రాజన్న ఆలయంలో శ్రావణ సందడి 

  •     తొలిరోజు భారీగా తరలి వచ్చిన భక్తులు
  •     ఆషాఢంలో భక్తులు లేక వెలవెలబోయిన ఆలయం 

వేములవాడ, వెలుగు : దక్షిణ కాశీగా ప్రసిద్ధి గాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో సోమవారం శ్రావణ మాస వేడుకలు ప్రారంభమయ్యాయి. ఆషాఢంలో భక్తులు లేక ఆలయంతోపాటు పరిసరాలు వెలవెలబోయాయి. సోమవారం శ్రావణ మాసం ప్రారంభం కావడంతో రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చారు. ఉదయమే ఆలయ అర్చకులు రాజన్నకు మహాన్యాస పూర్వక ఏకదాశ రుద్రాభిషేకం నిర్వహించారు.  శ్రీ లక్ష్మీ గణపతి స్వామికి, శ్రీ రాజరాజేశ్వరీ దేవి అమ్మవారికి చతుష్టోపచారాలతో పూజలు చేశారు. శ్రీ స్వామి వారిని దర్శించుకునేందుకు రాష్ట్రంతోపాటు

ఏపీ, మహారాష్ట్ర, చత్తీస్‌‌గఢ్‌‌ రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. శ్రావణమాసం సందర్భంగా  ఓపెన్​ స్లాబ్‌‌లో బాలబ్రహ్మానంద సరస్వతి నైమిశారణ్యం పీఠం శివ లీల విలాసం ప్రవచనలు చేశారు. రాత్రి అద్దాల మండపంలో మహలింగార్జన వైభవంగా నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ఈవో వినోద్‌‌రెడ్డి పర్యవేక్షించారు. 

 రాజన్న ఆలయంలో బ్రేక్​ దర్శనం ప్రారంభం 

వేములవాడ రాజన్న ఆలయంలో సోమవారం నుంచి బ్రేక్‌‌ దర్శనాలు ప్రారంభమయ్యాయి. తిరుపతి, యాదాద్రి ఆలయాల తరహా వేములవాడలోనూ బ్రేక్​ దర్శనాలకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రతిరోజు ఉదయం 10:15 గంటల నుంచి 11:15గంటల వరకు, సాయంత్రం 4గంటల నుంచి 5గంటలకు బ్రేక్‌‌ దర్శనానికి కేటాయించారు. సోమవారం విప్, వేములవాడ ఎమ్మెల్యే బ్రేక్‌‌ దర్శనాన్ని ప్రారంభించారు. అనంతరం స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  బీఆర్​ఎస్​ ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైందన్నారు.

కాంగ్రెస్‌‌ ప్రభుత్వం వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి బడ్జెట్‌‌లో రూ. 50 కోట్లు కేటాయించిందన్నారు. టీటీడీ, యాదాద్రి తరహాలో రాజన్న ఆలయంలో కూడా శీఘ్రదర్శనానికి ఏర్పాట్లు చేసుకోవడం సంతోషమన్నారు. కార్యక్రమంలో ఆలయ ఈవో వినోద్ రెడ్డి, మున్సిపల్​వైఎస్​ చైర్మన్ బింగి మహేశ్‌‌, పట్టణ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్‌‌గౌడ్​పాల్గొన్నారు. 

రాజన్న సన్నిధిలో బీజేపీ ఎల్పీ నేత  పూజలు 

శ్రావణమాసం తొలిరోజు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని బీజేపీ ఎల్పీనేత, నిర్మల్‌‌ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. కోడె మొక్కులు చెల్లించుకున్నారు. ఎమ్మెల్యే దంపతులకు నాగిరెడ్డి మండపంలో అర్చకులు వేదొక్త ఆశీర్వచనం అందజేశారు. ఆయనవెంట  బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ,  రేగుల మల్లికార్జున్ ఉన్నారు.