‘రైతులకు ఏం కావాలో తెలవాలంటే రైతులనే కదా అడగాల్సింది. రైతులు ఏమవుతున్నారో తెలపాలంటే రైతులనే కదా పరిశీలించాల్సింది. అదే పని తెలుగు రైతుబడితో చేస్తున్నా” అంటున్నాడు రాజేందర్ రెడ్డి. జర్నలిస్టుగా పన్నెండేళ్లు పనిచేశాక ‘రైతుబడి’ పేరుతో రైతులనే పంతుళ్లుగా చేసి... వాళ్ల అనుభవాలను రెండు తెలుగు రాష్ట్రాల రైతులకు అందిస్తున్నాడు. రాజేందర్ చేస్తున్న కృషికి ఇప్పుడు జాతీయస్థాయిలో గుర్తింపు దక్కింది. ప్రశంసలు అందుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన నేషనల్ క్రియేటర్స్ అవార్డ్ ఓటింగ్ పోల్‌లో.. వ్యవసాయ ఛానెల్స్ కేటగిరీలో రైతుబడి 36 శాతం ఓట్లతో ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది. అది గుర్తించిన ఐఐఐటీ ఢిల్లీ తమ సంస్థ ‘ఎంట్రప్రెనూర్ షిప్ సమ్మిట్-2024’లో మాట్లాడేందుకు రాజేందర్‌ను ఆహ్వానించింది.
ఈ ఊరు.. -ఆ ఊరు.. ఈ జిల్లా... -ఆ జిల్లా.. ఈ రాష్ట్రం... -ఆ రాష్ట్రం.. అనే దూరాలు రైతుబడిని ఎన్నడూ ఆపలేదు. జర్నలిస్టుగా జిల్లా స్థాయిలో చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేసి 2020 జనవరిలో రైతుబడిని మొదలు పెట్టాడు రాజేందర్. మొదలుపెట్టాక నాలుగేండ్లలో లక్ష కిలోమీటర్లకు పైగా జర్నీ చేశాడు. ఆదిలాబాద్ నుంచి అనంతపురం వరకు, పాలమూరు మొదలు పాలకొల్లు వరకు.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాలతోపాటు.. కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రాల్లోనూ రైతులను కలిశాడు. సాగులో వాళ్ల అనుభవాలను సేకరించాడు.ఈ క్రమంలో వెయ్యి మందికి పైగా రైతులను ఇంటర్వ్యూ చేశాడు. పొలాలకి వెళ్లి, అక్కడ పనులు చేసుకుంటున్న రైతులతో మాట్లాడుతూ... ఉన్నది ఉన్నట్టుగా యూట్యూబ్, ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ల్లో పోస్ట్ చేస్తుంటాడు.
20 లక్షల ఫాలోవర్లు.. వంద కోట్ల వ్యూస్
వ్యవసాయంలో పండిస్తున్న అనేక రకాల పండ్లు, కూరగాయలు, ధాన్యం, పప్పు దినుసులు, నూనె గింజల వంటి పంటలే కాదు. వ్యవసాయ అనుబంధ వ్యాపారాలైన కోళ్లు, చేపలు, రొయ్యలు, గేదెలు, ఆవులు, తేనెటీగల పెంపకంతో పాటు.. ప్రాసెసింగ్ పరిశ్రమలను సైతం రైతుబడి ఛానెల్లో చూపెడతాడు. మహారాష్ట్రలో ద్రాక్ష సాగు, కర్ణాటకలో పట్టు సాగు, తమిళనాడు కోయంబత్తూరులో వ్యవసాయ యంత్రాలు.. వంటివెన్నో ఈ ఛానెల్లో చూడొచ్చు. వ్యవసాయంలో రైతుల అనుభవాలు మినహా వేరే కంటెంట్ కనిపించదు. యూట్యూబ్‌లో రైతుబడికి13.2 లక్షల మంది(ఈ వ్యాసం రాసేటప్పటికి) సబ్ స్క్రయిబర్లు ఉన్నారు.11 వందలకు పైగా వీడియోలు పోస్ట్ చేస్తే.. 61 కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఇక ఇన్‌స్టాగ్రామ్‌లో రైతుబడిని 4.5 లక్షల మంది ఫాలో అవుతున్నారు. ఫేస్బుక్ ఫాలోయర్స్ మరో నాలుగు లక్షల మంది. వాళ్లందరితో కలుపుకొని 20 లక్షల మందికి పైగా రైతుబడిని ఫాలో అవుతున్నారు. మూడు ప్లాట్‌ఫామ్స్‌లో కలిపి వంద కోట్లకు పైగా వ్యూస్ ఉన్నాయి.
