తెరపైకి కులగణన.. జనంలో మనం ఎంత?

ప్రతిసారి ఎన్నికలు రాగానే రాజకీయ నాయకులు ‘కులగణన’ను తెరపైకి తెస్తుంటారు. ముఖ్యంగా ప్రతిపక్షాలు కులగణన చేయాలని డిమాండ్‌‌‌‌ చేస్తారు. కానీ.. వాళ్లే అధికారంలోకి వచ్చాక మాత్రం ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తారు. అసలు సమగ్ర కులగణన జరిగితే లాభం ఎవరికి? కులగణన జరిగితే రాజకీయ నాయకులకు కలిగే నష్టం ఏంటి? కులగణన చేయాలని కొన్నేండ్ల నుంచి బీసీలు ఎందుకు పట్టుపడుతున్నారు? కులగణన చేయాల్సిన అవసరం ఎంతవరకు ఉంది? అనే విషయాల మీద ప్రొఫెసర్​ కూరపాటి వెంకట్​ నారాయణ రాసిన స్పెషల్​ స్టోరీ.


కొన్నేండ్లుగా దేశంలో కులగణన అంశం రాజకీయ ఎజెండాగా మారింది. ఎప్పుడూ ఏదో ఒక విధంగా ఈ అంశం మీద చర్చ జరుగుతూనే ఉంది. దేశంలో1931లో అంటే బ్రిటిష్ పాలనలో సమగ్ర కుల గణన జరిగింది. అప్పటినుంచి ఇప్పటివరకు మళ్లీ అలాంటి గణన జరగలేదు. ఇన్నేండ్ల నుంచి తెరమీదకు రాని ఈ కులగణన అంశం ఇప్పుడెందుకు తెరమీదకు వచ్చింది అంటారా? చరిత్రలో మొదటిసారి కులంతో సంబంధం లేకుండా పేదరికం ప్రాతిపదికన అగ్రకులాల వాళ్లకు 10 శాతం రిజర్వేషన్ కల్పించింది కేంద్ర ప్రభుత్వం. దాన్ని ఈడబ్ల్యుఎస్ (ఎకనమికల్లీ వీకర్ సెక్షన్స్) రిజర్వేషన్ అంటున్నారు. ఇది ఒక రకంగా ఎస్టీలకంటే ఎక్కువ కోటా. ఈ రిజర్వేషన్ అమల్లోకి రావడం వల్లే అసలు మొత్తం వెనుకబడిన కులాల జనాభా ఎంత? ఏ కులం వాళ్లు ఎంతమంది ఉన్నారు? వాళ్లలో పేదవాళ్లు ఎందరు? ధనవంతులు ఎంతమంది? వాళ్ల ఉపాధి, ఉద్యోగ, ఆర్థిక పరిస్థితులు ఏంటి?.. ఇలాంటి అంశాలను తేల్చాలన్న డిమాండ్ మొదలైంది. కానీ.. ఈ డిమాండ్‌‌ని బీజేపీ గవర్నమెంట్‌‌ పెద్దగా పట్టించుకోలేదు. పైగా.. అది సాధ్యం కాదని చెప్తూ వచ్చింది. ఇలాంటి టైంలో బీహార్​ రాష్ట్రంలో కులగణన చేస్తామని చెప్పి నితీష్​ ప్రభుత్వం‌‌ పెద్ద బాంబు పేల్చింది. 2022లో బీహార్‌‌‌‌లో ఆ తర్వాత కర్ణాటకలో కులగణన జరిగింది. ఆ తర్వాత దీని గురించిన ప్రస్తావనలు, డిమాండ్లు మరింత పెరిగాయి. అప్పటినుంచి దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలు ఈ అంశాన్ని పదే పదే తెరమీదకు తీసుకొస్తున్నాయి. పోయినేడు నుంచి కాంగ్రెస్ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ  కులగణన చేయాలని, వెనుకబడిన కులాలకు దేశ సంపదలో తగిన వాటా, ఉద్యోగాల్లో తగిన రిజర్వేషన్లు కల్పించడానికి చట్టబద్ధత తీసుకురావాలని డిమాండ్‌‌ చేస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే.. కులగణన చేస్తామని ప్రజాసభల్లో చెప్తున్నారు. ఇంత జరుగుతున్నా.. బీజేపీ కులగణన అంశాన్ని ప్రస్తావించడం లేదు.

