Guru purnima 2024: గురువును పూజించే  రోజు.. గురుపౌర్ణమి

పండగలకు.. ఉత్సవాలకు దేవాలయాలకు వెళతాం.. దేవుళ్లను పూజిస్తాం.  వినాయకచవితికి వినాయకుడిని.. దసరా కు దుర్గాదేవిని.. శివరాత్రికి శివుడిని ఇలా  ఎవరి ఇష్టం వచ్చిన దేవుడిని వారు పూజిస్తారు.  అయితే మనం ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నా... ఙ్ఞానాన్ని సంపాదించుకోవాలన్నా... జీవితంలో ఎవరితో ఎలా ఉండాలి.. అనే విషయాలు గురువు నేర్పుతారు.  ప్రతి వ్యక్తి జీవితంలో గురువు ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తాడు.  అలాంటి గురువును వాస్తవంగా రోజూ పూజించాలి.  అయితే ప్రతి మనిషికి ఒక్కో సమయంలో ఒక్కో గురువు ఉంటారు. చిన్నప్పుడు స్కూల్లో కొంతమంది .. హైస్కూలో కొంతమంది.. కాలేజీల్లో.. జీవిత పాఠాలే నేర్పే గురువులు ఉంటారు.  అయితే ఇలాంటి వారందరని గురుపౌర్ణమి( జులై 21)న పూజించాలని పురాణాలు చెబుతున్నాయి.

ప్రతి ఒక్కరూ గురువుని దేవులాడుకుంట పోనక్కర్లేదు. నిజాయితీగా ఒక లక్ష్యం కోసం తపిస్తున్నప్పుడు గురువే మీ జీవితంలోకి పస్తాడు. ఆ గురువే మిమ్మల్ని గమ్యం వైపు నడిపిస్తాడు.చిన్నప్పటి నుంచి మనం ఎంతో మంది గురువుల దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకుంటం. కానీ, అందరూ జీవితంపై ముద్ర వెయ్యలేరు. మన జీవితాన్ని తీర్చిదిద్దే గురువు ఎలా ఉంటారో .. పురాణాల్లో  వివరించారు. 

Also Read :- గురువు అంటే ఏమిటి

  • సత్యాన్ని పాటిస్తాడు.
  • సమస్త జీవరాశుల పట్ల దయతో ఉంటాడు
  •  ప్రశాంతమైన మనసు కలిగినవాడు.
  • నిగ్రహ, అనుగ్రహ శక్తులు ఉన్నవాడు.
  • పరమభక్తుడు, వేద, జ్ఞాన సంపన్నుడు,
  • యోగం తెలిసినవాడు.
  •  శిష్యుడి తప్పుని గుర్తించగలిగినవాడు.

రకరకాల గురువులు..

మామూలుగా గురువు అనగానే చదువు చెప్పేవాడని అనుకుంటారు. కానీ, మనకు అనేక రకాల గురువులు ఉన్నారని హిందూ మత గ్రంథాలు చెప్తున్నాయి. ఏ గురువుడైనా తన శిష్యుడికి జ్ఞానం ప్రసాదించాలనే లక్ష్యమే ఉంటుంది.

సూచక గురువులు: భక్తి, జ్ఞాన, వైరాగ్య బోధనలు చేసి సాధన సంపత్తి కలిగిన శిష్యులను తయారు చేస్తారు. చదువు చెప్పేవాళ్లు కూడా వీళ్లే.
వాచక గురువులు: ఆశ్రమ ధర్మాలను బోధిస్తూ... దేహం అశాశ్వతమని గమ్యాన్ని గుర్తు చేస్తారు.
వేదగురువులు: వేద పురాణేతిహాసాలు చదివి, శిష్యులతో చదివిస్తరు. ధర్మాలను విశదీకరించి ఆచరిస్తూ ఆచరింపజేస్తారు.
నిషిద్ధ గురువులు: మంత్ర తంత్రాలతో... వశీకరణ విద్యలు బోధిస్తారు.
బోధక గురువు : మంత్రాలు ఉపదేశిస్తారు.
విహిత గురువులు: భోగాల మీద విరక్తి కలిగిస్తారు.
కారణ గురువులు: ఆసనాలు, ప్రాణాయామాలు చేయించి.. బ్రహ్మతత్త్వాన్ని ఉపదేశించి.. అద్వైత స్థితిని కలిగిస్తారు.
పరమ గురువు: పరమాత్మ అనుభవాన్ని ప్రత్యక్షంగా కలిగిస్తారు.
సద్గురువులు: తెలుసుకోగలిగితే.. గురువు, ఆయనే గొప్ప గురువు

