- శ్రీరామ సాగర్ లో మిగిలింది 9.876 టీఎంసీలే
- మిషన్ భగీరథకు 2 టీఎంసీల వరకు కేటాయింపు
- వర్షాలు సకాలంలో కురవకపోతే ఇబ్బందులే
- వ్యవసాయ బోర్లు కూడా ఎండిపోయే ప్రమాదం
బాల్కొండ, వెలుగు : ఉత్తర తెలంగాణ వరప్రదాయని నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోని నీరు డెడ్ స్టోరేజీకి చేరువవుతోంది. వేసవిలో ఎండలు దంచి కొట్టడంతో పాటు ఈ ఏడాది వర్షాలు కూడా సమృద్ధిగా కురవకపోవడంతో నీటి మట్టం గణనీయంగా పడిపోయింది. నాలుగైదు సంవత్సరాల్లో ఎన్నడూ లేనంత దిగువకు నీటి నిల్వలు పడిపోయాయి.
ప్రాజెక్టులో 9.876 టీఎంసీల నీరు మాత్రమే
శ్రీరామ సాగర్ నీటి ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా.. ప్రస్తుతం 1055 అడుగులు (9.876) టీఎంసీల నీరు మాత్రమే ఉండటంతో ప్రాజెక్టు అధికారులు, ఆయకట్టు రైతులు, మత్య్సకారులు ఆందోళన చెందుతున్నారు. వర్షాలు ప్రారంభం కావడానికి ఇంకో నెల సమయం పట్టినా.. జులై 1 వ తేదీ వరకు బాబ్రీ ప్రాజెక్టు గేట్లు తెరుచుకోవు. పై నుంచి వరద రావాలంటే జులై 1 వరకు ఆగాల్సిందే. దీనికి తోడు మిషన్ భగీరథకు నీటి సరఫరా చేయడానికి
ఇంకా 1 నుంచి 2 టీఎంసీల నీటిని విడుదల చేయాల్సి ఉంది. ఎండ తీవ్రతతో 250 క్యూసెక్కులకు పైగా నీరు ఆవిరి అవుతోంది. దీంతో నీరు ఎండిపోతుండటంతో చేపలు కూడా మృత్యువాత పడుతున్నాయి. 2011 లో ఇదే సంవత్సరంలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో నీటి మట్టం 24 టీఎంసీల నీరు ఉండగా.. ప్రస్తుతం అది 9.876 టీఎంసీలకు పడిపోయింది.
ప్రస్తుతం ఈ ప్రాజెక్టు నుంచే బాల్కొండ, నిజామాబాద్ , ఆర్మూర్, ఆదిలాబాద్, నిర్మల్ , జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాలకు మిషన్ భగీరథ కింద ఇక్కడి నుంచే నీటిని అందిస్తున్నారు. వర్షాలు సకాలంలో కురవకపోతే ప్రాజెక్టు లో నీరు డెడ్ స్టోరేజీకి చేరిపోతుంది. దీంతో చుట్టు పక్కలా ఉన్న గ్రామాల్లో కూడా వ్యవసాయ బోర్లు కూడా ఎండిపోయే ప్రమాదం నెలకొంది.
దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రాజెక్టులో నీరు నిల్వ ఉండే ప్రాంతాల్లో ఎక్కువగా మట్టి చేరిపోయింది. దాని పూడికతీత పనులు చేపట్టి ప్రాజెక్టు లోతును పెంచేందుకు ఇదే అదునైన సమయమని అంటున్నారు.