ఎంతో అవసరం 

ఇండియా ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతున్నది. అయినా.. దేశంలోని వెనుకబడిన కులాలకు చెందినవాళ్లు (దేశంలో సగానికి పైగా జనాభా) ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాజ్యాంగం ప్రకారం సమాజంలో ఆర్థిక కేంద్రీకరణ (సంపద కొంతమందికే పరిమితమైనప్పుడు) జరిగినప్పుడు తగిన చర్యలు తీసుకుని, సవరించాల్సిన బాధ్యత ఎన్నికైన ప్రభుత్వాల మీద ఉంటుంది. అధికారంలో ఏ పార్టీ ఉన్నా ఈ పని తప్పనిసరిగా చేయాలి. ఈ విషయంలో నాయకులు నిర్లక్ష్యం చేయకూడదు. ప్రస్తుతం కులగణనను ఒక రాజకీయ ఎజెండాగా చూస్తున్నప్పటికీ  వాస్తవంగా వివిధ కులాల మధ్య పెరిగిపోతున్న అసమానతలను తగ్గించడానికి ఇది ఎంతో అవసరం. అందుకే పార్లమెంట్‌‌ ఎన్నికల సందర్భంగా కులగణన అంశం ఎన్నికల ఎజెండాగా మారింది. ఇలా మారడం ప్రస్తుతం అనివార్యం అనిపిస్తుంది. 

జనాభా లెక్కలు 

జనాభా లెక్కలు దేశాభివృద్ధికి తోడ్పడే ప్రణాళికలు, విధాన నిర్ణయాలు చేయడానికి ఉపయోగ పడతాయి. ఈ లెక్కల ద్వారా విద్య, సాంస్కృతిక సంబంధమైన అంశాల అభివృద్ధి తీరుతెన్నులు తెలుసుకోవడానికి కూడా వీలుపడుతుంది. అందుకే మన దేశంలో 1881 కంటే ముందు నుంచే అడపాదడపా జనాభా లెక్కలు చేస్తున్నారు. కొన్ని పట్టణాల్లో ముఖ్యంగా కొల్​కతా, బనారస్, అలహాబాద్, బాంబే, మద్రాసు లాంటి ప్రాంతాల్లో జనాభా లెక్కలు చేశారు.1881 నుండి మాత్రం దేశమంతటా చేస్తున్నారు. బ్రిటిషర్ల హయాంలో 1941 వరకు జనాభా లెక్కలు చేశారు. అప్పట్లోనే సామాజిక, సాంస్కృతిక, వృత్తిపరమైన అంశాలతో కూడిన అంచనాలు  వేశారు. స్వాతంత్ర్య భారతంలో 1948 జనాభా లెక్కల చట్టం ప్రకారం మొట్టమొదటిసారి భారత ప్రభుత్వం1951లో జనాభా లెక్కలు చేసింది. ఆ తర్వాత వరుసగా 2011 వరకు ఏడు విడతలు జనాభా లెక్కలు చేసింది. 


జనాభా లెక్కల్లో సాధారణంగా పల్లెలు, పట్టణాలు ప్రాంతాలు, రాష్ట్రాల వారీగా స్త్రీలు, పురుషులు, కుటుంబ యజమానులు, షెడ్యూల్డ్‌‌ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వృత్తులు, ఇండ్లు, విద్య, ఉద్యోగ, ఉపాధి అంశాల వివరాలు సేకరిస్తారు. ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. కానీ.. 2021లో జరగవలసిన లెక్కలు జరగలేదు. కరోనా ఎఫెక్ట్‌‌ వల్ల జనాభా లెక్కలు చేయడానికి వీలుపడదని వాయిదా వేశారు. ఇప్పుడు మూడు సంవత్సరాలు గడిచిపోయాయి. అయినా.. జనాభా లెక్కల ఊసు లేదు. అందుకు  అసలు కారణం కులగణన సమస్యే అంటున్నారు ఎక్స్‌‌పర్ట్స్‌‌. ఈసారి జనాభా లెక్కలు చేస్తే.. కులాల లెక్కలు తీయాలనే డిమాండ్‌‌ ప్రజలు, రాజకీయ పార్టీల నుంచి రావడంతో జనగణన ఆలస్యం చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. 

