సఖి సిబ్బందికి తొమ్మిది నెలలుగా జీతాల్లేవ్

  • సెంటర్ల నిర్వహణకూ ఫండ్స్ లేక తిప్పలు
  • ఆర్థిక ఇబ్బందులతో ఉద్యోగుల అవస్థలు
  • రాష్ట్రవ్యాప్తంగా రూ.73 కోట్లకు పైగా పెండింగ్
  • రిజైన్ చేసి వేరే జాబ్​లు వెతుక్కుంటున్న సిబ్బంది 

మంచిర్యాల, వెలుగు: సఖి వన్ స్టాప్ సెంటర్ల సిబ్బందికి జీతాలు రెగ్యులర్​గా రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా తొమ్మిది నెలలుగా శాలరీస్ పెండింగ్ ఉండడంతో ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. వాళ్లకు ఇచ్చేవే అరకొర వేతనాలంటే అవి కూడా సక్రమంగా అందకపోవడం కారణంగా కుటుంబాల పోషణకు అప్పులు చేయాల్సి వస్తోందని వాపోతున్నారు. జీతాల విషయాన్ని పలుమార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదంటున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో పలువురు సిబ్బంది ఆ ఉద్యోగాలకు రిజైన్ చేసి వేరే జాబ్​లు వెతుక్కుంటున్నట్టు సమాచారం. 

ఒక్కో సెంటర్లో 13 మంది

సమాజంలో వేధింపులు, లైంగిక దాడులు, డొమెస్టిక్ వయెలెన్స్​కు గురైన మహిళలు, యువతులు, బాలికలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతి జిల్లాకు ఒక సఖి వన్ స్టాప్ సెంటర్​ను ఏర్పాటు చేసింది. వీటి నిర్వహణను ఎన్జీవోలకు అప్పగిం చింది. ఆయా రాష్ట్రాల్లోని విమెన్ డెవలప్​మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్​మెంట్ సఖి సెంటర్లను పర్యవేక్షిస్తుండగా.. నిర్వహణ ఖర్చులను కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తోంది. ఒక్కో సెంటర్​లో సెంటర్ అడ్మినిస్ట్రేటర్(సీఏ), కౌన్సెలర్, లీగల్ కౌన్సెలర్, 
పారామెడికల్, ఇద్దరు కేస్ వర్కర్లు, ముగ్గురు మల్టీపర్పస్ వర్కర్లు, ముగ్గురు సెక్యూరిటీ గార్డులతో పాటు ఒక ఐటీ అసిస్టెంట్ మొత్తం 13 మంది సిబ్బందిని ఔట్ సోర్సింగ్ ద్వారా నియమించారు. వీరికి నెలకు రూ.2.35 లక్షల వేతనాలు, మెయింటెనెన్స్ కోసం రూ.48 వేలు చెల్లిస్తున్నారు.

జీతాలు రాక అవస్థలు

సఖి సెంటర్లలో పనిచేస్తున్న సిబ్బందికి వారి హోదాను బట్టి రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు జీతాలు చెల్లిస్తున్నారు. గతంలో రెండు మూడు నెలలకోసారి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ రిలీజ్ చేసేది. బడ్జెట్ రాగానే ఎన్జీవోల ద్వారా సిబ్బందికి వేతనాలు చెల్లించేవారు. 2023 నవంబర్ వరకు జీతాలు వచ్చాయి. డిసెంబర్ నుంచి ఆగస్టు వరకు మొత్తం తొమ్మిది నెలల శాలరీస్ పెండింగ్ ఉన్నాయి. డిసెంబర్​లో అసెంబ్లీ ఎన్నికలు, మే నెలలో లోక్​సభ ఎలక్షన్స్ ఉండడం వల్ల ప్రభుత్వ పాలనా వ్యవహారాలు స్తంభించాయి. కానీ ఎన్నికల ప్రక్రియ ముగిసి రాష్ట్ర, కేంద్రాల్లో కొత్త ప్రభుత్వాలు కొలువుదీరినా సఖి సెంటర్లకు సంబంధించిన బడ్జెట్ రిలీజ్ చేయకపోవడంతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కో సెంటర్​కు రూ.21.15 లక్షలు, రాష్ట్రవ్యాప్తంగా 34 సెంటర్లకు రూ.71.91 కోట్ల జీతాలు, మెయింటనెన్స్​కు రూ.1.46 కోట్లు పెండింగ్ ఉన్నాయి. 

రిజైన్ చేస్తున్న సిబ్బంది

సఖి సెంటర్లలో సెంటర్ అడ్మినిస్ట్రేటర్​, లీగల్ కౌన్సెలర్, కేస్ వర్కర్ వంటి పోస్టులకు సోషల్ వర్క్​లో పీజీ క్వాలిఫికేషన్​తో పాటు ఎక్స్​పీరియన్స్ అర్హతలుగా నిర్ణయించారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు, తక్కువ జీతాలు అయినప్పటికీ సమాజంలో గౌరవప్రదమైన హోదా కోసం ఉన్నత చదువులు చదివినవారు ఈ కొలువులు చేయడానికి ముందుకొచ్చారు. కానీ వారికి ఇచ్చే అరకొర వేతనాలు సైతం రెగ్యులర్​గా రాకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, అప్పులు చేసి కుటుంబాలను నెట్టుకొస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పలువురు సిబ్బంది సఖి సెంటర్ ఉద్యోగాలకు రిజైన్ చేసి వేరే జాబ్​లు వెతుక్కుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే ఐదారుగురు రిజైన్ చేసినట్టు సమాచారం.