నడుస్తున్న హైడ్రా రథచక్రాలు

గుట్టు చప్పుడు కాకుండా,మెరుపు వేగంతో  కదలుతున్నాయిహైడ్రా రథచక్రాలు. కూలుతున్నాయి..చెరువులు, కుంటలు, సరస్సుల్లో కట్టిన అక్రమ భవనాలు. ప్రభుత్వ భూములుకబ్జా కోర్​ల చెర వీడుతున్నాయి. శ్రీమంతులు, సామాన్యులు అంతా సమానులే అనే భావన కలిగిస్తూ ముందుకు దూసుకుపోతున్నాయి హైదరాబాదులో హైడ్రా రథచక్రాలు.హైడ్రా బుల్డోజర్ల పనితీరు శ్రీశ్రీ మహా ప్రస్థానంలోని జగన్నాథ రథచక్రాలను మరోసారి గుర్తు చేశాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిసాహసోపేతమైన నిర్ణయంతో హైదరాబాద్ మహా నగరంలో భూ ఆక్రమణదారుల గుండెల్లో హైడ్రాప్రకంపనలుమొదలయ్యాయి.

చెరువుల్ని మింగేసి, కుంటలని కాజేసి,  సరస్సులను చంపేసి ప్రకృతి సంపదను దోచేసే రియల్ ఎస్టేట్ మాఫియాకి హైడ్రా గునపాలు దిగుతున్నాయి. మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రంగనాథ్ అనే ఐజి స్థాయి సమర్థత కలిగిన అధికారిని ‘హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్ (హైడ్రా) కు కమిషనర్ గా నియమించి అనేక అక్రమ కట్టడాలను కూల్చి వేయిస్తోంది. ఈ చర్య శుభ పరిణామమని పర్యావరణవేత్తలు సామాన్య మధ్యతరగతి ప్రజలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మద్దతుగానిలుస్తున్నారు.

43.94 ఎకరాలు స్వాధీనం

ఇప్పటివరకు హైడ్రా అక్రమ నిర్మాణాల కూల్చివేతల ద్వారా 43.94 ఎకరాలను స్వాధీనపరచుకుంది. హైడ్రా పనితీరును అభినందిస్తూ గండిపేట ప్రాంతంలో ప్రజలే స్వచ్ఛందంగా ర్యాలీ తీశారు. అనేక అక్రమాలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం పెంచి పోషించింది. ఒక్క హైదరాబాద్ మహానగరమే కాదు రాష్ట్రవ్యాప్తంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం లో బీఆర్ఎస్ నాయకులే చెరువులను, ప్రభుత్వ భూములను  కబ్జాలు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అండతో బీఆర్ఎస్ నేతలు ఇసుకను కూడా వదలలేదు.

కొండలు, గుట్టలను  సైతం పిండి చేసి ప్రకృతి సంపదనంతా తమ గుప్పెట్లో పెట్టుకున్నారు.అడిగే నాథుడే లేడని ఎల్లకాలం అధికారంలో మేమే ఉంటామనే భావనతో ప్రకృతి ప్రకోపానికే కాదు ప్రజాగ్రహానికి కూడా  గురిఅయ్యారు. ఇప్పుడు తమ అక్రమ నిర్మాణాల మీద హైడ్రా పిడుగు యాడ పడుతుందో అనే భయంతో కేటీఆర్ లాంటి నాయకులు గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకుంటున్నారు.  నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ పారదర్శకంగా పనిచేసుకుంటూ పోయే హైడ్రాపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. 

జంట జలాశయాల పరిధిలో ఆక్రమణలు

మూసీ వరద నేర్పిన గుణపాఠంతో 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తన పరిపాలనా కాలంలో 1912లో నగరాభివృద్ధి ట్రస్ట్ ను ఏర్పాటు చేశారు. మూసీ నదిపై వరద నియంత్రణ వ్యవస్థను నెలకొల్పారు. భవిష్యత్తులో జంట నగరాలకు వరద ముప్పు తలెత్తకుండా మోక్షగుండం విశ్వేశ్వరయ్య వంటి ఆనాటి ప్రముఖ ఇంజనీర్ సలహాలను 7వ నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ నగర ప్రణాళికలలో అమలుపరిచారు.  నగర ఉత్తర భాగంలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య సూచన మేరకు నవాబ్ అలీ నవాజ్ జంగ్ అనే నిజాం ఛీఫ్ ఇంజనీర్ 1920లో మూసీ నదిపై నగరానికి పది మైళ్ళ ఎగువన ఉస్మాన్ సాగర్ ఆనకట్టను నిర్మించారు.

ఆ తర్వాత 1927లో మూసీఉపనది అయిన ఈసీ నదిపై హిమాయత్ సాగర్ అనే మరో ఆనకట్టను కట్టారు. ఈ రెండు జంట జలాశయాలు జంట నగరాలకు తాగునీటితోపాటు మూసీ వరదల నుంచి జంట నగరాలను ఇప్పటివరకు కాపాడుకుంటూ వచ్చాయి. ఈ జంట జలాశయాల 84 గ్రామాల పరిధిలో మొత్తం పది కిలోమీటర్ల మేర ఎటువంటి భారీ కట్టడాలు ఆకాశహర్మ్యాలు నిర్మించవద్దని 1996వ సంవత్సరంలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ కోసం 111 జీవోను తెచ్చినా కేసీఆర్​ సర్కార్​ ఆ జీవోను నిలిపివేసింది.

