క్లీన్​ సిటీగా మధిర : భట్టి విక్రమార్క

  • 14 నుంచి ‘నేను–నా మధిర’ కార్యక్రమం
  • మధిర మున్సిపల్  అధికారులతో  ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క రివ్యూ‌‌‌‌‌

మధిర, వెలుగు :  ఈ నెల 14న ‘నేను – నా మధిర’  క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని ప్రారంభించాలని  మధిర పట్టణాన్ని  సుందరీకరించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. శుక్రవారం   క్యాంప్ కార్యాలయంలో  కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తో కలిసి  మున్సిపల్  అధికారులతో సమీక్షించారు. మధిర మున్సిపాలిటీ పరిధిలోని పారిశుధ్య  నిర్వహణ, అభివృద్ధి,  ప్రణాళికల గురించి  మున్సిపల్ కమిషనర్ సంపత్​కుమార్​  ఉప ముఖ్యమంత్రికి వివరించారు. 

ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ   మున్సిపాలిటీ పరిధిలో పారిశుధ్య  నిర్వహణకు   పటిష్ట చర్యలు తీసుకోవాలని, ప్రజలను భాగస్వామ్యం చేస్తూ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుకునేందుకు ‘నేను – నా మధిర క్లీన్ అండ్ గ్రీన్’ అనే కార్యక్రమాన్ని  చేపట్టాలని తెలిపారు.     పట్టణ పరిధిలోని ప్రతి ఇంటికి తడి, పొడి చెత్త వేర్వేరుగా అందించేందుకు రెండు చెత్త బుట్టలను పంపిణీ  చేయాలన్నారు.  ప్రతిరోజు ప్రతి ఇంటికి వెళ్లి చెత్త సేకరణ చేసి డంపింగ్ యార్డ్ కు తరలించాలని, స్వీపింగ్ మిషన్ లు కొనుగోలు చేయాలని తెలిపారు.  

మధిర మున్సిపల్ పరిధిలో పారిశుధ్య వాహనాలకు  జీపీఎస్​ ట్రాకింగ్ ను   కనెక్ట్ చేయాలని  మున్సిపల్ కమిషనర్ కు ఆదేశించారు.  అనంతరం ఇరిగేషన్ డీఈ నాగబ్రహ్మయ్య, సంబంధిత అధికారులతో సమీక్షించి, మహాదేవపురం ఎత్తిపోతల పథకం పనులు జూన్ నాటికి పూర్తి చేయాలని, జాలిముడి ఎడమ, కుడి కాలువ పరిశీలించి, రిపేర్లకు సంబంధించిన ప్రపోజల్స్​  ఇవ్వాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్, ఇరిగేషన్, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు, మధిర, ఎర్రుపాలెం, ముదిగొండ తహశీల్దార్లు రాంబాబు, ఉషా శారద, సునీత ఎలిజబెత్, ఆర్ అండ్ బి అధికారులు, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

అభివృద్ధి పనులు ప్రారంభం  

చింతకాని మండలంలో శుక్రవారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క  పర్యటించారు. రూ. 22 కోట్ల 10 లక్షల తో చేపడుతున్న  రోడ్డు పనులకు  శంకుస్థాపన చేశారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గోదాం, ఆఫీస్, స్టోర్ రూం భవనాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ప్రజల కోసం ప్రజా ప్రభుత్వం  ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ వంటి కార్యక్రమాలను అమలు చేస్తుందన్నారు.

పేద విద్యార్థులకు  కాస్మోటిక్, మెస్ చార్జీలను పెంచామని తెలిపారు. చింతకాని మండలం జగన్నాథపురం లోని  వెంకటేశ్వర స్వామి దేవాలయంలో  మల్లెబోయిన ఉపేందర్- పద్మ దంపతుల కుమార్తె లాత్వికకు  డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నప్రాసన చేశారు.  ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, డీసీసీబీ చైర్మన్​ దొండపాటి వెంకటేశ్వరరావు,  కల్లూరు ఆర్డీఓ.ఎల్.రాజేందర్ గౌడ్, డీసీసీ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గ ప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు  పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్, ఆర్ డబ్ల్యూ.ఎస్. అధికారులు, తదితరులు పాల్గొన్నారు.