ఆయిల్ పామ్ ఫ్యాక్టరీకి క్లియరెన్స్​ ఎప్పుడు?

  •     రెండేండ్ల నుంచి లభించని పొల్యూషన్ బోర్డ్ క్లియరెన్స్
  •     కారణాలు చెప్పకుండా బ్రేక్
  •     40 ఎకరాల స్థల సేకరణ పూర్తి
  •     జిల్లాలో ఇప్పటికే  10వేల ఎకరాలకు పైగా సాగు
  •     పంట సాగుచేస్తున్న రైతుల్లో అయోమయం

నిర్మల్, వెలుగు : నిర్మల్ జిల్లా సోన్ మండలం పాక్ పట్ల గ్రామం వద్ద నిర్మించతలపెట్టిన ఆయిల్ పామ్ పరిశ్రమకు రాష్ట్ర పొల్యూషన్ బోర్డ్ క్లియరెన్స్ ఇవ్వడంలేదు. హడావిడిగా ఫ్యాక్టరీ నిర్మాణం ప్రారంభించిన నాటి బీఆర్​ఎస్ ​ప్రభుత్వం ఆ తర్వాత పట్టించుకోలేదు. రెండేండ్లుగా పొల్యూషన్​ బోర్డు నుంచి అనుమతులు రాకపోవడంతో ఆ పంట సాగు చేస్తున్న రైతులు ఆందోళన చెందుతున్నారు. పంట చేతికొస్తే ఎక్కడ అమ్ముకోవాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు.

రూ.300 కోట్లతో ఏర్పాటుకు ముందుకొచ్చిన మలేషియా కంపెనీ

సాంప్రదాయ పంటలకు ప్రత్యామ్నాయంగా ఆయిల్ పామ్ పంటను సాగుచేసేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దఎత్తున కార్యాచరణ చేపట్టింది. దీనికనుగుణంగానే ఈ పంటను సాగు చేసే రైతులకు సబ్సిడీపై మొక్కలతోపాటు పంట సాగుకు అవసరమయ్యే ఖర్చుల కింద ఏడాదికి రూ.4,200 ఇన్సెంటివ్ కూడా ఇస్తామని ప్రకటించింది. దీంతో జిల్లాలోని రైతులు దాదాపు మూడేండ్ల నుంచి 10 వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ పంట సాగు చేస్తున్నారు. అప్పటి మంత్రులు కేటీఆర్, ఇంద్రకరణ్​రెడ్డి 2021లో పాక్​పట్లలో ఈ పరిశ్రమ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

మలేషియాకు చెందిన ప్రీ యూనిక్ అనే కంపెనీ దాదాపు రూ.300 కోట్లతో ఈ పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం 40 ఎకరాల స్థలం కేటాయించింది. అలాగే సారంగాపూర్ మండలం బీరవెల్లి లో ఆయిల్ పామ్ మొక్కల నర్సరీని కూడా ఏర్పాటు చేసి అక్కడి నుంచి జిల్లా వ్యాప్తంగా రైతులకు ఈ మొక్కలను సరఫరా చేస్తున్నారు. 

ప్రారంభించి వదిలేసిన బీఆర్​ఎస్

ఓవైపు పంటల సాగు విస్తరిస్తుండడంతోపాటు మరికొందరు రైతులు సైతం ఈ పంట సాగుపై ఆసక్తి చూపిస్తున్నారు. కానీ దిగుబడులు కొనాల్సిన ఆయిల్ పామ్ పరిశ్రమ పనులు మాత్రం ఇంకా మొదలే కాలేదు. మరో ఏడాదిలోగా కొన్నిచోట్ల పంట చేతికొచ్చే అవకాశాలున్నాయి. దీంతో పంట ఎక్కడ అమ్ముకోవాలని రైతులు ఆందోళన చెందుతున్నారు. పరిశ్రమ ఏర్పాటుకు అన్ని రకాల అనుమతులు వచ్చినప్పటికీ..

అప్పటి ప్రభుత్వం పొల్యూషన్ బోర్డ్ క్లియరెన్స్ సాధించడంలో పెద్దగా ఆసక్తి చూపలేదు. అప్పటి పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి జిల్లాకు చెందినవారే అయినప్పటికీ తన శాఖ పరిధిలో ఉన్న ఈ అంశాన్ని పరిష్కరించలేకపోయారు. పొల్యూషన్ బోర్డ్ క్లియరెన్స్ కోసం సంబంధిత యాజమాన్యం రెండేళ్ల నుంచి ఎదురు చూస్తోంది.

కాలుష్యానికి అవకాశం ఉండడంతో..

ఆయిల్ పామ్ ఫ్యాక్టరీకి రాష్ట్ర పొల్యూషన్ బోర్డు నుండి అనుమతులు జారీ కాకపోవడంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పరిశ్రమ నిర్మించే పాక్ పట్ల గ్రామం గోదావరి తీరంలో ఉంది. పరిశ్రమ ద్వారా వెలువడే వ్యర్థాలన్నీ నదిలోకి వదిలే అవకాశం ఉందని, పరిశ్రమ కాలుష్యంతో పంట పొలాలకు నష్టం వాటిల్లుతుందని పొల్యూషన్ బోర్డుకు ఫిర్యాదులు అందినట్లు తెలుస్తోంది. పరిశ్రమ ఏర్పాటు నిర్ణయం సమయంలో రాష్ట్ర పొల్యూషన్ బోర్డు దీనిపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టినపుడు పలువురు రైతులు ఇవే అభ్యంతరాలను వ్యక్తం చేశారు. వీటితోపాటు రాజకీయ కారణాలు కూడా దీని వెనుక ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.  

విస్తరిస్తున్న సాగు

ఆయిల్ పామ్ పంట సాగుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు అందిస్తోంది.  సాంప్రదాయ పంటలకు ప్రత్యామ్నాయంగా ఈ పంటను సాగు చేసేందుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. అంతర్ పంటలు వేసుకునేందుకు కూడా అవకాశం ఉండడంతో ఇందుకు మరో కారణం. దీంతో జిల్లాలో 2022, 2023లో మొత్తం 1322 మంది రైతులు 3,567 ఎకరాల్లో ఆయిల్ పామ్ పంట సాగుచేశారు. అలాగే 2023, 24లో 1,538 మంది రైతులు 3,496 ఎకరాల్లో, 2024, 25లో 3,500 ఎకరాల్లో ఆయిల్ పామ్ పంటను సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటివరకు దాదాపు 2వేలకు పైగా ఎకరాల్లో ఆయిల్ పామ్ మొక్కలు నాటారు.