శ్రీ విఠలేశ్వర ఆలయం.. రాత్రికి రాత్రే కట్టారట

కొన్ని వందల ఏండ్ల చరిత్రతో పాటు భక్తులకు కొంగుబంగారమైన ఆలయాలు తెలంగాణలో చాలాఉన్నాయి. అలాంటి వాటిలో నిర్మల్ జిల్లాలోని కుభీర్ మండల కేంద్రంలో ఉన్న శ్రీ విఠలేశ్వర ఆలయం ఒకటి. ఈ గుడి మహారాష్ట్రలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన పండరీ పూర్ విఠలేశ్వర ఆలయాన్ని తలపిస్తుంది. ఇక్కడ పాండురంగ విఠలుడు, రుక్మిణీ దేవి సమేతంగా కొలువై ఉంటాడు. ఈ గుడిలో పండరీపురంలో చేసినట్టే ప్రతిరోజు పూజలు చేస్తారు. గర్భగుడి కూడా పండరీపురం విఠలేశ్వరుడి గర్భగుడిలానే ఉంటుంది. ఈ గర్భగుడిని రాత్రికి రాత్రే కట్టారని పురాణాలు చెబుతున్నాయి.

కంభీర్ లోని శ్రీ విఠలేశ్వర ఆలయానికి దాదాపు 1400 ఏండ్ల చరిత్ర ఉంది. ఇక్కడ ప్రతి ఏడాది 7 రోజులు శ్రీ విఠలేశ్వర జాతర జరుగుతుంది. జాతర రోజుల్లో 'తాళ సప్తమి' వేడుకలు స్పెషల్ అట్రాక్షన్. జాతర ఆఖరి రోజు పూలదండలతో అలం కరించిన రథంలో శ్రీ విఠల రుక్మిణిలను గ్రామంలోని వీధుల గుండా శోభాయాత్ర నిర్వహిస్తారు. ఆ తర్వాత ఆలయ ప్రాంగణంలో భక్తులు సహపంక్తి భోజనాలు చేస్తారు. ఈ జాతరని చూసేందుకు మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు వస్తారు.

కాగడా హారతి

ఇక్కడి విఠలేశ్వర స్వామిని దర్శించుకుంటే సాక్షాత్తు పండరీపురంలోని విఠలేశ్వరుడ్ని దర్శించుకున్నట్లే అని భావిస్తారు భక్తులు. కార్తీక మాసంలో ప్రతిరోజు కాగడా హారతి కొనసాగుతుంది. ఈ హారతి కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. 15 రోజులకి ఒకసారి చేసే ఏకాదశి వ్రతాలను తొలి ఏకాదశి నుంచి ప్రారంభిస్తారు. ఆరోజు నుంచే ఉపవాస దీక్షలు మొదలుపెడతారు. కార్తీక పౌర్ణమి మరుసటి రోజు ఉట్ల పండుగ చేసుకోవడం ఈ ఆలయంలో ఆనవాయితీ. ఇక్కడ జరిగే ఉట్ల పండుగకు స్పెషాలిటీ ఉంది. ఒక చిన్నారికి కృష్ణుడి వేషం వేసి తనతో ఉట్టి కొట్టిస్తారు.

ఇలా వెళ్లాలి

నిర్మల్ జిల్లా నుంచి 60కిలో మీటర్ల దూరంలో ఉంటుంది కుభీర్ విఠలేశ్వర ఆలయం. భైంసా నుంచి అయితే 20 కిలోమీటర్ల జర్నీ.

శుభకార్యాలన్నీ ఇక్కడే

కుభీర్ మండంలోని గ్రామాల ప్రజలు తమ ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా ముందుగా ఈ గుడికే వస్తారు. ఈ ఆలయంలోనే తమ పిల్లల పెండ్లిళ్లు చేస్తారు. మహారాష్ట్ర నుంచి కూడా కొందరు తమ బిడ్డల పెళ్లి జరిపించేందుకు ఇక్కడికి వస్తారు. ఇక్కడ పెండ్లిళ్లు చేస్తే, ఆ జంట పిల్లాపాపలతో, ఆయురారోగ్యాలతో, సంతోషంగా ఉంటారని నమ్మకం. పెళ్లిళ్ల సీజన్లో లో ఇక్కడ రోజు పెండ్లిళ్లదాకా జరుగుతాయి. అంతేకాదు పెళ్లి పత్రికని ఈ ఆలయంలో దేవుడి పాదాల దగ్గర పెట్టడం సెంటిమెంట్గా వస్తోంది.

-బచ్చువార్ ప్రసాద్, ఆలయ కమిటీ కార్యదర్శి