రుణమాఫీ సంబురం 

  • ఉమ్మడి జిల్లాలో 4.50 లక్షల మంది రైతులకు రూ.3,552 కోట్ల వరకు మాఫీ 
  • నేడు రూ.లక్ష లోపు లోన్లున్న రైతుల ఖాతాల్లో నగదు జమ చేయనున్న సర్కారు 
  • నెలాఖరులోగా రూ.లక్షన్నర వరకు.. ఆగస్టులోగా రూ.2 లక్షలు మాఫీ 

మంచిర్యాల, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ షెడ్యూల్ రిలీజ్ చేయడంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ సర్కారు ఏర్పడిన తర్వాత వంద రోజుల్లోనే రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్​రెడ్డి ప్రకటించినప్పటికీ కాస్త ఆలస్యమైనా ఇచ్చిన మాటకు కట్టుబడి రుణమాఫీకి పూనుకున్నారు. రేషన్ కార్డుతో సంబంధం లేకుండా పట్టాదారు పాస్​బుక్ ఉన్న రైతులందరికీ రూ.2 లక్షల వరకు లోన్లు మాఫీ చేయనున్నట్టు ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో రుణమాఫీ ఎప్పుడవుతుందని ఎదురుచూస్తున్న రైతులు ఊరిపిపీల్చుకున్నారు. పాత లోన్లు క్లియర్ కానుండడంతో వానాకాలం సీజన్​లో కొత్త లోన్లు తీసుకోవచ్చని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 

మొదటి విడతలో రూ.లక్ష లోపు మాఫీ.. 

2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 వరకు వివిధ బ్యాంకుల్లో క్రాప్​ లోన్లు తీసుకుని పెండింగ్ ఉన్న రైతులకు రూ.లక్షల వరకు రుణమాఫీ చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఆదిలాబాద్ జిల్లాలో సుమారు లక్షా 17 వేల మంది రైతులకు రూ.1,030 కోట్లు మాఫీ అయ్యే అవకాశముంది. మంచిర్యాలలో 94 వేల మంది రైతులకు రూ.850 కోట్లు, అలాగే నిర్మల్ లో లక్షా 20 వేల మంది రైతులకు రూ.950 కోట్లు, కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో లక్షా 19 వేల మందికి రూ.722 కోట్లకు పైగా మాఫీ అయ్యే చాన్సుంది.

మొదటి విడతలో భాగంగా గురువారం సాయంత్రంలోగా రూ.లక్ష లోపు రుణాలు పొందిన రైతుల బ్యాంక్ అకౌంట్లలో ప్రభుత్వం నగదు జమచేయనుంది. రూ.లక్ష నుంచి రూ.లక్షన్నర లోన్లను ఈ నెలాఖరులోగా, రూ.లక్షన్నర నుంచి రూ.2 లక్షల రుణాలను ఆగస్టులోగా మాఫీ చేస్తామని సీఎం రేవంత్​రెడ్డి ప్రకటించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు ఆగస్టులోగా అర్హులైన రైతులందరికీ లోన్లు మాఫీ కానున్నాయి. 

నేడు రైతు వేదికల్లో సంబురాలు

మొదటి విడతలో రూ.లక్ష లోపు క్రాప్​ లోన్లు మాఫీ చేస్తున్న సందర్భంగా గురువారం సాయంత్రం 4 గంటలకు రైతు వేదికల్లో రైతులతో సంబురాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు అగ్రికల్చర్ ఆఫీసర్లు ఉమ్మడి జిల్లాలోని ప్రతి మండలంలో ఒక్కో రైతు వేదికలో ఏర్పాట్లు చేశారు. ఆయా క్లస్టర్ ఏఈవోలను రైతు వేదికలకు ఇన్​చార్జీలుగా నియమించగా, స్థానిక ఎంఏవోలను నోడల్ ఆఫీసర్లుగా నియమించారు. వ్యవసాయ అధికారులు లేని మండలాలకు హార్టికల్చర్ ఆఫీసర్లను నోడల్ ఆఫీసర్లుగా నియమించారు. రుణమాఫీ సంబురాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, కలెక్టర్లతో పాటు సంబంధిత అధికారులు పాల్గొంటారు. ఈ మేరకు వ్యవసాయ అధికారులు భారీ సంఖ్యలో రైతులను సమీకరిస్తున్నారు. 

ముఖ్యమంత్రి రుణపడి ఉంటాం

నేను నిరుడు వానాకాలం సీజన్​లో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ లో రూ.90 వేల క్రాప్​లోన్ తీసుకున్న. ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోవడంతో తిరిగి చెల్లించలేదు. ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి రుణమాఫీ చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. నా రుణభారం తీర్చిన ఆయనకు నా కుటుంబం జీవితాంతం రుణపడి ఉంటుంది. 

ఇమ్మడిశెట్టి శంకరయ్య, రైతు (దండేపల్లి)