సిటిలో ఉండే భయంకరమైన పొల్యూషన్కి ఆరోగ్యం ఆవిరైతోంది. ఊపిరిత్తుల మొదలుకొని అన్నీ అవయవాలు పాడవుతున్నాయి. మెంటల్ స్ట్రెస్ కి కూడా ఈ పొల్యూషనే కారణం. ఈ పరిస్థితుల్లో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే కచ్చితంగా మంచి ఆహారంతో పాటు ఎక్సర్సైజ్ ముఖ్యమని డాక్టరు చెప్పని రోజు లేదు. కానీ ఎక్సర్ సైజ్ చెయ్యాలంటే చాలా మంది శరీరం 'ఎందుకు లే?' అంటూ బద్ధకానికి బానిస చేసింది. 'సరే.. ఎక్సర్సైజ్ చెయ్యకున్నా పర్లేదు. గానీ...కనీసం 20 నిమిషాలు పార్క్ కు వెళ్లి కూర్చొండి చాలు.. ఆరోగ్యం.. సంతోషం కలగలపుకొని వస్తాయి"అని తాజాగా అమెరికాలోని అల్బమా యూనివర్సిటీ పరిశోధకులు జరిపిన అధ్యయనం సూచిస్తోంది.
రోజూ తమ ఇంటికి దగ్గర్లోని పబ్లిక్ పార్కికి వచ్చి కాసేపు గడుపుతున్న వాళ్లపై ఆరు నెలల పాటు అధ్యయనం చేపట్టారు. వీరిలో 94 మంది యుక్తవయసు వాళ్లు, మరో 94 మంది వయసు పైబడిన వాళ్లు ఉన్నారు. రోజూ పార్క్ లో కనీసం 20 నిమిషాలు గడిపిన వారి ఆరోగ్యం మెరుగుపడినట్లు, మానసికంగా కూడా చాలా ప్రశాంతంగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. వాళ్లు ఎలాంటి ఫిజికల్ యాక్టివిటీ చేయకున్నా.. ఆరోగ్యంగా ఉన్నారని వాళ్లు చెబుతున్నారు.ఈ అధ్యయన వివరాలు ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ హెల్త్ రిసెర్చ్ లో ప్రచురితమయ్యాయి.