లెటర్​ టు ఎడిటర్..​ వేగం వద్దు.. ప్రాణాలు పదిలం

చిన్న ఏమరుపాటువల్ల ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. వాహనాలు నడిపేవాళ్లు విచక్షణ కోల్పోయి నడిపిస్తే మీ ప్రాణాలతోపాటు ఎదుటివారి  జీవితాలను ప్రమాదంలోకి తోసేస్తున్నారు. మీరు ఈ ధరణిపైకి రావడానికి తల్లిగర్భంలో నవమాసాలు వేచి ఉన్నారు. మీరు బుడిబుడి అడుగులు వేయడానికి రెండుసంవత్సరాల కాలం పట్టింది. విద్యను అభ్యసించడానికి  మూడు సంవత్సరాలు ఆగాల్సి వచ్చింది. ఓటు హక్కు రావడానికి పద్దెనిమిది సంవత్సరాలు, ఉద్యోగం సాధించడానికి ఇరవై ఐదు సంవత్సరాలు, వివాహబంధాన్ని పొందడానికి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల  వరకు ఇలా ఎన్నో సందర్భాలలో, ఎన్నో రకాలుగా వేచి ఉన్నారు. కానీ, వాహనం నడిపే సమయంలో మాత్రం ముప్పై సెకండ్లు ఆగలేకపోతున్నారు. 

Also Read : హైకమాండ్ అండతో రేవంత్ జోష్. !

ఓవర్ టేక్ చేయడానికి జీవితాన్ని  పణంగా పెట్టి వాహనాలు నడిపిస్తున్నారు. లిప్తపాటు కాలంలో అనుకోనివిధంగా ఏదైనా ప్రమాదం జరిగితే ఆసుపత్రిలో రోజులు, వారాలు,  నెలలు లేదా సంవత్సరాలు పట్టొచ్చు కోలుకోవడానికి లేదా జీవితకాలం మంచం మీదనే ఉండే పరిస్థితి రావొచ్చు.. లేదా జీవితమే కోల్పోవచ్చు. కొంత ఓపిక లేకపోవడం వల్ల ఎన్నో భయంకరమైన పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుంది.  ముందు వాహనం నడిపేవాళ్లు వెళ్తే వెళ్లనివ్వండి. మీరు ప్రశాంతంగా నిదానంగా మీ ప్రయాణాన్నికొనసాగించండి. మీరు నిర్దిష్ట వేగంతో సరైన దిశలో ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ హెల్మెట్ లేదా సీట్ బెల్ట్  ధరించి వాహనాలు నడిపిస్తే మీరు క్షేమంగా మీ గమ్యానికి చేరుకుంటారు. మిమ్మల్ని ప్రేమించే కుటుంబాన్ని, మిమ్మల్ని అభిమానించే వ్యక్తులను, అహర్నిశలు కష్టాలు పడుతూ మిమ్మల్ని ప్రయోజకులుగా మార్చడానికి ప్రయత్నం చేస్తున్న తల్లిదండ్రుల ఆశల సౌధాలను మననం చేసుకోండి.   ఒకే ఒక్కసారి వచ్చే ఈ మానవ జన్మని  క్షణం కోసం,  క్షణికానందం కోసం పణంగా పెట్టి వాహనాలు వేగంగా నడిపించి అర్దాంతరంగా విలువైన   ప్రాణాలను కోల్పోకండి.

- డాక్టర్ వై. సంజీవ కుమార్