తెలంగాణ పోలీస్​కు మంచి గుర్తింపు : డీజీ డాక్టర్​ అనిల్​కుమార్​

  • ఆర్థిక క్రమశిక్షణతో డ్యూటీలు చేయాలి 
  • ఏఆర్​ కానిస్టేబుళ్ల పాసింగ్​ అవుట్​ పరేడ్​లోఎస్పీఎఫ్​ డీజీ డాక్టర్​ అనిల్​కుమార్​

నిజామాబాద్, వెలుగు: పోలీసు విధులను సమాజం నిరంతరం గమనిస్తూ ఉంటుందని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నిజాయితీగా పనిచేయాలని స్పెషల్​ పోలీస్​ ఫోర్స్​ (ఎస్​పీఎఫ్​) డీజీ  డాక్టర్​ అనిల్​కుమార్​ అన్నారు. రాష్ట్ర పోలీస్​ శాఖకు దేశంలో మంచి గుర్తింపు ఉందని, దానిని నిరంతరం కాపాడాలన్నారు. గురువారం జిల్లాలోని ఎడపల్లి మండలం జాన్కంపేట్​ క్యాంప్​లో ట్రైనింగ్​ పూర్తి చేసుకున్న 250 మంది ఏఆర్​ కానిస్టేబుళ్ల పాసింగ్​ అవుట్​ పరేడ్​లో ఆయన ప్రసంగించారు.  

డిగ్రీ, పీజీ ఉన్నత విద్యార్హతలు గల వారు కానిస్టేబుల్​ జాబ్స్​కు రావడంతో సమాజానికి మెరుగైన సేవలు అందుతాయన్నారు.  ఏ స్థాయిలో ఉన్నా జాతీయ సమగ్రత ధ్యేయంగా పనిచేయాలని,  ప్రజల ధన, మాన, ప్రాణాల రక్షణను అత్యంత ప్రాధాన్యతగా పరిగణించాలన్నారు. సులువుగా డబ్బు సంపాదించాలనే ఆలోచన మంచిదికాదని, ఆర్థిక క్రమశిక్షణతో ఆదర్శవంతమైన జీవితాలు గడపాలన్నారు.   

ప్రతిష్ట పెంచేలా..

రాష్ట్రంలోని 16 ట్రైనింగ్​ సెంటర్ల నుంచి ఒకేరోజు శిక్షణ పూర్తి చేసుకున్న కానిస్టేబుల్స్​పాసింగ్​ అవుట్​ పరేడ్​ నిర్వహిస్తున్నామని డీజీ అనిల్​కుమార్​ తెలిపారు. ఇది గొప్ప మైలురాయి అని అభివర్ణించారు. సత్ప్రవర్తన, వ్యవహారశైలితో పోలీస్​ శాఖ గౌరవాన్ని పెంచాలని ఆక్షాంక్షించారు.

కొత్త చట్టాలపై అవగాహన, ఫైరింగ్​, దేహదారుఢ్యం, ఆత్మస్థైర్యంపై  టైనింగ్​ ఇచ్చి కానిస్టేబుల్స్​గా తీర్చిదిద్దామని, పోలీస్​ శాఖలోకి తమ పిల్లలను చేర్చిన పేరెంట్స్​కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ట్రైనింగ్​లో నైపుణ్యాన్ని ప్రదర్శించిన కానిస్టేబుల్స్​కు బహుమతులు ప్రదానం చేశారు.  ఇన్​చార్జ్​ సీహెచ్​ సింధూశర్మ, సీటీసీ వైస్​ ప్రిన్సిపాల్​సయ్యద్​ మస్తాన్​అలీ పాల్గొన్నారు.