సభలు నడవాల్సింది ఎలా?

 ఇటీవల తెలంగాణ అసెంబ్లీలో జరిగిన అనేక పరిణామాలు, చర్చలు కొంత వివాదాస్పదంగా ఉన్నా గతంలో జరిగిన వాటికంటే భిన్నంగానే జరిగాయి. చట్టసభలకు  ప్రజాసమస్యలు ప్రస్తావించే వ్యక్తులు వెళ్లాలా? కేవలం డబ్బును వెదజల్లే గెలిచినవాళ్ళు వెళ్లాలా!  నిజంగా ప్రజా సమస్యలను పరిష్కరించడం చట్టసభల ద్వారా అవుతున్నదా? అనేది ఇవాళ అందరూ ప్రశ్నించుకోవాల్సిన అంశం. ఒకప్పుడు నర్రా రాఘవరెడ్డి లాంటి కమ్యూనిస్టు ఎమ్మెల్యే మాట్లాడుతుంటే చక్కగా వినబుద్ధి అయ్యేది.  చివరకు ఎంబీటీ శాసనసభ్యుడు అమానుల్లాఖాన్ ఉర్దూ, తెలుగు మిక్స్​తో మాట్లాడుతుంటే ఆసక్తిగా ఉండేది.  అటల్ బిహారీ వాజ్ పేయ్, జైపాల్ రెడ్డి, వెంకయ్యనాయుడు,  ప్రమోద్ మహాజన్ వంటి నేతలు చట్టసభల్లో మాట్లాడుతుంటే ప్రజలు సమస్యల పరిష్కారం కన్నా వారి సంభాషణ చాతుర్యం చూసి ముగ్ధులయ్యేవారు. 

తెలంగాణ ఏర్పడిన తర్వాత అసెంబ్లీలో ప్రతిపక్షాల గొంతు వినిపించే అవకాశం లేకుండా చేసింది కేసీఆర్.  లేచి నిలబడ్డ పాపానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి,  సంపత్ కుమార్ సభ్యులపై తీవ్రమైన చర్యలు తీసుకున్నారు. అలాగే ఈటల రాజేందర్ గెలిచాక శాసనసభకు వస్తే మాట్లాడనివ్వలేదు. చివరకు కోర్టుకు వెళ్లి ఆర్డర్ తెచ్చుకుంటే దాని అమలు కానివ్వలేదు. తమకు కావలసిన బిల్లులు మాత్రమే పాస్ చేయించుకోవడం తమకు ఇష్టం ఉన్నన్ని రోజులు మాత్రమే శాసనసభ నడపడం ఒక సంప్రదాయంగా ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం చేసింది. 

రేవంత్​ శైలిలో కాంగ్రెస్​ ప్రభుత్వం

నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అంటూ ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తమ శైలిలో అసెంబ్లీ నడిపిస్తోంది.  సుమారు 70 గంటలు నడిచిన అసెంబ్లీలో  బీఆర్ఎస్ వాళ్లకు కూడా చాలినంత సమయం ఇవ్వడం ఇందులో  చెప్పుకోదగ్గ అంశం.  పార్టీ మారిన ఎమ్మెల్యే దానం నాగేందర్ అంత తీవ్రంగా స్పందించాల్సింది కాదు. ఇక యథాలాపంగా మజ్లిస్ పార్టీ శాసనసభ పార్టీ నేత అక్బరుద్దీన్ ఓవైసీని చూస్తే గత ప్రభుత్వం ఎలా భయపడిందో వినయంగా నటించిందో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అంతే. 

భారతీయ జనతా పార్టీ నుంచి ఏలేటి మహేశ్వర్ రెడ్డి, పాయల్ శంకర్, కాటేపల్లి వెంకటరమణారెడ్డి మంచి మార్కులే సాధించారు.  సీఎం రేవంత్ రెడ్డి ఇన్నేండ్ల తన రాజకీయ స్నేహంలో (పట్లోళ్ల కార్తీక్ రెడ్డి తో మంచి అనుబంధం ఉంది అని చెప్తుంటారు) మొదటిసారి సబితా ఇంద్రారెడ్డిపై విరుచుకుపడ్డంత పనిచేశారు. గతంలో మంత్రిగా పనిచేసిన సబిత ఈసారి ఎందుకో కాస్త తీవ్రంగానే ఆమె స్పందించింది.  

