కొత్త సంవత్సరానికి కొత్త రుచులతో వెల్కమ్ చెప్పాలనుకుంటున్నారా? నోరూరించే నాన్ వెజ్ ఐటమ్స్‌తో మార్కులు కొట్టేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకాలస్యం... పాత రుచులకు ‘బై బై’ చెప్తూ... ఇక్కడున్న ఐదు వెరైటీ నాన్ వెజ్ రెసిపీలతో కొత్త ఏడాదిని స్టార్ట్ చేయండి. ఏడాదంతా గుర్తుండిపోయే రుచిని ఆస్వాదించండి. నూతన సంవత్సరం సందర్భంగా... కొత్త రుచులను ఎంజాయ్ చేయండి.
పర్దా మటన్ బిర్యానీ
కావాల్సినవి :
మటన్ - ఒక కిలో
బాస్మతీ రైస్ - రెండు కప్పులు
అల్లం, వెల్లుల్లి పేస్ట్ - ఒక్కో టేబుల్ స్పూన్ చొప్పున
కారం, ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి - ఒక్కో టీస్పూన్ చొప్పున
పసుపు - పావు టీస్పూన్
డ్రై ప్లమ్స్ - పది
బిర్యానీ ఆకులు - ఐదు
అనాస పువ్వులు - నాలుగు
యాలకులు - ఆరు
పెరుగు - మూడు కప్పులు
నూనె, నీళ్లు, ఉప్పు, వేగించిన ఉల్లిగడ్డ తరుగు, కొత్తిమీర - సరిపడా
జాపత్రి - ఒకటి
లవంగాలు - ఆరు
జాజికాయ - సగం
గోధుమపిండి - రెండు కప్పులు
బేకింగ్ పౌడర్, కేవ్రా వాటర్ - పావు టీస్పూన్
పచ్చిమిర్చి - రెండు
పుదీనా - కొంచెం
తయారీ : ఒక గిన్నెలో గోధుమపిండి, బేకింగ్ పౌడర్, రెండు కప్పుల పెరుగు, ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి నీళ్లు పోస్తూ పిండిని ముద్దగా కలిపి పక్కన పెట్టాలి.
ఒక గిన్నెలో మటన్, అల్లం, వెల్లుల్లి పేస్ట్, కారం, ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి, ఉప్పు, పసుపు, డ్రై ప్లమ్స్, మూడు బిర్యానీ ఆకులు, రెండు అనాస పువ్వులు, నాలుగు యాలకులు, ఒక కప్పు పెరుగు, అరకప్పు నూనె వేయాలి. లవంగాలు, జాజి కాయ, జాపత్రి మూడింటినీ కలిపి దంచి పొడి చేయాలి. ఆ పొడిని కూడా అందులో వేయాలి. అవన్నీ కలిసేలా బాగా కలిపి అరగంట పక్కన ఉంచాలి. తర్వాత పాన్ వేడి చేసి అందులో మటన్ మిశ్రమాన్ని వేసి, మూతపెట్టి ఉడికించాలి. తర్వాత అందులో నిమ్మరసం కలపాలి.
మరో పాన్‌లో నీళ్లు పోసి వేడిచేయాలి. తర్వాత అందులో ఉప్పు, రెండు బిర్యానీ ఆకులు, రెండు అనాస పువ్వులు, రెండు యాలకులు వేసి మూత పెట్టాలి. కాసేపయ్యాక అందులో రెండు గంటలసేపు నానబెట్టిన బాస్మతీ బియ్యం వేయాలి. తర్వాత కేవ్రా వాటర్, నూనె వేయాలి. మూతపెట్టి మూడు నిమిషాలు ఉడికించాలి. పుదీనా వేసి కలిపాక, నీళ్లని ఒంపేయాలి.ఆ తర్వాత కలిపి పెట్టిన చపాతీ పిండిని తీసుకుని పెద్ద చపాతీ చేయాలి. ఒక పాన్‌లో నూనె పూసి అం దులో చపాతీని పెట్టాలి. అందులో ఉడికించిన బాస్మతీ రైస్, ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పచ్చిమిర్చి తరుగు వేయాలి. దానిపై ఉడికించిన మటన్ మిశ్రమం వేయాలి. ఇలాగే మరో రెండు లేయర్లు వేశాక, చపా తీని మూసివేసి, మూడు నిమిషాలు ఉడికించాలి. దోశ పాన్ సాయంతో తిరగేసి మరో ఐదు నిమిషాలు ఉడికించాలి. అంతే... ఎంతో టేస్టీగా ఉండే పర్దా మటన్ బిర్యానీ రెడీ.
ఫింగర్ ఫిష్ ఫ్రై
కావాల్సినవి :
చేపలు (బోన్‌లెస్) - 800 గ్రాములు
ఉప్పు, బ్రెడ్ పొడి, నూనె, నీళ్లు - సరిపడా
కారం, మిరియాల పొడి, ఎండుమిర్చి తునకలు - ఒక్కో టీస్పూన్ చొప్పున
నిమ్మరసం - స్పూన్, వెనిగర్ - 2 టేబుల్ స్పూన్లు
మైదా - మూడు టేబుల్ స్పూన్లు
కార్న్ ఫ్లోర్ - ఒకటిన్నర టేబుల్ స్పూన్
కోడిగుడ్లు - రెండు
తయారీ : ఒక గిన్నెలో నీళ్లు పోసి, చేప ముక్కలు వేసి ఐదు నిమిషాలు నానబెట్టాలి. తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసి, ఉప్పు, కారం, మిరియాల పొడి, నిమ్మరసం, వెనిగర్, మైదా, కార్న్ ఫ్లోర్, కోడిగుడ్ల సొన వేసి అన్నీ కలిసేలా బాగా కలపాలి. ఇరవై నిమిషాలు పక్కన ఉంచాలి. తర్వాత వాటిని బ్రెడ్ పొడిలో దొర్లించాలి. పాన్‌లో సరిపడా నూనె పోసి వేడిచేయాలి. వేడి అయిన నూనెలో రెడీ చేసి పెట్టిన చేప ముక్కల్ని వేగించాలి. ఈ క్రిస్పీ ఫిష్ ఫ్రై ఫింగర్స్ని మయోనీస్‌లో కలిపి తింటే టేస్టీగా ఉంటాయి.