జాతీయ స్థాయిలో గుర్తింపు
జర్నలిస్టుగా పని చేస్తున్నప్పుడు ప్రభుత్వం నుంచి 2016లో ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు అందుకున్నాడు. కాకతీయ రాజవంశం ప్రతాపరుద్రుడితోనే అంతరించిపోలేదని.. ఇప్పటికీ వారి వంశస్తులు ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్ పూర్‌లో ఉన్నారని 2009లో తొలిసారి రిపోర్ట్ చేశాడు. ఇప్పుడు రైతుబడితో చేస్తున్న పనికి యూట్యూబ్ సహా పలు సంస్థల నుంచి అవార్డులు అందుకున్నాడు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన నేషనల్ క్రియేటర్స్ అవార్డ్ పోల్‌లో రైతుబడి దేశస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది. దేశ వ్యాప్తంగా 9 ఛానెల్స్ అత్యంత ప్రభావవంతమైన వ్యవసాయ క్రియేటర్ కేటగిరీలో అవార్డ్ కోసం పోటీ పడ్డాయి. ఇందులో 8 హిందీ ఛానెల్స్ పాల్గొనగా దక్షిణ భారత దేశం నుంచి రైతుబడి ఒక్కటే నామినేట్ అయింది.ఈ గుర్తింపుతో ఢిల్లీలోని ‘ఇంద్రప్రస్థ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ (ఐఐఐటీ) ఢిల్లీ.. తాము ఏర్పాటుచేస్తున్న సెమినార్లో ప్రసంగించేందుకు రాజేందర్ రెడ్డిని ఆహ్వానించింది.
చేయాల్సింది ఇంకా ఉంది
వ్యవసాయం పెద్దది. రైతుల కష్టం ఇంకా పెద్దది. వాటితో పోల్చినపుడు రైతుబడి చేస్తున్నది చాలా చిన్నది. సొంత పని కావాలని.. సంతృప్తిని వెతుకుతూ ఈ ప్రయాణం మొదలుపెట్టా. ఇందులో నాకు గుర్తింపు, సంతృప్తి దక్కుతున్నాయి. కానీ రైతులకు ఏం కావాలి? రైతులేం కావాలనుకుంటున్నారు? అనే ప్రశ్నలు మాత్రం ప్రతి నిత్యం ఎదురవుతూనే ఉన్నాయి. అందుకే ఎంత చేసినా ఇంకా ఎంతో చేయాల్సి ఉంది అనిపిస్తుంది. మన దగ్గరతోపాటు దేశ, విదేశాల్లో ఎన్నో వ్యవసాయ విధానాలు, పద్ధతులు ఉన్నాయి. వాటిని తెలుగు రైతులకు చేరువ చేయాలి. మన వాళ్లను లాభాల బాటలో నడిపించాలి. అదే నా లక్ష్యం. అవకాశం ఉన్నంత వరకు ఈ ప్రయత్నం చేస్తుంటా.
రాజేందర్ రెడ్డి రైతుబడి, వ్యవస్థాపక నిర్వాహకుడు
అనుభవమే ఆయుధం
వేల కిలోమీటర్లు ప్రయాణిస్తూ, ఆదర్శ రైతులను అన్వేషిస్తూ సాగుతున్న రాజేందర్ తల్లిదండ్రులు కూడా రైతులే. నల్గొండ జిల్లా మాడ్గులపల్లి మండలం మాచనపల్లిలోని అతి సాధారణ రైతు కుటుంబంలో పుట్టి పెరిగాడు రాజేందర్. ఉన్న కొద్ది పొలంలో రాజేందర్ తల్లిదండ్రులు వరి, కూరగాయల సాగు చేసే వాళ్లు. తమ కొడుకు తమలాగా కష్టపడకూడదని బాగా చదివించారు. బీఎస్సీ పూర్తి చేశాక జర్నలిజాన్ని ప్రొఫెషన్‌గా ఎంచుకున్నాడు. పలు న్యూస్ ఛానెల్స్‌లో, పత్రికల్లో 2008 నుంచి 2020 వరకు పన్నెండేళ్ల పాటు హైదరాబాద్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో పని చేశాడు. ఉద్యోగిగా ఉంటూనే తనకంటూ సొంత పని ఉండాలనే ఆలోచనతో ఎన్నో ప్రయత్నాలు చేశాడు. చివరకు రైతుబడితో రైతులకు చేరువ అవుతూ విజయం సాధించాడు.
- సుమన్, మిర్యాలగూడ