 చర్చలో వికారాబాద్ జిల్లా ఏర్పాటు గురించి ప్రస్తావన వచ్చినప్పుడు సబిత.. జిల్లా ఏర్పాటు క్రమం రంగారెడ్డి జిల్లాలోని కొన్ని భాగాలు విడిపోవడం వల్ల దానికి జరిగిన నష్టం చెప్పకుండా... జిల్లా ఏర్పాటు తప్పు అని అవతలి వాళ్ళు అన్నట్లుగా చివరకు స్పీకర్ ను కూడా అందులోకిలాగే  ప్రయత్నం చేసింది. సీఎం రేవంత్ రెడ్డి అక్కలు మోసం చేస్తారని కేటీఆర్ ను,  కేటీఆర్  మోసం చేస్తాడని అక్కలను రెండు వైపుల నుంచి దీటుగా బదులిచ్చారు. ఇదొక రాజకీయ వ్యూహం. 

బీఆర్ఎస్​ను హైదరాబాద్​లో ఎవరు గెలిపించారు?

కేటీఆర్ తన చదువు గురించి మాట్లాడుతూ తను బాగా చదువుకున్నానని రేవంత్ రెడ్డి అంత చదవలేదని చెప్పే ప్రయత్నం చేశాడు.   తెలంగాణ ఏర్పడడం వల్ల రాజకీయంగా ఎవరికీ ఏ ఇబ్బందీ కలగలేదు. ఇంకా లాభమే కలిగింది.  పెండ్లి సంబంధాలు,  వ్యాపార సంబంధాలు పార్టీల సంబంధాలు నాయకులందరివి బాగానే ఉన్నాయి.  ఎటొచ్చి  ప్రజలే ఇప్పుడు ఇబ్బందిపడుతున్నారు.

  ఎందరో తెలంగాణ ఉద్యోగులు ఆంధ్ర ప్రాంతంలో పనిచేస్తున్నారు. ఆంధ్ర ప్రాంతంలోనివారు తెలంగాణలో ఉన్నారు. ఇప్పటికీ వాళ్ళ బదిలీ సరిగా జరగలే.  కానీ, ఆంధ్ర కాంట్రాక్టర్లు,  సినిమా నటులు ఇక్కడ అపార లబ్ధి పొందుతున్నారు. వాళ్లంతా విశ్వమానవులు. విచిత్రం ఏమిటంటే ఆంధ్రావాళ్లు తెలంగాణ నుంచి వెళ్లిపోవాలని ఉద్యమం చేసిన బీఆర్ఎస్ పార్టీని హైదరాబాద్ ప్రాంతంలో ఎవరు.. ఎందుకు గెలిపించారు.? ఇందులో నష్టపోయింది ఎవరు? 

లాభపడింది ఎవరు? స్పీకర్ పాత్ర చాలా కీలకం

సాధారణంగా ముఖ్యమంత్రుల ఆలోచనలకు అనుగుణంగా స్పీకర్ల నిర్ణయం జరుగుతోంది.  స్పీకర్  ప్రమాణ స్వీకారం రోజు అన్ని పార్టీలవాళ్లు ఆయనను గొప్పగా పొగుడుతారు. ఆ తర్వాత సభలో సమయం ఇవ్వకుంటే ధ్వజమెత్తుతారు.  స్పీకర్ స్థానం ధర్మస్థానం. రాగద్వేషాలు లేని ఉన్నత స్థానం. ముఖ్యమంత్రితో సహా సభలో ఉండే అందరికీ తండ్రిలాంటి స్థానం. ఆ స్థానంలో ఎవరు కూర్చున్నా  దాని పవిత్రతను కాపాడాలి. స్పీకర్లు పార్టీ మారిన శాసనసభ సభ్యుల కేసులను ఐదేండ్ల తమ పదవీకాలం మొత్తం పరిశీలించకుండా ఉండడం. దానివల్ల ప్రజలకు ఆస్థానంపై గౌరవం సన్నగిల్లుతుంది. గతంలో పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పీకర్ గా ఉండి ప్రతిపక్ష సభ్యుల కేసులను తేల్చలేదు.  

