ఆశ్రమ స్కూళ్లలో స్పోకెన్​ ఇంగ్లిష్​

  •     గిరిజన స్టూడెంట్లలో ఇంగ్లిష్ సామర్థ్యం పెంచడమే లక్ష్యం
  •     ఉమ్మడి ఆదిలాబాద్​లో 132 స్కూళ్లలో అమలు
  •     25 వేల మంది విద్యార్థులకు ప్రయోజనం
  •     ఇంగ్లిష్ క్లాసులపై 283 మంది టీచర్లకు ట్రైనింగ్

ఆదిలాబాద్, వెలుగు : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఐటీడీఏ పరిధిలోని ఆశ్రమ స్కూళ్లలో విద్యార్థులకు ప్రత్యేకంగా స్పోకెన్ ఇంగ్లిష్ ​క్లాసులు నిర్వహించనున్నారు. గిరిజన విద్యార్థుల్లో ఇంగ్లిష్ భాషా సామర్థ్యం పెంచడం కోసం ‘స్పోకెన్ ఇంగ్లిష్ క్లబ్’లను రాష్ట్రంలో మొదటి సారి ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 132 గిరిజన ఆశ్రమ స్కూళ్లలోని 25 వేల మంది 3వ క్లాస్ నుంచి 8వ క్లాస్ విద్యార్థులకు మేలు జరగనుంది. 

 తెలంగాణ ఎడ్యుకేషన్ లీడర్​షిప్ కలెక్టివ్ ఆర్గనైజేషన్ చొరవతో స్పోకెన్ ఇంగ్లిష్​ క్లాసులు నిర్వహించనున్నారు. ఐటీడీఏ పీవో ఖుష్భు గుప్తా చొరవతో ఈ కార్యక్రమ రూపలకల్పన జరిగింది. ఉట్నూర్ ఐటీడీఏ, టీఈఎల్సీ లతో పాటు అలోకిత్, విద్యా విధై, మంత్ర4 చేంజ్, శిక్షలోకం అనే నాలుగు సంస్థలతో కలిసి దీన్ని చేపట్టనున్నారు. ఇందుకోసం ఉమ్మడి జిల్లాలోని 132 బడుల్లోని ఇంగ్లిష్ టీచర్స్ (ఎస్ఏ, ఎస్టీజీ) కు ఇటీవల ఉట్నూర్, ఆసిఫాబాద్ స్పోర్ట్స్ స్కూల్లో రెండు రోజులు ట్రైనింగ్ ఇచ్చారు.

స్టూడెంట్లకు స్పెషల్ క్లాసులు..

ఉమ్మడి జిల్లాలోని ఆశ్రమ స్కూళ్లలో 3వ క్లాస్ నుంచి 8వ క్లాస్ వరకు 25 వేల మంది విద్యార్థులు ఉన్నారు. వీరందరు ఇంగ్లిష్ పై పట్టు సాధించేందుకు ప్రతి వారం రెండు క్లాసులు తీసుకుంటారు. స్కూళ్లలో శిక్షణ పొందిన టీచర్లు ప్రతి వారం టీఈఎల్సీ మార్గదర్శకాలకు అనుగుణంగా బోధన కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఇంగ్లిష్ లో మాట్లాడేలా విద్యార్థుల్లో భాషా నైపుణ్యం మెరుగుపర్చాలని టీచర్లకు అవగాహన కల్పించారు. 

హెడ్ మాస్టర్లు, పీఏంఆర్సీ సిబ్బంది, టీఈఎల్సీ సభ్యుల పర్యవేక్షణ ఉంటుంది. వీరితో పాటు క్లబ్ నిర్వహణ తీరు, టీచర్ల బోధనను పర్యవేక్షించేందుకు స్పెషల్ ఆఫీసర్లను నియమించారు. ఉమ్మడి జిల్లాలో నలుగురు ఏసీఏంవోల ఆధ్వర్యంలో నిరంతరం పర్యవేక్షణ ఉంటుంది. స్పెషల్ క్లాస్ లు ఎలా జరుగుతున్నాయి.. బేస్ లైన్ టెస్ట్, ఎండ్ లైన్ టెస్ట్ పెడుతూ విద్యార్థులు ఎంత మేరకు ఇంగ్లిష్ లో పురోగతి సాధించారనే వివరాలను పీవోకు రిపోర్టు చేయాల్సి ఉంటుంది. ప్రతి రెండు నెలలకు ఒకసారి సమీక్షలు నిర్వహించి, ప్రోగ్రెస్​ను ట్రాక్ చేయనున్నారు. అలాగే భవిష్యత్తులో ప్రైమరీ స్కూళ్లు, 9,10వ తరగతి విద్యార్థుల కోసం ఈ కార్యక్రమం నిర్వహిస్తామని ఐటీడీఏ అధికారులు చెబుతున్నారు.

సక్సెస్​ అయితే వచ్చే సారి ప్రైమరీ నుంచే

ఉట్నూర్ ఐటీడీఏ పరిధిలోని 132 ఆశ్రమ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులు ఇంగ్లిష్ భాషపై పట్టు సాధించాలనే ఉద్దేశంతో స్పోకెన్ ఇంగ్లిష్ క్లబ్ లు ఏర్పాటు చేస్తున్నం. మొదటగా 3వ తరగతి నుంచి 8వ తరగతి చదువుతున్న విద్యార్థుల కోసం స్పెషల్ క్లాసులు నిర్వహించనున్నాం. ఈ క్లాసులపై నిరంతరం పర్యవేక్షణ ఉంటుంది. ఇది సక్సెస్ అయితే వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు, 9,10 వ తరగతి విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లిష్  క్లబ్ ల ద్వారా తరగతులు నిర్వహించాలని నిర్ణయించాం.

ఉమ్మడి జిల్లాలో ఆశ్రమ స్కూళ్లు..

జిల్లా                స్కూళ్లు       విద్యార్థులు   టీచర్లు
ఆదిలాబాద్        54              11,171           125
ఆసిఫాబాద్         46              7,800             90
మంచిర్యాల       16               2,600             34
నిర్మల్                 16               3,432             34
మొత్తం               132             25,003           283