మొదటిసారి 

దేశంలో మొదటిసారి బ్రిటిష్ కాలంలో 1931లో కులగణన జరిగింది. జనాభాలో ఏ కులంవాళ్లు ఎంతమంది ఉన్నారనేది అప్పుడే పక్కాగా తేలింది. ఆ లెక్క ప్రస్తుత పాకిస్తాన్, బంగ్లాదేశ్‌‌లను కలుపుకుని ఉంది. కానీ ఆ తర్వాత ఏ ప్రభుత్వమూ కులాల వారీగా సమగ్రంగా లెక్కలు చేయలేదు. 1941 జనాభా లెక్కల నుంచి ఈ కేటగిరీని తీసేశారు. తమ కులానికి ఇన్ని లక్షల జనాభా ఉందంటూ ఆయా కులాలే చెప్పుకోవడం లేదా రాజకీయ పార్టీలు సొంతంగా వేసుకుంటున్న అంచనాలు, ప్రభుత్వ పథకాలు అమలు చేసినప్పుడు చేసిన కొన్ని సర్వేల సమాచారం, వచ్చిన దరఖాస్తుల ఆధారంగానే కులాల లెక్కలను అంచనా వేస్తున్నారు. ఇవన్నీ వాస్తవ లెక్కలకు దగ్గరగా ఉన్నప్పటికీ ఇవేవీ సరైన లెక్కలు కావు. అవేవీ అధికారికమైన లెక్కలు కావు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచీ జనాభా లెక్కల్లో అధికారికంగా కేవలం ఎస్సీ, ఎస్టీల లెక్కలే వేస్తున్నారు. ఇతర కులాల లెక్కలు వేయడం లేదు. స్వాతంత్ర్యం వచ్చాక మొదటిసారిగా 2011–2012లో సామాజిక, ఆర్థిక, కుల గణన చేపట్టింది నాటి కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ.. ఆ లెక్కలు ఇప్పటికీ బయటకు చెప్పలేదు.

లెక్కల్లో మార్పులు రావాలి

సాధారణంగా జనాభా లెక్కల్లో కేవలం ఎస్సీ, ఎస్టీ జనాభాను మాత్రమే లెక్కిస్తారు. కానీ.. అన్ని సామాజికవర్గాల జీవన స్థితిగతులు ముఖ్యంగా ఆర్థిక, ఉపాధి, ఉద్యోగ, వ్యవసాయ, సంఘటిత, అసంఘటిత వ్యాపార రంగాల అంశాలను లెక్కలోకి తీసుకోవాలి. అలా చేస్తేనే.. అన్ని వర్గాలకు లబ్ధి కలిగే అవకాశం ఉంటుంది. మనదేశంలో జనాభా లెక్కలు మొదలైన కొత్తలో ఎక్కువమంది ప్రజలు వ్యవసాయం,  కుటీర పరిశ్రమలు, కులవృత్తులు, చిరువ్యాపారాలు, కూలీపనులు చేస్తూ బతికేవాళ్లు. కానీ.. స్వాతంత్రం వచ్చాక ఆధునిక పరిశ్రమలు, సేవారంగం విస్తరించాయి. అనాదిగా ఉన్న అనేక వృత్తులు అదృశ్యమైపోతున్నాయి. చిరువ్యాపారులు తమ అవకాశాలు కోల్పోతున్నారు. కార్పొరేట్‌‌ వ్యాపార సంస్థల వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమై పోయిన విషయం స్పష్టంగా కనిపిస్తున్నది. నూతన ఆర్థిక విధానాల వల్ల ఆర్థిక అసమానతలు అనేక రెట్లు పెరిగాయని అనేక జాతీయ, అంతర్జాతీయ పరిశోధనా సంస్థలు చెప్తున్నాయి. కాబట్టి ఇప్పటి పరిస్థితులు ఎలా ఉన్నాయనేది తెసుకోవాల్సిన, అన్ని కులాల ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, ఉపాధి, ఉద్యోగ పరిస్థితులపై ఒక సమగ్ర అంచనా వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

కులం లెక్కలు ఎందుకు? 

రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులు, ఆదేశిక సూత్రాల ప్రకారం సమాజంలోని అన్ని సామాజిక వర్గాలకు తగిన ఆర్థిక, సామాజిక న్యాయం చేయాలి. కానీ.. నూతన ఆర్థిక విధానాల అమలు తర్వాత కొన్ని సామాజిక వర్గాలు తమ ఆర్థిక అవకాశాలను కోల్పోయాయని అనేక పరిశోధనలు చెప్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో వెనుకబడిన కులాలకు కనీసం విద్యా, వైద్య రంగాల్లో కూడా తగిన న్యాయం జరగడం లేదని ఆ వర్గాలు నిరంతరం ఆందోళన చేస్తూనే ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల్లో వెనుకబడిన కులాల వాళ్లు తమకు రాజకీయ అవకాశాలు దక్కడం లేదని ఆర్థికంగా సంక్షోభంలో పడిపోతున్నామని నిరసనలు చేస్తున్నారు. రాహుల్ గాంధీ దీన్ని జాతీయ అంశంగా చర్చకు తీసుకురావడానికి కారణం ఇదే. అందుకే కులం లెక్కలు కచ్చితంగా తెలియాల్సిన అవసరం ఉంది. అంతెందుకు.. దేశంలో రిజర్వేషన్లతో పాటు, సంక్షేమ పథకాలను కూడా కులాల ప్రాతిపదికనే అమలు చేస్తుంటారు. అలాంటిది దేశంలో ఏ కులంవాళ్లు ఎంతమంది ఉన్నారనేది తెలియకుంటే ఎలా? స్వాతంత్ర్యం వచ్చినప్పటి జనాభా ప్రకారమే ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు అమలవుతున్నాయి. కానీ.. బీసీల రిజర్వేషన్లు రాష్ట్రానికో రకంగా ఉన్నాయి. అవి ఆయా రాష్ట్రాలు చేపట్టిన సర్వేల ఆధారంగా ఉంటాయి. 

ఎస్సీ, ఎస్టీలకు వాళ్ల పూర్తి జనాభాకు తగిన నిష్పత్తిలో రిజర్వేషన్లు ఇస్తే, బీసీలకు మాత్రం వాళ్ల జనాభాలో సగం నిష్పత్తికే రిజర్వేషన్ ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మండల్ కమిషన్ అంచనా ప్రకారం.. దేశంలో బీసీలు 52 శాతం ఉన్నారు. కానీ.. వాళ్లకు 27 శాతం రిజర్వేషన్ ఉంది. ఇక ఓసీల జనాభా చాలా తక్కువగా ఉన్నప్పటికీ ఎస్టీల కంటే ఎక్కువగా10 శాతం రిజర్వేషన్ ఇచ్చారు. కాబట్టి.. అసలు ఏ కులం పరిస్థితి ఏంటి? ఆయా కులాల్లో పేదల శాతం ఎంత? ఏ కులం వారు ఏ ప్రాంతంలో ఆర్థికంగా బలంగా ఉన్నారు? వంటి విషయాలు తెలిస్తేనే రిజర్వేషన్లతో పాటు సంక్షేమ పథకాల అమలు సరిగ్గా జరుతుంది. 

సమస్యల పరిష్కారానికి 

సామాజిక సమస్యలను ప్రజలే కాకుండా రాజకీయ పార్టీలు కూడా తమ ఎజెండాలోకి  తీసుకున్నప్పుడు మాత్రమే అది ఒక ప్రధాన అంశంగా మారుతుంది. కులగణన కూడా ఇప్పుడు ఒక ప్రధానాంశంగా మారింది. కులగణన అనేది దేశంలోని దాదాపు60 శాతం జనాభాకు సంబంధించిన సామాజిక, ఆర్థిక, అభివృద్ధి అంశంగా పరిగణించాల్సిన అవసరం ఉంది. దేశానికి స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు గడిచినప్పటికీ ‘సర్వసత్తాక సోషలిస్టు సెక్యులర్ రిపబ్లిక్ ఆఫ్ ఇండియా’ అని రాజ్యాంగ ప్రవేశిక​ చెప్పినప్పటికీ ఈ 60 శాతం జనాభా సమస్యలు పరిష్కరించకుండా, వాళ్ల ఉనికిని గుర్తించకుండా, కనీస అవసరాలను తీర్చకుండా ఎంతకాలం వాయిదా వేయగలరు? అందుకే కులగణన అనే అంశం రాబోయే రోజుల్లో అన్ని రాజకీయ పార్టీలకు ఎజెండాగా మారే అవకాశం ఉంది. ఈ అంశం వెనక బలమైన అనేక కారణాలు కూడా ఉన్నాయి. 

