అప్పుల కిస్తీలు, మిత్తీలకే 64,516 కోట్లు

  • ఏడాది కాలంలో గత పదేండ్ల రుణాలకు చెల్లించిన రాష్ట్ర ప్రభుత్వం
  • అప్పుల కంటే కిస్తీలు, వడ్డీలకే ఎక్కువ రీపేమెంట్లు
  • ఏడాదిలో తెచ్చిన కొత్త అప్పులు రూ.52,118 కోట్లు 
  • అయినా ప్రతిష్టాత్మక స్కీమ్​లకు రూ.61,194  కోట్లు
  • రైతుల సంక్షేమానికేరూ. 57వేల కోట్ల ఖర్చు
  • రూ.2 లక్షల రుణమాఫీకే రూ.20, 617 కోట్లు 
  • అప్పులపై నియంత్రణ పాటిస్తూ..అభివృద్ధి, సంక్షేమం

హైదరాబాద్​, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ఏడాది కాలంలో చేసిన అప్పుల కంటే.. గత ప్రభుత్వం చేసిన అప్పుల కిస్తీలు, మిత్తీలే ఎక్కువగా చెల్లించింది. 2023 డిసెంబర్ నుంచి 2024 నవంబర్ నెలాఖరు వరకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 52,118 కోట్లు కొత్తగా అప్పులు తీసుకుంది.  ఇదే వ్యవధిలో రూ. 64,516 కోట్లు రీపేమెంట్లు (అసలు, వడ్డీలు కలిపి కిస్తీలు తిరిగి చెల్లింపులు) చేసింది. అంటే నెలకు యావరేజ్​గా రూ.5 వేల కోట్ల అప్పు చేస్తుంటే.. అంతకుమించి రూ.6 వేల కోట్లకుపైగా కిస్తీలకు, మిత్తీలకు కడుతున్నది.ఈ పరిస్థితుల్లోనూ కొన్ని ముఖ్యమైన స్కీమ్స్​ను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నది. 2014 నుంచి 2023 వరకు పదేండ్లలో  గత బీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు రూ.7 లక్షల కోట్ల అప్పులు చేసింది. వాటికి చెల్లించాల్సిన వడ్డీలు, కిస్తీలన్నీ కొత్తగా చేపట్టే అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలకు అవరోధాలుగా మారాయి.

అయినప్పటికీ  గత ప్రభుత్వం చేసినట్టుగా ఇష్టారాజ్యంగా అప్పుల జోలికి వెళ్లకుండా..  కాంగ్రెస్​ సర్కారు కొంత నియంత్రణ పాటించింది.  కేవలం ప్రతినెలా జీఎస్డీపీ పరిధిలో తీసుకునే అనుమతించిన ఆర్బీఐ అప్పులు తప్ప బయట ఎలాంటి అప్పులు చేయలేదు. ఇక ప్రతిష్టాత్మక పథకాలకు ఏడాది కాలంలో  రూ.61,194 కోట్లు ఖర్చు చేయడం విశేషం.

Also Read : రిక్రూట్​మెంట్లలో మాది రికార్డ్​

రైతుల సంక్షేమానికి రూ. 57వేల కోట్లు 

ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్​ సర్కారు రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ  చేసింది.  రాష్ట్రంలోని 25.36 లక్షల రైతు కుటుంబాలకు రూ.20, 617 కోట్లు చెల్లించింది.  రైతుల సంక్షేమం, అభివృద్ధికి దాదాపు రూ.57 వేల కోట్లు ఖర్చు చేసింది. రుణమాఫీతోపాటు పెట్టుబడి సాయం, పంటల బీమా, రైతు బీమా, పంట నష్ట పరిహారానికి, వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు, పంట ఉత్పత్తుల కొనుగోళ్లు, సన్న వడ్ల బోనస్‌‌‌‌‌‌‌‌కు భారీగా నిధులను ఖర్చు చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది.

ఇందులో రాష్ట్రంలో ఆగస్టు, సెప్టెంబర్​లో కురిసిన భారీ వర్షాల కారణంగా నష్టపోయిన పంటలకు నష్ట పరిహారంతోపాటు బాధితులకు సాయం అందించేందుకు రూ.260 కోట్లు కేటాయించింది. మహాలక్ష్మి, గృహజ్యోతితోపాటు యువ వికాసాన్ని అమలు చేశారు.  వీటితో పాటు చేయూత, రాజీవ్ ఆరోగ్య శ్రీ, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, రూ.500కు గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల లోపు ఉచిత గృహ విద్యుత్తు, వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు,  బియ్యం సబ్సిడీ, స్కాలర్​షిప్స్​, డైట్ చార్జీల పెంపు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్.. ఇలా అన్ని పథకాలకు కలిపి రూ.61,194 కోట్లు ఖర్చు చేసింది.

 బీసీ, మైనారిటీలకు, ఎస్సీ, ఎస్టీ సంక్షేమానికి నవంబర్ నాటికే దాదాపు రూ.9,888 కోట్లు ఖర్చు చేసినట్టు ప్రభుత్వం వెల్లడించింది.  ప్రభుత్వ ఉద్యోగులకు  ఫస్ట్ తారీఖున జీతాలు వేయడం,  గత ప్రభుత్వం బకాయి పెట్టిన దాదాపు రూ. లక్ష కోట్ల బిల్లులను కూడా క్రమపద్ధతిలోచెల్లిస్తున్నట్టు తెలిపింది.