- వ్యాక్సిన్ వల్ల చిన్నారి చనిపోలేదు: డీఎంహెచ్‌వో
ఎల్లారెడ్డిపేట, వెలుగు: రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో కొన్ని రోజుల కింద 4 నెలల చిన్నారి చనిపోయిన ఘటనపై బుధవారం స్టేట్ మెడికల్ ఆఫీసర్ బృందం ఎంక్వైరీ చేశారు. తన కూతురు అన్విశ్రీ టీకా వికటించి చనిపోయిందని తండ్రి రాకేశ్ ఫిర్యాదు మేరకు పూడ్చి పెట్టిన డెడ్‌బాడీని బయటకు తీసి పోస్టుమార్టం చేసిన విషయం తెలిసిందే.
స్టేట్ మెడికల్ ఆఫీసర్( డబ్ల్యూహెచ్‌వో) మెంబర్ డాక్టర్ అతుల్ ఆధ్వర్యంలో వైద్య బృందం ఎల్లారెడ్డిపేట హాస్పిటల్ కు చేరుకొని చిన్నారి తల్లిదండ్రులను పిలిచి టీకా వేసిన డాక్టర్ స్రవంతిరెడ్డి ఎదుట విచారణ చేపట్టారు. చిన్నారి మృతికి గల కారణాలను ఇరువురిని అడిగి తెలుసుకున్నారు.అనంతరం డీఎంహెచ్‌వో సుమన్ మోహన్ రావు మీడియాతో మాట్లాడుతూ చిన్నారి అన్విశ్రీ హాస్పిటల్ లో టీకా వేసిన 5 రోజులకు ఈనెల 3న చనిపోయిందని పేర్కొన్నారు.
వ్యాక్సిన్ ఇచ్చిన 48 గంటల్లోపు చనిపోతేనే వికటించినట్లు పరిగణిస్తామన్నారు. మరోవైపు పాపకు ఫీవర్‌తోపాటు విరేచనాలు, వాంతులు అయినా నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు. పూర్తి వివరాలతో నాలుగైదు రోజుల్లో నివేదిక ఇస్తామని స్పష్టం చేశారు.