స్టార్ హెల్త్ హ్యాక్.. కస్టమర్ల డేటా లీక్​

  • టెలిగ్రామ్‌‌‌‌లో అమ్మకానికి పెట్టిన వైనం

న్యూఢిల్లీ:  దేశంలోని అతిపెద్ద ఆరోగ్య బీమా కంపెనీల్లో ఒకటైన స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ హ్యాకింగ్ కు గురైంది. స్టార్ హెల్త్ నుంచి 3.10 కోట్ల మంది కస్టమర్ల పేర్లు, వారి ఫోన్ నంబర్లు, అడ్రెస్, మెడికల్ రిపోర్ట్స్ లీక్ అయ్యాయి. చోరీకి గురైన డేటా టెలిగ్రామ్‌‌‌‌ యాప్ లోని చాట్‌‌‌‌బాట్‌‌‌‌ల ద్వారా అందుబాటులోకి వచ్చేసింది. ఈ విషయాన్ని వార్తా సంస్థ రాయిటర్స్ నివేదించింది. ఈ రిపోర్ట్ ప్రకారం..స్టార్ హెల్త్ కు చెందిన మిలియన్ల మంది వినియోగదారుల డేటా  సైబర్ దాడికి గురైంది.

దొంగిలించిన సమాచారంలో  కస్టమర్ల పేర్లు, ఫోన్ నంబర్లు, చిరునామాలు, ఐడీ కాపీలు, ట్యాక్స్ సమాచారంతోపాటు మెడికల్ రికార్డుల వంటి సున్నితమైన సమాచారం కూడా ఉంది. హ్యాకర్లు ఈ సమాచారాన్ని విక్రయించడానికి టెలిగ్రామ్ చాట్‌‌‌‌బాట్‌‌‌‌లను ఉపయోగించారు. "xenZen" అనే యూజర్ చాట్‌‌‌‌బాట్‌‌‌‌ క్రియేట్ చేసినట్లు తెలిసింది.  ఈ లీక్‌‌‌‌ ద్వారా  దొంగతనాలు, ఇతర నేరాలు జరిగే ప్రమాదం ఎక్కువగా ఉంది.

చాట్‌‌‌‌బాట్ ఉపయోగించి తాము పాలసీ, క్లెయిమ్‌‌‌‌ల పత్రాలను డౌన్‌‌‌‌లోడ్ చేసినట్లు కూడా రాయిటర్స్ పేర్కొంది. దీనిపై స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ స్పందించింది. డేటా లీకేజీ గురించి అధికారులకు తెలియజేసినట్లు  ఒక ప్రకటనలో తెలిపింది. “ అనధికారికంగా కస్టమర్ డేటాను  పొందడం, అమ్మడం చట్టవిరుద్ధం. డేటా లీకేజీ సమస్యను  చట్టప్రకారం పరిష్కరిస్తాం. స్టార్ హెల్త్ తన కస్టమర్‌‌‌‌లు, భాగస్వాముల గోప్యతకు హామీ ఇస్తున్నది”అని ఒక ప్రకటనలో పేర్కొంది.