గవర్నర్ పర్యటనకు ఏర్పాట్లు పూర్తి

  • నేటి నుంచి ఆరు జిల్లాల్లో పర్యటించనున్న గవర్నర్‌‌ జిష్ణు దేవ్‌‌ వర్మ 
  • యాదాద్రి, రామప్ప టెంపుల్‌‌.. పర్యాటక ప్రాంతాల సందర్శన
  • షెడ్యూల్‌‌ రిలీజ్‌‌ చేసిన రాజ్‌‌ భవన్‌‌ వర్గాలు ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి సీతక్క

జయశంకర్‌‌ భూపాలపల్లి, వెలుగు: రాష్ట్ర గవర్నర్‌‌ జిష్ణు దేవ్‌‌ వర్మ నేటి నుంచి రాష్ట్రంలో మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. యాదాద్రి భువనగిరి, భూపాలపల్లి లో ప్రపంచ పసిద్ధి గాంచిన యాదాద్రి, రామప్ప దేవాలయాల్లో పూజలు చేయనున్నారు.   ములుగు, వరంగల్‌‌, హన్మకొండ, జనగామ జిల్లాలలో టూరిస్టు ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ములుగు, హనుమకొండ, జనగామ జిల్లాల్లో ప్రభుత్వ ఆఫీసర్లతో ఇంటరాక్ట్‌‌ కానున్నారు. అవార్డు పొందిన రచయితలు, కవులతో నిర్వహించే సమ్మేళనాలలో పాల్గొననున్నారు. 

రాష్ట్ర గవర్నర్‌‌  పర్యటన షెడ్యూల్‌‌ను రాజ్‌‌భవన్‌‌ వర్గాలు విడుదల చేశాయి. దీంతో ములుగు జిల్లాలో గవర్నర్‌‌ పర్యటించే రామప్ప టెంపుల్‌‌, లక్నవరం ప్రాంతాలను రాష్ట్ర పంచాయతీరాజ్‌‌ శాఖ మంత్రి సీతక్క సోమవారం పరిశీలించారు. గవర్నర్‌‌ రాక సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పకడ్భందీ  ఏర్పాట్లు చేస్తున్నట్లుగా మంత్రి ప్రకటించారు. ఎక్కడ, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను మంత్రి ఆదేశించారు.

గవర్నర్‌‌ మూడు రోజుల షెడ్యూల్ 

రాష్ట్ర గవర్నర్‌‌ జిష్ణు దేవ్‌‌ వర్మ మంగళవారం ఉదయం హైదరాబాద్‌‌ నుంచి నేరుగా యాదాద్రి టెంపుల్‌‌కు చేరుకుంటారు. యాదాద్రి లక్ష్మీ నర్సింహస్వామిని దర్శించుకొని పూజలు చేస్తారు. ఉదయం 8.45 గంటలకు అక్కడి నుంచి బయల్దేరి ములుగు జిల్లా కేంద్రానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటలకు జిల్లా ఆఫీసర్లతో గవర్నర్‌‌ ఇంటరాక్ట్‌‌ అవుతారు. ఈ సమావేశం గంట సేపు జరగనుంది. 

మధ్యాహ్నం 1 గంట తర్వాత అవార్డు పొందిన రచయితలు, కవులతో సమావేశమవుతారు. మధ్యాహ్నం 3 గంటలకు యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప టెంపుల్‌‌ను సందర్శించి దేవాలయంలో పూజలు చేస్తారు. ఆ తర్వాత భూపాలపల్లి జిల్లా గణపురంలోని కోటగుళ్లకు చేరుకొని అక్కడ కూడా పూజలు చేస్తారు. సాయత్రం 6 గంటలకు లక్నవరం పర్యాటక ప్రాంతానికి చేరుకొని ఐల్యాండ్‌‌ సందర్శిస్తారు. అనంతరం రాత్రి అక్కడే హరిత కాకతీయ రిసార్ట్‌‌లో రాత్రి బస చేస్తారు. 

28న ఉదయం 8 గంటలకు లక్నవరం నుంచి బయల్దేరి నేరుగా వరంగల్‌‌ ఎన్‌‌ఐటీకి చేరుకుంటారు.  అక్కడ కొద్ది సేపు విశ్రాంతి తీసుకొని ఉదయం 9.45 గంటల నుంచి హనుమకొండ కలెక్టరేట్‌‌లో వరంగల్‌‌, హనుమకొండ జిల్లా ఆఫీసర్లతో వేర్వేరుగా ఇంటరాక్ట్‌‌ అవుతారు. మధ్యాహ్నం 12.15 గంటలకు రచయితలు, కవులతో సమావేశం జరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6.30 వరకు హనుమకొండలోని వెయ్యి స్తంభాల  దేవాలయం, భద్రకాళి, పద్మాక్షి  టెంపుల్‌‌ను దర్శించుకొని పూజలు చేస్తారు.  రాత్రి వరంగల్‌‌ ఎన్‌‌ఐటీలో బస చేస్తారు.
 
29 న ఉదయం 9 గంటలకు వరంగల్‌‌ ఎన్‌‌ఐటీ నుంచి బయల్దేరి జనగామ జిల్లా కలెక్టరేట్‌‌కు చేరుకుంటారు. ఉదయం 10 నుంచి 11.15 వరకు జిల్లా ఆఫీసర్లతో ఇంటరాక్ట్‌‌ అవుతారు.  ఆ తర్వాత ఇదే జిల్లాలోని ఓబుల కేశవాపూర్‌‌ గ్రామానికి చేరుకొని రచయితలు, కవులతో సమావేశం అవుతారు. ఆ తర్వాత అక్కడి నుంచి బయల్దేరి యాదాద్రి భువనగిరి జిల్లాలోని కొలనుపాక సోమేశ్వర టెంపుల్‌‌ చేరుకొని పూజలు చేస్తారు. మధ్యాహ్నం 3.30 గంటలకు ఇదే జిల్లాలోని స్వర్ణగిరి టెంపుల్‌‌ చేరుకుంటారు. 

ఇక్కడ పూజలు చేసిన అనంతరం మధ్యాహ్నం 4 గంటలకు యాదాద్రి జిల్లా కలెక్టరేట్‌‌కు చేరుకొని గంటసేపు జిల్లా ఆఫీసర్లతో ఇంటరాక్ట్‌‌ అవుతారు. ఆ తర్వాత సాయంత్రం 5.15 నుంచి 7 గంటల వరకు ఇదే జిల్లాలోని అవార్డు పొందిన రచయితలు, కవులతో నిర్వహించే సమావేశంలో పాల్గొంటారు. ఆ తర్వాత ఇక్కడి నుంచి నేరుగా హైద్రాబాద్‌‌లోని రాజ్‌‌ భవన్‌‌కు చేరుకుంటారు.