భగవద్గీత స్ఫూర్తిగా సీఎం రేవంత్​

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  అక్రమ నిర్మాణాలు కూల్చటంలో ధర్మాన్ని కాపాడేందుకు భగవద్గీత నాకు స్ఫూర్తి అని స్వయంగా ప్రకటించారు. హైదరాబాద్ నగరాన్ని భవిష్యత్ జల ప్రళయాల నుంచి అనేక విపత్తుల నుంచి కాపాడేందుకు ప్రభుత్వాన్ని ప్రభావితం చేసే వ్యక్తులు ఎవరైనా వదలమని హెచ్చరించి ఆదర్శంగా నిలిచారు. అంతకుముందు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటిపై టిఆర్ఎస్ నాయకులు అక్రమ నిర్మాణం అని ఆరోపణ చేయగా అక్రమ నిర్మాణంలో నా ఇల్లు కానీ నా ఇంటి గోడ ఇటుక పెడ్డ ఉన్నా కూల్చండని విలేకరుల సమావేశంలో ఆరోపణలు చేసిన వారికి సవాలు విసిరారు.

ఇవన్నీ పక్కన పెడితే హైదరాబాద్​లో గతంలో జరిగిన విపత్తుల చరిత్ర ఈతరం తెలుసుకోవాలి.1908 సెప్టెంబర్ 26 నుండి 28 వరకు 6వ నిజాం మీర్ మెహబూబ్ అలీ ఖాన్ పరిపాలన కాలంలో మూసీ నది వరద హైదరాబాదును ముంచేసింది.  17 సెం.మీ వర్షం నమోదు కాగా అఫ్జల్, చాదర్​ఘాట్, ముసాలం జంగ్ బ్రిడ్జిలు వరద దెబ్బకు కొట్టుకుపోయాయి. పురానాపూల్ బ్రిడ్జిపై సుమారు 60 అడుగుల ఎత్తులో మూసీ వరద నగరంలో ప్రవహించింది. ఈ వరదలో సుమారు అధికారికంగా 15,000 మంది, అనధికారికంగా 50 వేల మంది వరకూ జలసమాధి అయ్యారు. సుమారు 80 వేల ఇండ్లు వరద ఉధృతికి నేలమట్టమయ్యాయి. ఈ వరదల నుంచి కాపాడుకోవడానికి అఫ్జల్​గంజ్  ఉస్మానియా దవాఖానాలో ఇప్పటికీ 200 సంవత్సరాల చరిత్రకు సజీవ సాక్ష్యంగా ఉన్న చింతచెట్టు ఎక్కి ఆనాడు 
150 మంది తమ ప్రాణాలు కాపాడుకున్నారు అని చరిత్ర చెబుతోంది.

హైడ్రా నిబద్ధతపై ప్రజలు హర్షం

111 జీవోను ఉల్లంఘించి జంట జలాశయాల పరిధిలో అన్ని రాజకీయ పార్టీల నాయకులు, పారిశ్రామికవేత్తలు, సినిమా తారలు విలాసవంతమైనటువంటి అనేక వ్యవసాయ క్షేత్రాలను నిర్మించుకున్నారు.  కేటీఆర్ జన్వాడ వ్యవసాయ క్షేత్రం కూడా111  జీవో పరిధిలో అక్రమంగా నిర్మించారని టీపీసీసీ అధ్యక్షుడిగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ విషయాన్ని బహిర్గతం చేశారు. 2022లో బీఆర్​ఎస్​ ప్రభుత్వం బడా బాబులను కాపాడేందుకు పర్యావరణానికి ముప్పు వాటిల్లే విధంగా క్యాబినెట్ తీర్మానం ఆధారంగా111 జీవోను ఎత్తివేసింది.

ఏ లక్ష్యం కోసం అయితే ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ జంట జలాశయాలు నిర్మించామో 
ఆ లక్ష్యానికి పాలకులే తూట్లు పొడిచారు.  కాగా, హైడ్రా నిజాయితీ, నిబద్ధతను చూసి  ప్రజలంతా హర్షిస్తున్నారు. హైడ్రా పరిధి యావత్ తెలంగాణ అంతట విస్తరించాలని ప్రభుత్వానికి వినతులు వస్తున్నాయి. హైడ్రా అందరిదీ హైడ్రాను అడ్డుకుంటే ప్రగతి రథచక్రం ఆగినట్టే. భవిష్యత్ మానవ మనుగడకు ముప్పు పొంచి ఉన్నట్టే. అందుకే హైడ్రాను కాపాడుకుందాం హైదరాబాద్​ను మళ్ళీ సుందర భాగ్యనగరంగా మలుచుకుందాం.

కోటూరి మానవతారాయ్,
టీపీసీసీ అధికార ప్రతినిధి,
 చైర్మన్ తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ జేఏసీ