అరవై శాతం వాళ్లే...

దేశం అభివృద్ధి చెందుతున్న దశలో 60 శాతం ప్రజలకు ఆ అభివృద్ధిలో సముచితమైన వాటా, అవకాశాలు లభించికపోతే అనేక అనర్థాలు జరుగుతాయి. వెనుకబడిన కులాల ప్రజలు తమ వృత్తులు, చిరువ్యాపారాలను కోల్పోయి ఉపాధి, ఉద్యోగాలు లేక అనేక ప్రాంతాలకు వలస వెళ్లడం సాధారణం అయిపోయింది. వాళ్లలో చాలామంది వ్యవసాయ భూములు లేక, కనీసం ఉండడానికి ఇల్లు లేక, పిల్లలకు నాణ్యమైన విద్య, వైద్య సౌకర్యాలు కల్పించలేక తీవ్ర సామాజిక సంక్షోభంలోకి వెళ్లిపోతున్నారు. రాజ్యాంగం, స్వాతంత్రం ఉన్న ఈ దేశంలో ఈ 60% ప్రజలకు రాజకీయ, ఆర్థిక, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో తగిన గుర్తింపు దక్కడం లేదు. రాజకీయ రంగంలో షెడ్యూల్డ్ కులాలకు, షెడ్యూల్డ్ తెగలకు తగిన రిజర్వేషన్లు లభించాయి. వెనుకబడిన కులాలకు ఎలాంటి రిజర్వేషన్లు లేకపోవడం వల్ల చట్టసభల్లో వాళ్ల ఉనికి ప్రశ్నార్థకంగా మారిపోయింది. అనేక జాతీయ, ప్రాంతీయ పార్టీలు కూడా వెనుకబడిన వర్గాల అభ్యర్థులను నిలబెట్టడానికి జంకుతున్నాయి. ఆర్థికంగా బలహీనంగా ఉన్న ఈ వర్గాల నాయకులకు పార్టీ టిక్కెట్లు ఇవ్వడానికి వెనకాడుతున్నారు. చట్టసభల్లో ముఖ్యంగా పార్లమెంటు శాసనసభలు మొదలగు సంస్థల్లో వెనుకబడిన కులాల ప్రతినిధులు 20 శాతానికి మించడం లేదు. ఆర్థికంగా బలహీనంగా ఉండడం, ఎన్నికల ఖర్చులు భరించలేకపోవడం లాంటి కారణాల వల్ల రాజకీయ పార్టీలు ఈ వర్గాల ప్రజలకు అవకాశాలు ఇవ్వడం లేదు. చట్టపరంగా రిజర్వేషన్లు ఉంటే తప్ప ఈ వర్గాలకు రాజకీయంగా న్యాయం జరిగే అవకాశం లేదు. 

ఉపాధి లేదు

నూతన ఆర్థిక విధానాల వల్ల వెనుకబడిన వర్గాల ప్రజలు కొన్ని దశాబ్దాలుగా చేస్తున్న చిరు వ్యాపారాలు కనుమరుగయ్యాయి. కార్పొరేట్ సంస్థల ధాటికి, పోటీకి ఎదురు నిలువలేక క్రమంగా మార్కెట్ నుండి తప్పుకున్నాయి. ప్రభుత్వ విద్యావ్యవస్థలు అందరికీ నాణ్యమైన విద్య కల్పించలేవు. అలాగని ప్రయివేటు విద్యాసంస్థల్లో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చదువుకోలేరు. అందుకే వెనుకబడిన కులాల వాళ్లు క్రమంగా విద్య, గౌరవప్రదమైన ఉపాధి, ఉద్యోగాలకు దూరమవుతున్నారు. ప్రతి ఎన్నికల సందర్భంలో ఈ సామాజిక వర్గాల నాయకులు తమ వాటా కోసం ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు. అందుకే వెనుకబడిన కులాల హక్కులు, అవకాశాలకు చట్టబద్ధత తీసుకురావాల్సిన అవసరం ఉంది. అది కులగణన ద్వారా మాత్రమే సాధ్యం అవుతుంది. 

