నిండుకుండలా శ్రీరాం సాగర్​ ప్రాజెక్టు

  • శ్రీరాంసాగర్​ ప్రాజెక్టుకు జలకళ
  • ఈయేడు ఎస్సారెస్పీకి 221 టీఎంసీల వరద
  • ప్రస్తుతం 40వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో
  • 6 గేట్లు ద్వారా 18వేల క్యూసెక్కులు గోదావరిలోకి విడుదల
  • ఈ సీజన్లో 23.44 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి

సీజన్​ ప్రారంభంలో ప్రాజెక్టులో 6.39 టీఎంసీలున్న నీరు, నెలాఖరులో ఎగువ నుంచి మరో 3.87 టీఎంసీలకు చేరింది. పెరుగుతున్న వరద నీటిని అధికారులు ఎప్పటి కప్పుడు దిగువకు వదిలారు. జూలైలో ఎగువ గోదావరి పరీవాహక ప్రాంతంలో కురిసిన వర్షాలకు ప్రాజెక్టుకు 31.13 టీఎంసీలకు నీరు చేరింది.  సెప్టెంబర్​ 1 నుంచి వరద తాకిడి పెరడగంతో జలాశయం 90 శాతం నిండింది. కురిసిన భారీ వర్షాలకు జలవిద్యుత్​ కేంద్రంలో 62 మిలియన్​ యూనిట్ల విద్యుత్​ ఉత్పత్తికిగాను 23 మిలియన్​ యూనిట్లు  అయ్యిందని అధికారులు పేర్కొన్నారు. 

బాల్కొండ, వెలుగు: ఈ ఖరీఫ్ సీజన్ లో ఎగువ గోదావరి పరీవాహక ప్రాంతంలో కురిసిన వర్షాలకు శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు భారీగానే వరద నీరు చేరింది. సీజన్ ప్రారంభంలో జూన్1న ప్రాజెక్టులో 6.39 టీఎంసీలు ఉండగా,11న 7.57 టీఎంసీలకు చేరింది,   నెలాఖరులో ఎగువ నుంచి మరో 3.87 టీఎంసీలకు  నీరు వచ్చి చేరింది. జూలైలో ఎగువ గోదావరి పరీవాహక ప్రాంతంలో కురిసిన వర్షాలకు 31.13 టీఎంసీల నీరు చేరడంతో ఖరీఫ్​ సాగునీటి ఇబ్బందులు తప్పాయి.   ప్రాజెక్టులో ఆశించిన మేర నీటి లభ్యత ఉండటంతో రాష్ట్ర స్థాయి నీటి ప్రణాళికా యాజమాన్యం కమిటీ  వానాకాలం పంటలకు నీటిని విడుదల చేయాలని ఆగస్టు 7న నిర్ణయం తీసుకుంది.

ప్రాజెక్టు ప్రధాన కాలువలైన కాకతీయ కెనాల్, సరస్వతీ, లక్ష్మీ కెనాల్ ద్వారా వారబందీ పద్ధతిలో నీటి విడుదల చేపట్టారు. ఆగస్టులో వరదలు రాలేదు.సెప్టెంబర్ 1 నుంచి ప్రాజెక్టుకు వరద తాకిడి పెరిగి రెండు రోజుల్లోనే జలాశయం 90 శాతం నిండింది. ఖరీఫ్, యాసంగి పంటల సాగు నీటి తిప్పలు తప్పాయి. ఆ నెలలోనే గరిష్టంగా 3.5 లక్షల  క్యూసెక్కుల వరద వచ్చింది.

అధికారులు 42 గేట్లద్వారా దిగువ గోదావరిలోకి  2 లక్షల క్యూసెక్కులకు పైగా మిగులు జలాలను వదిలారు. అప్పటి నుంచి ఎగువ నుంచి వరద ప్రవాహం తగ్గుతూ పెరుగుతూ గంగమ్మ పరవళ్లు తొక్కుతోంది. సెప్టెంబర్ లో 219 టీఎంసీల మేరకు ప్రాజెక్టులోకి నీరు వచ్చి చేరగా,146 టీఎంసీలు విడుదల చేసినట్లు  అధికారిక రికార్డులు తెలుపుతున్నాయి. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 40,604 క్యూసెక్కుల వరద కొనసాగుతుండగా, ఆరు గేట్ల ద్వారా 18,744 క్యూసెక్కులు గోదావరిలోకి వదులుతున్నారు.

ఈ ఖరీఫ్ లో పవర్ జనరేషన్​

ఈ ఖరీఫ్ సీజన్లో ఆశించిన స్థాయిలో వరదలు రావడంతో జలవిద్యుత్ కేంద్రంలో 23.44 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి జరిగింది. ఇప్పటివరకు కాకతీయ కాలువకు 20 టీఎంసీలు విడుదల చేశారు. కాకతీయ కాలువ ఆధారంగా నిర్మించిన జలవిద్యుత్ కేంద్రంలోని నాలుగు టర్బయిన్ల ద్వారా 36 మెగావాట్ల పవర్ జనరేట్ చేసే సామర్థ్యం ఉంది, కాకతీయ కాలువకు 6800 క్యూసెక్కులు, ఎస్కేప్ గేట్ల ద్వారా 1200 క్యూసెక్కుల నీటి ప్రవాహానికి 36.17 మెగావాట్లు ఉత్పత్తి చేస్తున్నారు.

ఈ యేడు లక్ష్యానికి మించి కరెంట్ ఉత్పత్తి అవుతోంది. ఈ సీజన్ లో 62 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి లక్ష్యం ఉండగా,ఇప్పటికే 23 మిలియన్ యూనిట్ల కరెంట్ ఉత్పత్తి జరిగింది. వరద కాలువకు 26 టీఎంసీలు, సరస్వతీ కెనాల్ కు 1.05 టీఎంసీ, లక్ష్మీ కి 0.40 టీఎంసీ,ఎస్కేప్ గేట్ల ద్వారా3.90 టీఎంసీలు విడుదల చేశారు.4.50 టీఎంసీల నీరు ఆవిరి అవుతోందని ఆఫీసర్లు పేర్కొన్నారు.  కాలువలకు నీటి విడుదల కొనసాగుతోంది.  ప్రస్తుతం ఎస్సారెస్పీ నిండుకుండలా ఉంది.