వశిష్టుడు, వాల్మీకి లాంటి తపశ్శక్తి సంపన్ను లు ఎంతమంది ఉన్నా వేదవ్యాసుడికే మన ప్రాచీనులు అగ్రపీఠం వేశారు. ఎందుకంటే, ఒకే రాశిగా ఉన్న వేదాల్ని ఋగ్, యజు. సామ, అధర్వణ వేదాలుగా విభజించి లోకానికి అందించినవాడు వ్యాసుడు. ఆయనే బ్రహ్మసూత్రాలకు భాష్యం రాశాడు.

 మహాభారతం, భాగవతాలను రచించాడు. శ్రీకృష్ణుడి రూపంలో ప్రపంచానికి భగవద్గీత బోధించాడు. అనంతమైన సాహిత్యాన్ని సృష్టించి, దాని ద్వారా భారతీయ సంస్కృ తికి పునాదిరాళ్లు వేశాడు. శక్తి, భక్తి, శీలం, సహజీవనం, సనాతన ధర్మం, పవిత్రత, దానధర్మాలు ఈ దేశ సహజ లక్షణాలుగా రూపొందటానికి మూలం వ్యాసుడి రచనలే. ఇంతటి మహారుషిని భారతజాతికి గురువుగా భావించి చేసే పూజే 'గురుపౌర్ణమి'. భగవద్గీతలో కృష్ణుడు ..ఇలా చెప్పాడని పండితులు చెబుతున్నారు

Also Read :- గురు పూర్ణిమ   పూజా విధానం

'మునీనామ్యహం వ్యాసః'.. 'మునుల్లో నేను వ్యాసుడిని"అంటాడు. ఇక్కడ గురువుదేవునితో సమానమని చెప్పకనే చెప్పాడు

నిజమైన గురువు తన శిష్యుల భ్రమల్ని పటాపంచలు చేస్తాడు. అతని సమక్షంలో ఉన్నప్పుడు శిష్యుడు కంఫర్దని, సంతోషాన్ని ఫీలవుతాడు. నిజాలు చెప్తూ తమకు తామే రియలైజ్ అయ్యేట్టు చేస్తాడు. గురువు ఆలోచనలు, ఆచరణ ఒకేవిధంగా ఉంటాయి. నిజమైన గురు, శిష్యుల మనసులు కలిసి ఉంటాయి. జీవితంలో మీరు కోరుకున్నది. ఎవరూ 'ఇదిగో తీసుకో' అని తెచ్చివ్వరు. కాబట్టి దాన్ని మీరే తెచ్చుకోవాలె, దాన్ని ఎట్లా తెచ్చుకోవాలో చెప్పి మేలుకొలుపేది గురువే. సమర్థ రామదాస్ వీరశివాజీని తయారు చేశాడు. తన ఉపన్యాసాలతో భారతీయ సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పిన వివేకానందుడిని రామకృష్ణ పరమహంస తీర్చిదిద్దాడు. బుద్ధుడు, వర్ధమాన మహావీరుడు, భగవాన్ రమణమహర్షి వంటి ఎందరో మహా మహా గురువుల బోధనలు మనదేశాన్ని ధర్మమార్గంలో నడిపిస్తున్నాయి.