బటర్ గార్లిక్ చికెన్
కావాల్సినవి :
చికెన్ (బ్రెస్ట్ పీస్) - 400 గ్రాములు
వెల్లుల్లి రెబ్బలు - పన్నెండు
మిరియాల పొడి, అల్లం- వెల్లుల్లి పేస్ట్ - ఒక్కోటి అర టీస్పూన్ చొప్పున
ఉల్లి కాడలు, ఉప్పు - సరిపడా
వెన్న - 20 గ్రాములు
ఆలివ్ నూనె లేదా నూనె - ఒక టేబుల్ స్పూన్
మైదా - రెండు టేబుల్ స్పూన్లు
నిమ్మరసం - ఒక టీస్పూన్
ఒరిగానో - అర టీస్పూన్
చికెన్ (బోన్స్)- అర కప్పు
కొత్తిమీర - కొంచెం
తయారీ : చికెన్‌ని చిన్న ముక్కలు చేసి అందులో మిరియాల పొడి, అల్లం, వెల్లుల్లి పేస్ట్, ఉల్లి కాడల తరుగు వేసి కలపాలి. తర్వాత వాటిని మైదాలో దొర్లించాలి. పాన్‌లో నూనె వేడి చేసి అందులో చికెన్ వేసి, బాగా ఉడికేవరకు వేగించాలి.
ఒక గిన్నెలో నీళ్లు పోసి అందులో చికెన్ ముక్కలు వేసి ఉడికిస్తే, చికెన్ స్టాక్ రెడీ అయినట్టే. మరో పాన్‌లో వెన్న వేడి చేసి అందులో వెల్లుల్లి రెబ్బలు దంచి వేయాలి. తర్వాత అరటీస్పూన్ మైదా వేయాలి. అందులో ఉల్లికాడల తరుగు, చికెన్ స్టాక్ వేయాలి. మరోసారి మిరియాల పొడి, ఒరిగానో, చికెన్ ముక్కలు వేసి కలపాలి. చివరిగా కొత్తిమీర, నిమ్మరసం చల్లాలి.
గ్రీన్ ఫిష్ తందూరి
కావాల్సినవి :
చేప (పెద్దది) - ఒకటి
కొత్తిమీర, పుదీనా - ఒక్కో కప్పు చొప్పున
అల్లం ముక్కలు (చిన్నవి) - రెండు
పచ్చిమిర్చి - నాలుగు
వెల్లుల్లి రెబ్బలు - ఆరు
నీళ్లు - సరిపడా
గరం మసాలా - ఒక టేబుల్ స్పూన్
నిమ్మరసం - ఒక టీ స్పూన్
తయారీ : చేపను పొలుసులు తీసి, శుభ్రంగా కడగాలి. తర్వాత దానిపై చాకుతో గాట్లు పెట్టాలి. మిక్సీజార్‌లో కొత్తిమీర, పుదీనా, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసి, నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఆ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసి అందులో గరం మసాలా, ఉప్పు, నిమ్మరసం కలపాలి. ఆ మిశ్రమాన్ని చేపకు పట్టించాలి. ఆ తర్వాత రంధ్రాలుండే పాన్ మీద పెట్టి ఉడికించాలి.
ప్రాన్స్ రోస్ట్ కేరళ స్టయిల్
కావాల్సినవి :
రొయ్యలు - అర కిలో
కారం - ఒక టీస్పూన్
పసుపు, ఆవాలు, సోంపు పొడి - అర టీస్పూన్
ఉప్పు - సరిపడా
అల్లం, వెల్లుల్లి పేస్ట్ - ఒక టేబుల్ స్పూన్
కొబ్బరి నూనె - పావు కప్పు
నూనె, కారం - రెండు టేబుల్ స్పూన్లు
గరం మసాలా - పావు టీస్పూన్
సాంబారు ఉల్లిపాయల తరుగు - ఒకటిన్నర కప్పు
టొమాటో - ఒకటి
నీళ్లు - ఒక కప్పు
కరివేపాకు - కొంచెం
తయారీ : ఒక గిన్నెలో రొయ్యలు, కారం, పసుపు, ఉప్పు వేసి కలిపి అరగంట పక్కన ఉంచాలి. పాన్‌లో నూనె వేడి చేసి అందులో రొయ్యల మిశ్రమాన్ని వేగించాలి. ఒక పాన్‌లో నూనె వేడి చేసి ఆవాలు, ఉల్లిగడ్డల తరుగు వేగించాలి. అవి వేగాక అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేయాలి. తర్వాత సోంపు పొడి, కారం, గరం మసాలా వేసి కలపాలి. మూడు నిమిషాలు వేగించాక, అందులో టొమాటో తరుగు వేయాలి. నీళ్లు పోసి, ఉప్పు, కరివేపాకు వేసి కలపాలి. అందులో వేగించిన రొయ్యల్ని కూడా వేయాలి. మిశ్రమం దగ్గరపడేవరకు వేగించి, కొత్తిమీర చల్లితే కేరళ స్టయిల్ రొయ్యల రోస్ట్ రెడీ.