సమగ్రాభివృద్ధికి..

జనాభా లెక్కలు, కులగణన ఎప్పుడైనా సమాజ  సమగ్రాభివృద్ధికి ఉపయోగపడతాయి. ఇవి ఆయా కులాలు ప్రాంతాల వారీగా ఎలా అభివృద్ధి చెందాయో తెలుసుకోవడానికి పనికొస్తాయి. దాని ద్వారా అభివృద్ధి పథకాలు తీసుకురావడానికి ప్రభుత్వానికి మరింత సులభం అవుతుంది.  కులగణన జరగాలని కోరుకునే వర్గాలు రాజకీయ వర్గాలపై నిరంతరం ఒత్తిడి తీసుకొస్తేనే అది సాధ్యం అవుతుంది. వెనుకబడిన కులాల ప్రజలు ఐక్యతతో పోరాడినప్పుడు తప్పకుండా అన్ని రాజకీయ వర్గాలు పార్టీలు సమస్య పరిష్కారానికి అంగీకరిస్తాయి. కులగణన అంశం కేవలం ఒకటిన్నర ఏడాది నుంచే ప్రజల్లో ఎక్కువగా వినిపిస్తోంది. కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించింది. త్వరలోనే అనేక జాతీయ, ప్రాంతీయ పార్టీలన్నీ ఈ అంశాన్ని తమ ఎజెండాలో చేర్చుకోక తప్పదు. 

సమస్యలు ఏంటి? 

కులగణన జరిగితే.. రాజ్యాంగపరంగా వివిధ రంగాల్లో జనాభా దామాషా ప్రకారం రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాల్లో తగిన రిజర్వేషన్లు అడుగుతారు. వెనుకబడిన కులాల్లో కూడా వివిధ వర్గాలు, కులాల మధ్య తమ తమ వాటా కోసం కొంత తర్జనభర్జన జరిగే అవకాశం ఉంది. ఈ అంశం మరోసారి రాజకీయ పార్టీలకు, కులాలకు మధ్య చర్చనీయాంశంగా మారుతుంది. కులగణన కులాలకు ఎంత ప్రయోజనం కలిగిస్తుందో తెలియదు. కానీ.. దాని ప్రభావం రాజకీయ పార్టీల గెలుపోటములను నిర్ణయించే అంశంగా మారనుంది. కాబట్టి దీన్ని రాజకీయ అంశంగా కాకుండా ఒక సామాజిక వర్గం న్యాయమైన హక్కుగా భావించినప్పుడు సమస్య సులభంగా పరిష్కారం అయ్యేందుకు వీలవుతుంది. అందుకోసం ప్రజలంతా సహకరించాలి. తప్పుదారి పట్టకుండా ఉద్యమించాలి. సమయం ఎంత పట్టినా అంతిమంగా పరిష్కారం కోసం కృషి చేయడం, పోరాటం చేయడం ఆ సామాజిక వర్గాల కనీస బాధ్యత అని గుర్తించాలి.

ఎవరికి అవసరం

కులగణన చేయాలని ఎక్కువగా బీసీలే పోరాడుతున్నారు. దానికి కారణం ఏంటంటే... అసలు మండల్‌‌ కమిషన్‌‌కు ముందు దేశంలో బీసీలకు రిజర్వేషన్ లేదు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నో ఏండ్లకు1990లో మండల్ కమిషన్ నివేదికతో రిజర్వేషన్ కల్పించారు. ఈ కమిషన్ దేశవ్యాప్తంగా ఉన్న 3,743 కులాలను బీసీలుగా తేల్చింది. దేశ జనాభాలో దాదాపు 52 శాతం బీసీలు ఉన్నట్టు ఆనాటి లెక్కలు చెప్తున్నాయి. కానీ.. వాళ్లకు అందులో సగం అంటే... 27 శాతం రిజర్వేషన్ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ లిస్టులో దేశవ్యాప్తంగా 2,479 కులాలు ఉన్నాయి. 


