మహిళల ఆర్థికాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

  • డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

ఖమ్మం టౌన్/మధిర/ముదిగొండ, వెలుగు:  రాష్ట్రంలోని మహిళలు ఆర్థికంగా తమ కాళ్లపై తాము నిలదొక్కుకోవడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. కలెక్టరేట్ వద్ద ఏర్పాటు చేసిన బస్ స్టాప్ షెల్టర్, లేడీస్ లాంజ్, ఉద్యోగుల భోజనశాల, ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ లను కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్, వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్, అడిషనల్​ కలెక్టర్ డాక్టర్  పి. శ్రీజతో కలిసి ఆయన ఆదివారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో మహిళలకు వడ్డీ లేని రుణాలు బంద్ చేశారని, ఇందిరమ్మ రాజ్యం రాగానే మహిళలకు వడ్డీ లేని రుణాల కార్యక్రమాన్ని పున: ప్రారంభించామని తెలిపారు. ప్రతి సంవత్సరం మహిళా సంఘాలకు 20 వేల కోట్ల పైగా వడ్డీ లేని రుణాలు ఇప్పించి ఐదేళ్లలో లక్ష కోట్లు అందిస్తామని తెలిపారు.

ఉచిత బస్సు ప్రయాణం ద్వారా ఆర్టీసీ కు లాభాలు వస్తున్నాయని, కొత్త బస్సులు అవసరం అవుతున్నాయని, మహిళా సంఘాల సభ్యుల గ్రూప్ ల ద్వారా బస్సులు కొనుగోలు చేసి, కొనుగోలుకు ప్రభుత్వమే రుణాలు అందజేసి, ఆ బస్సులు ఆర్టీసీ అద్దెకు ఇచ్చే ప్రణాళికలు తయారు చేస్తున్నట్లు తెలిపారు.

అందరి సంక్షేమమే ధ్యేయం 

రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి క్షేమమే ప్రభుత్వ ధ్యేయం అని డిప్యూటీ సీఎం అన్నారు. మధిర నియోజకవర్గ పరిధిలోని  బోనకల్ మండల పరిధిలో పలు బీటీ రోడ్డు నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. కలకోటలోని జడ్పీహెచ్​ఎస్​లో బీసీ సంక్షేమ శాఖ-, ఎక్సైజ్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో కల్లుగీత కార్మికులకు కాటమయ్య రక్షణ కవచం కిట్లను పంపిణీ చేశారు. కలకోట పెద్ద చెరువులో చేప పిల్లలను మత్స్య సహకార సంఘం సొసైటీ సభ్యులకు అందజేశారు.

చింతకాని మండలం నాగులవంచలోని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అంబటి వెంకటేశ్వరరావు నివాసంలో ఆదివారం  మండలంలోని అనంతసాగర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు డిప్యూటీ సీఎం సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. బీఆర్ఎస్ నాయకులు నూతనపాటి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సుమారు 200 మంది పార్టీలో చేరారు. 

బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిధులు ఇవ్వలే.. 

పదేళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించకపోవడంతోనే అభివృద్ధి చేయలేకపోయామని, ఇప్పుడు ఇందరమ్మ రాజ్యంలో నియోజవర్గ అభివృద్ధికి భారీగా నిధులు తీసుకొస్తున్నామని భట్టి తెలిపారు.

ముదిగొండ మండలం చిరుమర్రి, వెంకటాపురం,ముదిగొండ, యడవల్లి, మాదాపురం గ్రామాల్లో ఆదివారం సాయంత్రం రూ.19.95 కోట్లతో బీటీ రోడ్డు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు దీపావళి కానుకగా పేదలకు ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం చేసుకోవడానికి ప్రభుత్వం రూ.5లక్షల సాయం అందించబోతుందన్నారు. యోగానంద లక్ష్మీనరసింహస్వామి దేవాలయం అభివృద్ధి కోసం రూ.4.74 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.