నిజామాబాద్ స్టార్​ హోటల్స్​లో కుళ్లిన మాంసం

  • అపరిశుభ్ర పరిసరాల్లో పదార్థాల తయారీ
  • అనుమానాస్పద మసాల పౌడర్ల శాంపిళ్ల సేకరణ
  • నగరంలో ఫుడ్​ సేఫ్టీ టాస్క్​ఫార్స్​ దాడులు

నిజామాబాద్,  వెలుగు:  నిజామాబాద్​ లోని రెండు స్టార్​ హోటల్స్​, ఒక స్వీట్​ షాప్, మిర్చి కాంపౌండ్​లో మసాలాలు విక్రయించే దుకాణాలపై శనివారం స్టేట్​ఫుడ్​సేఫ్టీ టాస్క్​ఫోర్స్ టీం సభ్యులు దాడులు చేయగా విస్తుబోయే విషయాలు వెలుగుచూశాయి. లహరి హోటల్​ కిచెన్​ పరిశీలించి, ప్లాస్టిక్​ కవర్లో నిల్వ చేసిన 122 కిలోల మాంసాన్ని  గుర్తించారు. రూ.30 వేల విలువగల కుళ్లిన మాంసం ఐటమ్స్, వంటల కోసం ఉపయోగిస్తున్న హానికరమైన రంగులు, మాసాల మిర్చి పేస్ట్​, ఫంగస్​ పట్టిన కూరగాయలను గుర్తించి వాటిని ధ్వంసం చేశారు. హోటల్​ మేనేజ్​మెంట్​కు జోనల్​ అసిస్టెంట్​ ఫుడ్​ కంట్రోలర్​ వి.జ్యోతిర్మయి నోటీసులు అందజేశారు.

వంశీలో..

వంశీ ఇంటర్నేషనల్​ హోటల్​లో తనిఖీలు చేపట్టి హానికరమైన రంగులతో  తయారు చేసి ఫ్రిజ్​లో నిల్వ చేసిన నాన్​వెజ్​ఐటమ్స్​ను గుర్తించారు. కాలం చెల్లిన కారంపొడి, మసాల పొడులు వాడుతున్నట్లు నిర్ధారించారు.  వెలుతురు, వెంటిలేషన్ ​లేని అపరిశుభ్ర పరిసరాలున్న కిచెన్​లో వంటలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ మేనేజ్​మెంట్​కు నోటీసు అందజేశారు. 

అనుమానాస్పద శాంపిల్స్​సేకరించి పరీక్షల కోసం ల్యాబ్​కు తరలించారు. ఢిల్లీవాలా స్వీట్​ హోంపై దాడి చేశారు.  సురక్షితంకాని కిచెన్​లో స్వీట్స్​ తయారు చేస్తున్నారని, పరిస్థితి మారకుంటే క్రిమినల్​ కేసు నమోదు చేయిస్తామని హెచ్చరించారు.   మిర్చి కాంపౌండ్​లో మసాల పొడులు అమ్ముతున్న షాప్​లకు వెళ్లి శాంపిళ్లు కలెక్ట్​ చేసి ల్యాబ్​కు తరలించారు. రిపోర్టు ఆధారంగా చర్యలు​ తీసుకుంటామని అసిస్టెంట్​ ఫుడ్​ కంట్రోలర్​ జోతిర్మయి తెలిపారు.