రాష్ట్రాల స్థాయిలో ఈ రిజర్వేషన్లు తీసుకునే కులాలు 3,150 ఉన్నాయి. ఈ రిజర్వేషన్లు కల్పించినప్పటి నుంచి ఇప్పటివరకు రిజర్వేషన్ల విషయంలో ఎప్పుడూ ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంది. చట్టసభల్లో ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే రిజర్వేషన్ ఉంది. బీసీలకు రిజర్వేషన్‌‌ కల్పించాలని ఎప్పటినుంచో డిమాండ్‌‌ చేస్తున్నారు. సగం మాత్రమే రిజర్వేషన్ ఉండడం వల్ల బీసీలు తమ జనాభాలో సగం వంతు మాత్రమే రిజర్వేషన్లు అందుకుంటున్నారు. అందుకే  కులగణన చేయాలని, రిజర్వేషన్లలో మార్పులు తీసుకురావాలని బీసీలు కోరుతున్నారు. అలాంటి మార్పులు తీసుకొస్తే.. రాజకీయ రిజర్వేషన్ విషయంలో అసలు సమస్య మొదలవుతుంది. బీసీ జనాభా ఎంతో తెలిస్తే.. దానికి తగ్గట్టు చట్ట సభల్లో రాజకీయ రిజర్వేషన్ ఇవ్వాలని డిమాండ్‌‌ చేస్తారు. అలా జరగకూడదనే కులగణన చేయడంలేదని బీసీ సంఘాలు ఆరోపిస్తున్నాయి. 

లెక్కలు తీయడం కష్టమా?

ఏ టెక్నాలజీ, సరైన ప్రభుత్వం, అధికార యంత్రాంగం లేని టైం1881లోనే కులగణన జరిగింది. అలాంటిది ఇప్పుడు పటిష్టమైన ప్రభుత్వాలు, అధికారులు, టెక్నాలజీ సపోర్ట్‌‌గా ఉండగా ఇప్పుడు కులగణన చేయడం అంత పెద్ద కష్టమేమీ కాదు. ఇప్పుటికే బీహార్‌‌‌‌, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌‌, తెలంగాణల్లో కులగణన చేశారు. కానీ.. వాటికి ఆ ప్రభుత్వాలు పెట్టిన పేర్లే వేరు. రాష్ట్రాలకు తగిన అధికారం లేకపోవడం వల్ల సర్వే పేరుతో కులగణన చేస్తున్నారు. కాకపోతే.. వీటిలో తెలంగాణతోపాటు మరికొన్ని రాష్ట్రాలు ఆ డాటాను బయటపెట్టలేదు. అయితే.. ఈ గణనలో కులం ఒక్కటే కాకుండా ఆ కుటుంబాల సమగ్ర పరిస్థితి కనుక్కోవాలి. అప్పుడే వాళ్లు ఏ పరిస్థితుల్లో ఉన్నారు? వాళ్ల కోసం ప్రభుత్వాలు ఏం చేయాలి? అనేది తెలుస్తుంది. 

బీహార్‌‌‌‌లో ఏం తేలింది? 

రాహుల్‌‌గాంధీ కంటే ముందే బీహార్‌‌‌‌లో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కులగణనకు తెరలేపారు. కులగణన లెక్కలు చేయకూడదని, దానివల్ల అనేక అనర్థాలు, సమస్యలు వస్తాయని కొన్ని సంస్థలు, వ్యక్తులు పాట్నా హైకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు చొరవ తీసుకుని కులగణనకు అడ్డంకులు సృష్టించడం సరికాదని తేల్చి చెప్పింది. దాంతో అనేక పిటిషన్లను తీసుకున్న పాట్నా హైకోర్టు అంతిమంగా కులగణన చేయాల్సిందేనని తీర్పు చెప్పింది. దాంతో అక్కడ కులగణన పూర్తిచేసి ఆ రిపోర్టును ప్రజల ముందు పెట్టారు. ఈ లెక్కల ప్రకారం బీహార్‌‌‌‌లో దాదాపు 63 శాతం ప్రజలు వెనుకబడిన కులాల వాళ్లేనని తేలింది. 

