మంచిర్యాల జిల్లా ప్రజలకు తీరనున్న దారి కష్టాలు

  • ఉమ్మడి జిల్లాలోని రూరల్​ రోడ్లకు రూ.105 కోట్లు మంజూరు 
  • సీఆర్​ఆర్​ ఫండ్స్​ కేటాయించిన కాంగ్రెస్ ప్రభుత్వం
  • పంచాయతీ రాజ్​శాఖకు పనులు అప్పగింత

మంచిర్యాల, వెలుగు: గతుకుల రోడ్లతో అవస్థలు పడుతున్న జిల్లా ప్రజలకు దారి కష్టాలు త్వరలోనే తీరనునున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి జిల్లాలోని రోడ్లు, హైలెవల్​ బ్రిడ్జిలు, స్లాబ్​కల్వర్టుల నిర్మాణాలకు రూ.105.44 కోట్లు మంజూరు చేసింది. ఈ పనులను పంచాయతీరాజ్​ఇంజనీరింగ్ డిపార్ట్​మెంట్​కు అప్పగిస్తూ ఆ శాఖ ప్రిన్సిపల్​ సెక్రటరీ లోకేశ్​ కుమార్​ ఇటీవల ఆర్డర్స్​ జారీ చేశారు. పనుల ప్రగతిని బట్టి ఈ ఆర్థిక సంవత్సరంలో పాక్షికంగా, రానున్న ఫైనాన్షియల్​ఇయర్​లో పూర్తిస్థాయిలో బిల్లులు చెల్లించనున్నట్టు ప్రభుత్వం పేర్కొన్నది. ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్న రోడ్లు, బ్రిడ్జిలకు కాంగ్రెస్​ ప్రభుత్వంలో ఎట్టకేలకు మోక్షం లభించడంతో ఆయా గ్రామాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

రోడ్లు, కల్వర్టులకు మోక్షం

ఉమ్మడి జిల్లాలోని గ్రామీణ రోడ్లు అధ్వాన్నంగా మారాయి. చాలా చోట్ల గుంతలుగా ఏర్పడి ప్రమాదకరంగా ఉన్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు పరిస్థితి మరీ అధ్వాన్నంగా మారింది. కేవలం వర్షాలు, వరదలతోనే పంచాయతీ రాజ్, ఆర్అండ్​బీ పరిధిలోని వందల  కిలోమీటర్ల రోడ్లు, అనేక కల్వర్టులు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలోనే వీటి రిపేర్లకు మోక్షం లభించింది. 

అత్యధికంగా మంచిర్యాల జిల్లాలో రూ.50.44 కోట్లు మంజూరు చేసింది. ఒక్కో సెగ్మెంట్​కు రూ.15 కోట్ల చొప్పున కేటాయించింది. ఆదిలాబాద్ ​జిల్లాలోని అదిలాబాద్, బోథ్ నియోజకవర్గానికి రూ.20 కోట్లు నిధులు విడుదలయ్యాయి. స్పెషల్ గ్రాండ్స్ కింద ఆదిలాబాద్ కు మరో రూ.4 కోట్లు అదనంగా విడుదల చేశారు. నిర్మల్​ జిల్లాకు రూ.16 కోట్లు, ఆసిఫాబాద్ ​జిల్లాకు రూ.15 కోట్లు మంజూరయ్యాయి. నిర్మల్ ​జిల్లా ఖానాపూర్​ నియోజకవర్గం పరిధిలోని జన్నారం మండలంలో హైలెవల్ ​బ్రిడ్జితో పాటు రోడ్లకు మరో రూ.5.44 కోట్లు శాంక్షన్ ​చేసింది. ఈ నిధులతో రోడ్లను పునరుద్ధరించి ప్రజల ప్రయాణ తిప్పలు తీరనున్నాయి.

నేతల క్రెడిట్​ వార్

ఆదిలాబాద్, వెలుగు: ప్రభుత్వం నియోజవర్గాలకు విడుదల చేసిన ఫండ్స్ పై రాజకీయ పంచాది నెలకొంది. ఆయా పార్టీలు తమ ఎమ్మెల్యే, నేతల చొరవతో నిధులు వచ్చాయంటూ ఎవరికి వారే కార్యకర్తలు గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారు. దీనికి తోడు సంబరాలు చేసుకుంటూ నేతలకు సన్మానం, క్షీరాభిషేకాలు చేస్తున్నారు. ఆదిలాబాద్ నియోజకవర్గానికి రూ. 10 సీఆర్ఆర్ నిధులతో పాటు స్పెషల్ ఫండ్స్ కింద రూ. 4 కోట్లు విడుదల చేయించారని ఆదిలాబాద్​లోని కాంగ్రెస్ నేతలు నియోజకవర్గ ఇన్​చార్జి కంది శ్రీనివాస్ రెడ్డి ఫ్లెక్సీకి ఇటీవల క్షీరాభిషేకం చేశారు. సీఏం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్కకు పలుమార్లు విన్నవించడంతో నిధులు విడుదలయ్యాయని కాంగ్రెస్​ నేతలు చెబుతున్నారు. 

అయితే గ్రామాల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రిని, మంత్రి సీతక్కను మెప్పించి తమ పార్టీల ఎమ్మెల్యేలు నిధులు రాబట్టారని బీజేపీ, బీఆర్​ఎస్ నేతలు చెప్పుకుంటు న్నారు. నిధులు కేటాయించేందుకు కృషి చేశారని ఎమ్మెల్యే పాయల్ శంకర్​ను ఆ పార్టీ నాయకులు సన్మానించారు. అటు బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ చొరవతో నిధులు విడుదల చేశారంటూ బీఆర్ఎస్ నేతలు సైతం సోషల్ మీడియా వేదికగా ఎమ్మెల్యేకు అభినందనలు చెప్పారు. ఇలా మూడు పార్టీల కార్యకర్తలు నిధులు విడుదలపై ప్రజల్లో తమకు అనుకూలంగా ప్రచారం చేసుకుంటున్నారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో నిధులు రావడం పట్ల పార్టీలు ప్రచారాస్త్రంగా మలుచుకుంటున్నాయనే చర్చ సాగుతోంది.