కొత్తగూడెం జీజీహెచ్​కు కొత్త డాక్టర్లు వస్తలే..

  • వరుసగా ఆరుగురు స్పెషలిస్ట్​ డాక్టర్లు ట్రాన్స్​ఫర్​
  • కొత్తగూడెం జీజీహెచ్​లో డాక్టర్ల కొరత   
  • నిలిచిన సర్జరీలు 

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : కొత్తగూడెం  జిల్లా జనరల్​ హాస్పిటల్​(జీజీహెచ్​)కు  స్పెషలిస్ట్​ డాక్టర్లు రావడం లేదు.  ఇటీవల  జరిగిన బదిలీల్లో  హాస్పిటల్​ నుంచి ఆరుగురు స్పెషలిస్ట్​ డాక్టర్లు పలు ప్రాంతాలకు ట్రాన్స్​ఫర్​ అయ్యారు. వాళ్ల స్థానంలో ఇప్పటికీ  ఒక్కరంటే ఒక్కరూ కూడా  రాలేదు.  జీజీహెచ్​ కు వచ్చేందుకు ఏ డాక్టరూ  ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది.  స్పెషలిస్ట్​ డాక్టర్లు ట్రాన్స్​ ఫర్​ కావడంతో గత వారం పది రోజులుగా సర్జరీలు నిలిచిపోయాయి. 

ఆసక్తి చూపని డాక్టర్లు 

మెడికల్​ కాలేజీకి అనుబంధంగా ఉన్న కొత్తగూడెంలోని జిల్లా జనరల్​ హాస్పిటల్​కు   వచ్చేందుకు స్పెషలిస్ట్​ లతో పాటు ఇతర   డాక్టర్లు ఆసక్తి చూపడం లేదు.   జనరల్​ సర్జన్​ ​ డాక్టర్​ సురేందర్​, జనరల్​ మెడిసిన్​ డాక్టర్​ పుష్పలత, అనస్థీషియన్​ డాక్టర్​ శిరీశ్​, కమ్యూనిటీ మెడిసిన్​ డాక్టర్​  వెంకటేశ్వరరావు, చెస్ట్​ ఫిజీషియన్​ సునీల్​, పాథాలజిస్ట్​ సుమయ.

గత వారం రోజుల కిందట ఖమ్మం, మహబూబాబాద్​తో పాటు పలు ప్రాంతాలకు ట్రాన్స్​ ఫర్​ అయ్యారు.   జీజీహెచ్​  నుంచి ఒకేసారి ఆరుగురు స్పెషలిస్టులు ట్రాన్స్​ఫర్​ కావడంతో ఏజెన్సీ ప్రాంతంలో రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు.     డాక్టర్​ పుష్పలత  ఆర్​ఎంఓగా కూడా వ్యవహరించేవారు. ఆమె బదిలీ కావడంతో  సూపరింటెండెంట్​పై మోయలేని భారం పడినట్లవుతుందని పలువురు పేర్కొంటున్నారు. 

నిలిచిన సర్జరీలు :స్పెషలిస్ట్​ డాక్టర్లు ట్రాన్స్​ఫర్స్​పై వెళ్లడంతో కొత్తగూడెంలోని జీజీహెచ్​లో గత వారం రోజులుగా సర్జరీలు నిలిచిపోయాయి.  రోజుకు కనీసం మూడు నుంచి నాలుగు సర్జరీలు జీజీహెచ్​లో జరిగేవి. ప్రస్తుతం ఎమర్జెన్సీవి తప్ప జనరల్​ సర్జరీలు చేయడం లేదు. 


ఇవేం ట్రాన్స్​ఫర్స్​.. 

లాంగ్​ స్టాండింగ్​ పేర చేపట్టిన బదిలీలను ఉన్నతాధికారులు ఇష్టారాజ్యంగా చేపట్టారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వైద్యవిధానపరిషత్​లో పని చేస్తున్న పలువురు స్పెషలిస్ట్​ డాక్టర్లు తమ సీనియార్టీని, ప్రమోషన్లను వదులుకొని డీఎంఈ పరిధిలో  మెడికల్​ కాలేజీలకు బదిలీపై వచ్చారు. మెడికల్​ కాలేజీకి వచ్చి రెండున్నరేండ్లే అయినప్పటికీ వైద్యవిధాన పరిషత్​లో చేసిన సర్వీసును కూడా పరిగణలోకి తీసుకొని ట్రాన్స్​ఫర్స్​ చేయడం పట్ల  విమర్శలు వస్తున్నాయి.

తాము  సర్వీస్​తోపాటు  ప్రమోషన్లు వదులుకొని వచ్చినా  లాంగ్​  స్టాండింగ్​ పేరుతో  ట్రాన్స్​ ఫర్​ చేయడాన్ని  డీఎంఈలోకి వచ్చిన స్పెషలిస్ట్​ డాక్టర్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు.  జీజీహెచ్​ నుంచి  ఇద్దరు విల్లింగ్​తో వెళ్లగా మిగిలిన నలుగురిని  కొత్తగూడెంలోని జీజీహెచ్​కు  వెనక్కి రప్పించాలని సాతానికులు ,  డీఎంఈ,  ఎమ్మెల్యేను  ప్రజలు కోరుతున్నారు.