మూడు సార్లు చెత్త తరలింపు ఒట్టిమాటే

  • ఒక్కసారి తీసుకెళ్లి మూడుసార్లు తొలగిస్తున్నట్లు బల్దియా గొప్పలు
  • రోడ్లపై ఎక్కడ చూసినా చెత్త కుప్పలే
  • రోజురోజుకు తీవ్రమవుతున్న సమస్య
  • ఫీల్డ్లోకి వెళ్లని ఆఫీసర్లు
  • 4500 ఆటోల్లో ఫీల్డ్​లోకి రానివే వెయ్యి
  • మరికొన్ని రిపేర్లతో మూలకు..

హైదరాబాద్ సిటీ, వెలుగు: నగరంలోని రోడ్లపై ఉన్న గార్బేజ్ వల్నరబుల్ పాయింట్(జీవీపీ) నుంచి రోజూ మూడుసార్లు చెత్త తరలిస్తున్నామని బల్దియా చెబుతున్నదంతా ఒట్టి మాటగానే కనిపిస్తోంది. కొన్నిచోట్ల రోజుకు ఒక్కసారి, ఇంకొన్నిచోట్ల రోజుకు రెండుసార్లు మాత్రమే తరలించి అంతటా మూడుసార్లు తరలిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటోంది. పైగా సిటీలో ఎక్కడా కూడా చెత్త సమస్య లేదని అంటోంది. వాస్తవ పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. ప్రస్తుతం సిటీలో ఎక్కడ చూసినా చెత్త కుప్పులే కనిపిస్తున్నాయి.

డస్ట్ బిన్ లెస్ సిటీ పేరుతో నగరంలో ఉన్న డస్ట్ బిన్లను మూడేండ్ల క్రితం బల్దియా తొలగించింది. దీంతో పాటు డస్ట్ బిన్లు ఉండే జీవీపీలను కూడా చాలా ప్రాంతాల్లో ఎత్తివేసింది. ఎవరు కూడా రోడ్లపై చెత్తను వేయొద్దని, ఇంటింటికీ వచ్చే స్వచ్ఛ ఆటోల్లో మాత్రమే వేయాలని సూచించింది. అయితే స్వచ్ఛ ఆటోలు చాలా ప్రాంతాల్లోకి వెళ్లడం లేదు. కొన్ని చోట్ల వారానికి ఒకటి, రెండు సార్లు మాత్రమే వస్తున్నాయి. దీంతో చాలా మంది నేటికీ గతంలో డస్ట్ బిన్లు ఉండే జీవీపీల వద్ద ఉన్న రోడ్లపైనే చెత్త వేస్తున్నారు.  చెత్త వేయొద్దని బల్దియా చెబుతున్నప్పటికీ ప్రత్యామ్నాయ మార్గాలు లేక వేస్తున్నామని జనాలు చెప్తున్నారు. ఇంటింటికీ ఆటో వస్తే చెత్త ఎందుకు వేస్తామని ప్రశ్నిస్తున్నారు.  

వెయ్యి జీవీపీలు అవుట్​
గ్రేటర్ లో 3400  గార్బేజ్ వల్నరబుల్ పాయింట్ల(జీవీపీ) ను గుర్తించిన బల్దియా అందులో వెయ్యి వరకు  జీవీపీలను ఎలిమినేట్ చేసింది. తొలగించిన సర్కిల్స్ లో సిబ్బందికి గతంలో అవార్డులు ఇవ్వడంతో పాటు సన్మానాలు చేసింది. ప్రస్తుతం కొన్నిచోట్ల జీవీపీ పాయింట్లు లేవని బల్దియా ప్రకటించింది. అయితే, ఇంటికి స్వచ్ఛ ఆటోలు రాని ప్రాంతాల్లో ఉంటున్న వారు చేసేదేమీ లేక రాత్రి టైంలో రోడ్లపై పడేస్తున్నారు. దీంతో కాలనీలు, బస్తీలు కంపుకొడుతున్నాయి. మెయిన్​రోడ్లతో పాటు కాలనీల్లో ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయి దుర్గంధం వెదజల్లుతోంది.  గ్రేటర్ లో 4,500 కాలనీలుండగా వెయ్యికిపైగా కాలనీల్లో సమస్య తీవ్రంగా ఉంది. ఎప్పటికప్పుడు ఫీల్డ్​లెవెల్​లో పర్యవేక్షించాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతోనే సమస్య ఏర్పడుతోంది.  

ఆటోలు ఫీల్డ్లోకి రాకనే..
ఇంటింటికి చెత్త సేకరించాల్సిన స్వచ్ఛ ఆటోలు 4500 ఉన్నాయి. ఇందులో వెయ్యి వరకు ఆటోలు ఫీల్డ్లోకి రావడం లేదు. కొన్నేండ్లుగా పనిచేస్తుండడంతో రిపేర్లకి రాగా, ఇంకొన్ని గ్రేటర్ లో కాకుండా మిగతా చోట్ల చెత్త సేకరిస్తున్నాయి. మరికొన్ని అయితే ఫీల్డ్ లోకి రావడం లేదు. వచ్చిన వారు కూడా లిమిటెడ్ గా మాత్రమే చెత్తను తీసుకెళ్తామని కండిషన్స్ పెడుతున్నారు. ఇలా 25 శాతం వరకు ఆటోలు ఫీల్డ్ లో లేకపోవడంతో చెత్త సేకరణ జరగడం లేదు. 

కోటిన్నర జనాభా ఉన్న గ్రేటర్ లో కేవలం 4500 ఆటోలు సరిపోవు. ఆటోల సంఖ్య పెంచడంతో పాటు ప్రతి ఇంటికీ స్వచ్ఛ ఆటోలు చెత్తను సేకరించేలా అధికారులు చర్యలు తీసుకుంటే తప్ప రోడ్లపై చెత్త  సమస్య తీరేలా కనిపించడం లేదు. కొన్ని ప్రాంతాల్లో చెత్త కాస్త ఎక్కువగా ఉన్నా అదనంగా డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తుండడంతో  రోడ్లపై చెత్తను వేస్తున్నారు.