ఇద్దరు మహా ఋషుల మహా సమాధి రోజులు.. ఉత్తేజకర జ్ఞాపకాలు

యుగయుగాలుగా ఈ పవిత్ర భారతభూమి ఎందరో గొప్ప దివ్య పురుషుల అడుగుజాడలతో పావనమైంది. మార్చి 9 న మహాసమాధి పొందిన స్వామి శ్రీయుక్తేశ్వర్ గిరి, మార్చి 7 న మహాసమాధి పొందిన పరమహంస యోగానంద అలాంటి ఇద్దరు మహా పురుషులుగా అంతటా గుర్తింపు పొందినవారు. ఎందరికో ప్రేరణనిచ్చే వారి జీవితాలు అసంఖ్యాకమైన భక్తుల సామూహిక చైతన్యంలో ప్రేమ, జ్ఞానాన్ని వ్యాప్తి చెందించి తద్ద్వారా అంతిమ లక్ష్యమైన ఈశ్వరునితో ఏకత్వం సాధించే దిశగా భక్తుల జీవన పరిణామం వేగవంతమయేందుకు తోడ్పడింది.

యోగానంద స్వామి శ్రీయుక్తేశ్వర్ ను చూసేవారికి అనుకోకుండా కలిసినట్టు అనిపించినా, స్పష్టంగా ఒక దివ్య ప్రణాళికను అనుసరించి కాశీలో మొదటిసారి కలిశారు. ఆయన అప్పుడు ముకుందలాల్ ఘోష్ అనే పేరుతో ఉన్న యువకుడు కానీ తన జీవితంలోకి ఒక నిజమైన గురువు ప్రవేశించి ఆయన ప్రేమపూరిత మార్గదర్శకత్వం తనను పరివేష్టించాలని తపిస్తున్నవాడు. కాశీలోని శ్రీయుక్తేశ్వర్ తల్లి ఇంటి మేడ మీద ఆహ్లాదకరమైన ఒక సాయంకాలం జరిగిన ఆ మొదటి సమావేశం వెంటనే ఆనందకరమైనదిగా ఉన్నా, అసమ్మతితో ముగిసింది. ఆ మొదటి సమావేశం గురించి, ఆ తరువాత రానున్న రోజుల్లో తన గురువుతో కలిసి గడిపిన కాలాన్ని గురించీ అత్యధికంగా అమ్ముడుపోతున్న తన ప్రఖ్యాత గ్రంథరాజం ‘ఒకయోగి ఆత్మకథ’లో యోగానంద వర్ణించారు. 

కానీ ఆ తరువాత రానున్న ఏళ్లలో, కోల్ కతాకు దగ్గరిలో ఉన్న శ్రీరాంపూర్ లోని శ్రీయుక్తేశ్వర్ ఆశ్రమంలో ఆ గొప్ప గురువు తీవ్రమైన క్రమశిక్షణకు గురిచేస్తూ, ఆంతరికంగా ప్రేమ నిండిన హృదయంతో అప్పుడే రెక్కలు తొడుగుతూ రానున్న ఏళ్లలో ప్రపంచ ప్రఖ్యాత గురువుగా కీర్తి నార్జించనున్న ఆ భావి సన్యాసిని సానపట్టి మలిచారు. తన గురువు మార్గదర్శకత్వపు ఛత్రఛాయలో ఆ ప్రారంభ సంవత్సరాలు యోగానంద వ్యక్తిత్వాన్ని, ఆయనలోని ఆంతరిక లక్షణాలను ఏ విధంగా తీర్చిదిద్దాయంటే, ఆయన భవిష్యత్తులో క్రియాయోగ శాస్త్రాన్ని ప్రపంచవ్యాప్తం చేసిన ప్రధాన ప్రవక్తగా రూపొంది, రానున్న ఎన్నో యుగాలకు సాటిలేని ఒక ఆధ్యాత్మిక వారసత్వాన్ని రూపొందించారు.