వ్యాఖ్యల ద్వారా తాము కూడా రాజకీయ వ్యక్తులమే అని నిరూపించుకున్నారు. అంతకుముందు 20 ఏండ్లుగా అవే విగ్రహాలు ఎటువంటి పరిస్థితులలో ఉన్నాయో ఎవరు పట్టించుకోలేదు. దుమ్ము, ధూళి, హుస్సేన్ సాగర్ చెరువులోని కాలుష్యమయ నీటి నుంచి వస్తున్న విషవాయువుల మధ్య ఈ విగ్రహాలు ఉన్నా పట్టించుకోలేదు.  ఆయా మహనీయుల విగ్రహాలు అక్కడ దుస్థితిలో ఉండడం వారికి గౌరవమా? 

విగ్రహాలకిచ్చే గౌరవం పెరగాలి

విగ్రహ నిర్మాణాలను ప్రస్తుత రాజకీయ, సైద్ధాంతిక నిర్ణేతలు నిర్దేశిస్తున్నారు.  ప్రజలు కోరుకుంటున్నది కాదు. హుస్సేన్​ సాగర్ తీరం వెంబడి అంబేద్కర్ విగ్రహం గత బీఆర్ఎస్​ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం  మహాత్మా గాంధీ విగ్రహం మూసీ తీరం వెంబడి ప్రతిపాదిస్తున్నది.  మహాత్మా గాంధీ,  అంబేద్కర్ ఆశయాలకు లోబడి ఈ రెండు పార్టీలు పనిచేస్తున్నాయానేది ప్రశ్నార్థకం.  మరి ఆ విగ్రహాల ప్రతిష్టాపన దేనికోసం? అధినేతల విపరీత ఆలోచనలకు సానుకూలత సాధించడానికి, చట్టబద్ధత కల్పించడానికి ఈ విగ్రహాల నిర్మాణం ఉపయోగపడుతున్నది.

30 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ఉన్న విగ్రహాలకు చైనా ఇప్పటికీ నిలయంగా ఉందని నమ్ముతారు.  బహుశా  మన దగ్గర పొడవు విగ్రహాల నిర్మాణ పోటీ ఇలానే  కొనసాగితే  భారతదేశం చైనాను మించిపోతుందేమో.  ఎత్తు పెరగడం విశేషం కాకపోవచ్చు.  కానీ, వాటి నిర్వహణ మెరుగు కావాలి. ఆ విగ్రహాలకు ఇచ్చే గౌరవం కూడా పెరగాలి.

ఒక నిర్దిష్ట  సంస్కృతిని గుర్తించడంలో ఉన్న వివక్ష, విగ్రహాలను ఎంచుకోవడంలో ఉంది అని భావించేవారు ఉన్నారు. ఈ మధ్య రాజకీయ నాయకుల విగ్రహాల తాకిడి ఎక్కువ అయ్యింది.  వారసులు నిర్ణేతల స్థానంలో ఉంటే, వారి పూర్వీకుల విగ్రహాలకు స్థానం దక్కినట్టే.  అయితే, రాజ్యాధికారం,  హక్కులు,  ప్రభుత్వ నిధుల కోసం పోరాటాలు ఉధృతం అవుతున్న తరుణంలో  ‘విగ్రహాల ఏర్పాటు’ తాయిలాలుగా మార్చిన వైనం కూడా గమనించాలి.  ‘బుజ్జగింపు’ రాజకీయాలలో  కార్పొరేషన్ల ఏర్పాటు వంటిది ఈ విగ్రహాల ప్రతిష్టాపన.  ఓట్లు, సానుభూతి, కీర్తి కోసం  విగ్రహాల ఏర్పాటు తప్ప అంతిమంగా ఆయా వర్గాలకు ఒరిగేది ఏమీ లేదు.

విగ్రహాలపై ఉన్న శ్రద్ధ పర్యావరణంపై ఏది?

హుస్సేన్​ సాగర్ దగ్గర విగ్రహాల ఏర్పాటు వల్ల  సాగర్  పరిస్థితి మెరుగు అవుతుంది అని భావించారు.  బుద్ధ విగ్రహం వల్ల హుస్సేన్​ సాగర్ పవిత్రం కాకపోగా ఇంకా అధ్వానంగా తయారైంది. తుదకు, విగ్రహాలు దీనావస్థకు చేరుకున్నాయి.ఈ మధ్య ఏర్పాటు చేసిన అంబేద్కర్, తెలంగాణా తల్లి,  ఇకముందు రాబోయే మహాత్మా గాంధీ విగ్రహం వలన ఆయా ప్రాంతాలలో వాతావరణ, పర్యావరణ పరిస్థితి మెరుగుపడుతుందనే ఆశ లేదు.

మహాత్మా గాంధీ విగ్రహం వల్ల మూసీ సుందరంగా మారుతుంది అనుకుంటే అది ఆశే అవుతుంది.  మహనీయుల స్మారక స్థలాలు కొంత మెరుగు. వాటి చుట్టూ పచ్చదనం, చెట్లు పెంచుతారు. అదేమీ విచిత్రమో  విగ్రహాల చుట్టూ ఈ ఏర్పాట్లు చేయడం లేదు.  పొడవైన విగ్రహాల చుట్టూ  మొక్కలు, చెట్లు పెంచితే వచ్చే లాభం గురించి ఎందుకు ఆలోచించరు?

- డా. దొంతి నర్సింహారెడ్డి