Sri Rama Navami : రాజన్న సన్నిధిలో.. రాములోరి కల్యాణం

రామనవమికి వైష్ణవాలయాల్లో సీతారాముల కల్యాణం చేయడం మామూలే. కానీ.. ఇక్కడ మాత్రం ప్రత్యేకంగా శివుడి సన్నిధిలో అంగరంగ వైభవంగా శ్రీరాముడి పెండ్లి చేస్తారు. ఈ వేడుకను చూసేందుకు దేశం నలుమూలల నుంచి లక్ష మందికి పైగా భక్తులు వస్తారు. 

తెలంగాణలో ప్రముఖంగా పేరుగాంచిన వేములవాడలో రాజరాజేశ్వరస్వామి కొలువై ఉన్నాడు. ఈ ఆలయంలో ఏటా సీతారాముల కల్యాణం చేస్తారు. ఈ సారి శివుడి సన్నిధిలో జరిగే రాములోరి కల్యాణం చూసేందుకు లక్ష మందికి పైగా భక్తులు వస్తారు అంటున్నారు అధికారులు. అందంగా అలంకరించిన కల్యాణ మండపంలో వేద మంత్రోచ్ఛారణలు, మేళ తాళాల మధ్య ఏటా సీతారాముల కల్యాణం జరిపిస్తున్నారు.

ఈ ఉత్సవాలను చూసేందుకు భక్తులతో పాటు దేశం నలుమూలల నుండి శివపార్వతులు, జోగినిలు వస్తారు. కల్యాణం తర్వాత స్వామివార్ల రథోత్సవం ఉంటుంది. సీతారామస్వామి, పార్వతీరాజేశ్వరస్వామి ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా ముస్తాబు చేసి ఊరేగిస్తారు. రథోత్సవంలో శివపార్వతులు, హిజ్రాలు, జోగినిల నృత్యాలు ఆకట్టుకుంటాయి. 

తరలిరానున్న శివపార్వతులు, జోగినిలు

ఈ కల్యాణాన్ని చూసేందుకు దేశవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది శివపార్వతులు, జోగినిలు వేములవాడకు రావడం అనాదిగా కొనసాగుతోంది. కల్యాణం సందర్భంగా తలంబ్రాలు, ముత్యాలు తీసుకొస్తారు వాళ్లు. ఒక వైపు సీతారాముల కల్యాణం జరుగుతుంటే మరోవైపు వాళ్లు కూడా ఒకరిపై ఒకరు తలంబ్రాలు పోసుకుంటూ, చేతిలో త్రిశూలాన్ని కదిలిస్తుంటారు. అలా చేయడం వల్ల శివుడిని పెండ్లి చేసుకుంటున్నట్టు తన్మయత్వం చెందుతారు.

వేములవాడ​​​, వెలుగు