స్పెషల్ : ఈ ఇంటికి 150 ఏళ్లు

ఇప్పుడు కట్టిన ఇండ్లు ఒక యాభై ఏళ్లయినా చెక్కుచెదరకుండా ఉంటాయా? అంటే చెప్పలేం. కానీ.. ఈ ఇల్లు కట్టి 150 ఏళ్లు అవుతున్నా చెక్కు చెదరలేదు.ఇప్పటికే ఆ ఇంట్లో ఎటు చూసినా దశాబ్దాల నాటి వస్తువులే కనిపిస్తుంటాయి.లోపలికి అడుగుపెట్టగానే ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తూ ఉంటాయి. అప్పట్లోనే రెండంతస్తుల్లో కట్టిన పెంకుటిల్లు ఇది. దీని మరో ప్రత్యేకత ఏంటంటే.. పై అంతస్తుకు వెళ్లేందుకు డూప్లెక్స్ పద్ధతిలో మెట్లు కట్టారు. 

ఆ ఇంట్లోకి అడుగుపెట్టగానే పాతకాలం నాటి వస్తువులు స్వాగతం చెప్తాయి. తలుపు తీయకుండానే ఇంటికి వచ్చింది ఎవరనేది తెలుసుకునేందుకు ప్రత్యేకంగా చేసిన ఏర్పాటు, గోడల్లో ఏర్పాటు చేసిన సీక్రెట్​ లాకర్లు.. ఇలా ఒక్కటేమిటి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. రానా, సాయి పల్లవి నటించిన ‘విరాటపర్వం’ సినిమాలోని కొన్ని సీన్లు ఈ ఇంట్లోనే చిత్రీకరించారు. ఈ ఇల్లు మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం ధరిపల్లికి చెందిన వెన్నవెల్లి విఠల్ రెడ్డిది. ఈ ఇల్లు ధరిపల్లి గ్రామానికే స్పెషల్‌‌ ఎట్రాక్షన్‌‌గా మారింది ఇప్పుడు. 

ఎన్నో ప్రత్యేకతలు

ఎకరా విస్తీర్ణంలో కట్టిన ఈ ఇంట్లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఇంటి గోడలు పూర్తిగా మట్టితో కట్టారు. పైకప్పుకు కర్రలతో వాసాలు పేర్చి, మట్టి పెంకులు పెట్టారు. ఇప్పుడంటే ఇంజనీర్లతో ప్లాన్​ గీయించి డూప్లెక్స్ బిల్డింగ్స్‌‌ కడుతున్నారు. కానీ.. ఆ రోజుల్లోనే ఈ ఇల్లుని డూప్లెక్స్‌‌ పద్ధతిలో కట్టారు. ఇంటి పైఅంతస్తులో రెండు పడక గదులు ఉన్నాయి. పైకి ఎక్కేందుకు రెండు వైపులా మెట్లు ఉన్నాయి. 

పడక గదుల్లోకి గాలి, వెలుతురు వచ్చేలా గోడలకు రెండు వైపులా కిటికీలు పెట్టించారు. మెయిన్‌‌డోర్‌‌‌‌ దాటగానే ఇంటి యజమాని కూర్చునే దివాన్​ ఖానా ఉంటుంది. ఇంటికి విజిటర్స్​ వస్తే ఇక్కడే కూర్చొని మాట్లాడే వాళ్లు. అది దాటగానే వచ్చే ఆర్చి దాటి లోపలికి వెళ్తే  మధ్యలో గచ్చు ఉంటుంది. దానికి నాలుగు వైపులా కర్రలతో చేసిన మొగురాలతో హాలు లాంటిది ఏర్పాటు చేశారు. పండుగలు, పబ్బాలు, పేరంటాలు, పెళ్లిళ్లు.. లాంటి శుభకార్యాలు జరిగినప్పుడు చాలామంది కూర్చునేందుకు వీలుగా విశాలంగా ఉంటుంది. 

బంధువులు వస్తే పడుకునేందుకు ప్రత్యేక గదులు ఉన్నాయి. రాత్రివేళ ఇంటికి ఎవరైనా వస్తే మెయిన్‌‌డోర్‌‌‌‌ తీయకుండానే... వచ్చింది ఎవరనేది తెలుసుకునేందుకు గోడలో నుంచి ఒక సొరంగం లాంటిది ఏర్పాటు చేశారు. అందులో నుంచి చూస్తే తలుపు దగ్గరు ఉన్న వాళ్లు కనిపిస్తారు.

గోడలో లాకర్‌‌‌‌

డబ్బులు, బంగారు, వెండి లాంటివి దాచుకునేందుకు గోడకు చెక్క తనాబీలు ఏర్పాటు చేశారు.  గోడలో కుండను పెట్టి, దానికి మూత ఒకటి పెట్టారు. చాలా జాగ్రత్తగా పరిశీలిస్తేనే అక్కడ లాకర్‌‌‌‌ ఉన్నట్టు తెలుస్తుంది. అప్పట్లో కరెంట్​ఉండేది కాదు. కాబట్టి రాత్రివేళ వెలుగు కోసం కిరోసిన్​ కందిళ్లు వాడేవాళ్లు. అవి ఇప్పటికీ ఇక్కడ ఉన్నాయి. నీళ్ల కోసం ఇంట్లోనే చేద బావి, వంట కోసం కమాన్​ పొయ్యి కట్టించారు. ధాన్యం నిల్వ చేసేందుకు వాడిన పెద్ద పెద్ద మట్టి గోళాలు, నీళ్లు తెచ్చుకునేందుకు వాడిన మట్టి కుండలు, నీళ్లు వేడి చేసేందుకు ఇత్తడి కొప్పెర, తాగునీటి కోసం వాడిన మట్టి కూజా, పప్పులు మర ఆడించేందుకు వాడిన విసుర్రాయి, చల్ల తయారుచేసే పెద్ద కవ్వం, నవారు మంచం, చిన్న పిల్లలకు కర్ర ఊయల, ల్యాండ్​ ఫోన్​ ఆ ఇంటికి వెళ్తే కనిపిస్తాయి.


వ్యవసాయ కుటుంబం కాబట్టి అప్పట్లో పశుసంపద బాగా ఉండేది. వాటికోసం ఇంటి పక్కనే విశాలమైన పశువుల కొట్టం కట్టి ఉంది. అప్పట్లో పొలాలు దున్నేందుకు వాడిన నాగలి, ధాన్యం నిల్వ చేసే గోళాలు, ధాన్యం బస్తాలు తూకం వేసే కాంటా, పశువులకు నాగలి కట్టేందుకు వాడిన పట్టీలు, తాళ్లు ఇప్పటికీ భద్రంగా ఉంచారు. ‘‘హైదాబాద్‌‌లో మరో ఇల్లు కట్టుకున్నప్పటికీ తాతల కాలం నాటి పాత ఇల్లంటే మాకు చాలా ఇష్టం. అందుకే ఆ ఇంటికి అవసరమైన మరమ్మతులు చేస్తూ కాపాడుతున్నాం” అని విఠల్​ రెడ్డి కొడుకు హైకోర్టు అడ్వకేట్​ వి. ప్రతాప్​ రెడ్డి చెప్పాడు.

 తిమ్మన్నగారి శ్రీధర్​, మెదక్, వెలుగు