అలాగే  సీఎం రేవంత్ రెడ్డి శాసనసభలో మాట్లాడుతూ ఒక దళితుడైన మిమ్మల్ని సభ అధ్యక్షస్థానంలో కూర్చోబెట్టడం వల్ల మీ ముందు అధ్యక్షా అనాల్సి వస్తుందని కేసీఆర్ సభలోకి రావడంలేదని  అన్నాడు. అది సరైన వ్యాఖ్య కాకపోవచ్చు. కానీ,  కేసీఆర్ సభకు వచ్చి మాట్లాడడం మాత్రం సమంజసం.  ఇక్కడున్నవాళ్లకు  మేం సరిపోతాంలే అని జగదీష్ రెడ్డి అనడం కరెక్ట్ కాదు. అది సభా సంప్రదాయం కాదు. వాజ్​పేయ్  జీవితకాలం మొత్తం ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. తన వాక్చాతుర్యంతో నెహ్రూతో  మెప్పు పొందాడు.

 శాసనసభకు ఎన్నికైనవాళ్ళు మానవాతీతులుగా భావించవద్దు. ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ప్రతిపక్ష నాయకుడిగా ఎంత గొప్ప పాత్ర పోషించవచ్చో ఈ దేశంలో ఎందరో గొప్ప గొప్ప నాయకులు చూపించారు.  ఏది ఏమైనా చట్టసభలు పగలు, ప్రతీకారాలకు వేదికలు కావు కదా!  గతంలో తమిళనాడు అసెంబ్లీలో జయలలిత  చెంగు పట్టిలాగిన  దుశ్వాసన పర్వం చూశాం.  తదుపరి ప్రతికారమో కాదో తెలియదు కానీ,  కరుణానిధిని అర్ధరాత్రి పంచ ఊడగొట్టి అరెస్టు చేసిన సంఘటన చూడక తప్పలేదు మరి! తెలంగాణ అసెంబ్లీ ఆ పరిస్థితికి వెళ్లొద్దని ఆశిద్దాం. 

ప్రజాస్వామ్యంలో అర్థవంతమైన చర్చ జరగాలి

కోట్ల రూపాయల విలువైన ప్రజాధనం ఖర్చు చేస్తున్న ఈ ప్రజాస్వామ్యంలో అర్థవంతమైన చర్చ జరగాలి.  అలాకాకుండా కేవలం తమ తమ వ్యక్తిగత అవసరాల చర్చగా మారడానికి కారణం ఏమిటి? శాసనసభకు వెళ్లే వారి పరిజ్ఞానం అమితంగా ఉండాలి.  ఒకప్పుడు సభలు సురవరం ప్రతాపరెడ్డి బూర్గుల రామకృష్ణారావు, గుర్రం జాషువా ఇలాంటి రచయితలతో నిండి ఉండేవి.  ఇటీవల కొందరు కళాకారుల పేరుతో సభలోకి వెళ్లినప్పటికీ ఆత్మస్తుతి పరనిందలాగ సభలు నడిచాయి తప్ప మిగతా సభ్యులందరికీ గౌరవం కలిగించేటట్టుగా లేవు.  

నోముల నరసింహయ్య అసెంబ్లీలో మాట్లాడుతుంటే ఎన్నో సామెతలు ప్రస్తావిస్తూ చక్కగా మాట్లాడేవాడు. ఇప్పుడు కూనంనేని సాంబశివరావు మాట్లాడుతుంటే సింగరేణి కార్మికుల సంఘ నాయకుడు మాట్లాడుతున్నట్టుంది.  నాయకులకు అధ్యయనం అనుశీలనం ఉండాలి.  కేసీఆర్.. తెలంగాణలో నన్ను మించినవాడు  లేడు అని, తనకు తెలంగాణ భాష యాసలపై పట్టు ఉంది కాబట్టి ప్రజలు నన్ను ఆదరిస్తారని అనుకున్నాడు. అది శృతి మించితే జరిగిన పరిణామం కేసీఆర్ ఓటమి.  తమ నాయకులను ప్రసన్నం చేసుకోవడానికి మాట్లాడే శాసనసభ్యులను చూస్తున్నాం. 

- డాక్టర్ పి. భాస్కర యోగి,పొలిటికల్​ ఎనలిస్ట్​