అందులో అత్యంత వెనుకబడిన కులాల వాళ్లు 36.05 శాతం ఉన్నారు. ఇతర వెనుకబడిన కులాల జనాభా 27.12 శాతం ఉంది. మొత్తంగా వెనుకబడిన కులాల జనాభా మొత్తం 63.13% ఉందని గుర్తించారు. అంటే మూడింట రెండు వంతుల జనాభా వెనుకబడిన కులాల ప్రజలే. ఇక షెడ్యూల్డ్ కులాలు19.65% అని తేలింది. షెడ్యూల్ తెగలు1.68% మాత్రమే ఉన్నారు. ఓపెన్ క్యాటగిరి జనాభా 10% మాత్రమే ఉంది. కులగణన సందర్భంగా హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు ఇతర మతస్తుల వివరాలు కూడా తెలిశాయి. బీహార్ జనగణన లెక్కల్లో వివిధ కులాలు, ఉపకులాల సామాజిక, ఆర్థిక స్థితిగతులు, ఇంటి యజమాని వివరాలు, ఆధార్ నెంబరు, రేషన్ కార్డ్స్ వంటివన్నీ సేకరించారు. 

మాదిగ వర్గీకరణ 

ఈ వర్గీకరణ అంశం 25 సంవత్సరాల నుంచి కొనసాగుతూనే ఉంది. అది రాజకీయ సమీకరణాలను మారుస్తూనే ఉంది. రాజకీయ పార్టీల మధ్య అవగాహన ఏర్పడినప్పుడు మాత్రమే ఈ సమస్య సులభంగా పరిష్కారమయ్యే అవకాశం ఉంది. 

అన్నీ తప్పులే?

ఇండియాలో 2011లో చేసిన కులగణనలో అన్ని తప్పులే ఉన్నాయి. అప్పటికే దేశంలో 120 కోట్ల జనాభా ఉంటే అందులో 90 కోట్ల జనాభా కులాల్నే లెక్కించారు. 2011 ముందు సేకరణ యంత్రాంగం సరిగ్గా లేదు. దాంతో లెక్కలు తీసుకునే వాళ్లు రకరకాల తప్పులు చేశారు. ఒకే కులం పేరుని వేరువేరు స్పెల్లింగులతో రాయడంతో ఒకే కులం అనేక కులాలుగా రికార్డు అయ్యింది. దాంతో ఏ జనాభా ఏ కులానిదో తేల్చడం చాలా కష్టంగా మారిపోయింది. ఉదాహరణకు.. మహారాష్ట్రలో ప్రభుత్వ లెక్కల ప్రకారం.. దాదాపు500 ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలు ఉంటే, 2011లో సామాజిక ఆర్థిక సర్వే ప్రకారం నాలుగు లక్షల 28 వేల కులాలు ఉన్నట్టు తేలింది. రాష్ట్ర జనాభా10 కోట్లు ఉంటే.. వాళ్లలో కోటీ పదిలక్షల మంది తమకు కులమే లేదన్నారు.1931 జనాభా లెక్కల ప్రకారం దేశంలో 4,147 కులాలు ఉంటే, 2011 నాటి కులగణన ప్రకారం 46 లక్షల కులాలు ఉన్నాయి. అందుకే కేంద్రం ఆ సమాచారం బయటపెట్టలేదు.

కర్నాటకలో 

కర్నాటక శాసనసభ ఎన్నికల సందర్భంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ బీహార్‌‌‌‌లో లాగే కులగణన చేస్తామని హామీ ఇచ్చింది. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆ హామీ ప్రకారం కులగణన చేశారు. ఫైనల్ రిపోర్టు ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ఇచ్చారు. ఆ రిపోర్టులో కర్ణాటక జనాభా ఐదు కోట్ల 98 లక్షలుగా తేలినట్టు అంచనా వేస్తున్నారు. అందులో 3.98 కోట్ల మంది బీసీ కులాలకు చెందినవాళ్లు. ఓపెన్ కేటగిరీకి సంబంధించిన జనాభా1.87 కోట్లుగా అంచనా వేశారు. మన రాష్ట్రంలో కూడా శాసనసభ ఎన్నికల సందర్భంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ  కులగణన చేస్తామని రాహుల్ గాంధీ సమక్షంలో హామీ ఇచ్చింది. ఆ దిశగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కులగణన చేయడానికి శాసనసభలో తీర్మానం చేసింది.