ఇప్పుడు దేశమంతా రాముడికి సంబంధించిన వార్తలే. ఎక్కడ విన్నా అయోధ్యలో తయారవుతున్న రామ మందిరం గురించిన ముచ్చట్లే. అయోధ్యలో బాల రాముని ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా చాలా స్పెషల్స్ ఉన్నాయి. వాటిలో ఫుడ్ కూడా ఉంది. ఆ రోజు సాత్విక ఆహారం తినాలని ఎక్కువమంది అనుకుంటున్నారు. అది సరే మరి ఇంట్లో ఉన్న పిల్ల పిడుగులకు ఏం పెడతారు? వాళ్లకి బలమైన ఫుడ్ పెట్టాలనుకుంటున్నారా! అయితే ఈ స్పెషల్స్ మీ ఇంటి బాల రాముళ్లు, బుజ్జి తల్లుల కోసం.
గుమ్మడి రోటి
కావాల్సినవి :
గుమ్మడి పండు ముక్కలు - ఒక కప్పు
గోధుమ పిండి - ఒక కప్పు
తయారీ : గుమ్మడి పండుని చిన్న ముక్కలుగా తరగాలి. వాటిని మిక్సీజార్‌లో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఆ పేస్ట్‌ని ఒక గిన్నెలో వేసి, అందులో గోధుమ పిండి వేసి రెండింటినీ బాగా మిక్స్ అయ్యేలా కలపాలి. చపాతీ ముద్దలా చేశాక దాన్నుంచి కొంచెం కొంచెం పిండి తీసుకుని చిన్న ఉండలు చేయాలి. పొడి పిండి అద్దుతూ వాటిని చపాతీల్లా వత్తాలి. వేడి చేసిన పెనంపైన రోటీ వేయాలి. చేతిలో ఒక గుడ్డ పట్టుకుని రోటీని కదిలిస్తూ గుండ్రంగా తిప్పుతుండాలి. అది పూరీలా పొంగేవరకు రెండు వైపులా కాల్చాలి. మెత్తగా ఉండే ఈ రోటీ రుచి తియ్యగా బాగుంటుంది. వీలైతే మట్టి పెనం మీద రోటీలు కాల్చుకోవడం ఆరోగ్యకరం. ఇలాగే... కీర దోస, బీట్రూట్, పాలకూరతో కూడా రోటీలు చేసుకోవచ్చు.
బీన్స్ దాల్ వేపుడు
కావాల్సినవి :
బీన్స్ తరుగు - పావుకిలో
శనగ పప్పు - అర కప్పు,
ఎండు మిర్చి - ఐదు
కరివేపాకు, కొత్తిమీర - కొంచెం
ఉప్పు - సరిపడా
కొబ్బరి నూనె లేదా పల్లీ నూనె, ఆవాలు, నిమ్మరసం - ఒక్కో టీ స్పూన్
అల్లం తరుగు - ఒక టీస్పూన్
తయారీ : శనగపప్పుని రెండు గంటలు నానబెట్టాలి. తర్వాత మిక్సీజార్‌లో వేయాలి. దాంతోపాటు కరివేపాకు, ఎండు మిర్చి, ఉప్పు కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. పాన్‌లో నూనె వేడి చేసి ఆవాలు, కరివేపాకు వేగించాలి. అందులో బీన్స్, అల్లం తరుగు వేగించాలి. ఆ తర్వాత శనగపప్పు మిశ్రమం, ఉప్పు వేసి కలపాలి. కాసేపటి తర్వాత నీళ్లు పోసి కలిపి, మూత పెట్టి ఉడికించాలి. చివరిగా కొత్తిమీర, నిమ్మరసం చల్లాలి. దీన్ని చపాతీతో తినొచ్చు. మరీ డ్రైగా కాకుండా కాస్త లిక్విడ్‌గా కావాలంటే, పెరుగుతో తినొచ్చు ఈ హెల్దీ రెసిపీని..
చాకొలెట్ మూస్
కావాల్సినవి
గెనుసు(మొరం) గడ్డలు - రెండు
కొబ్బరి పాలు - అర కప్పు
కర్జూర (నానబెట్టి) - ముప్పావు కప్పు
కొకొవా పొడి - రెండు టేబుల్ స్పూన్లు
ఉప్పు - చిటికెడు
తయారీ : గెనుసు గడ్డల్ని శుభ్రంగా కడగాలి. వాటిని గిన్నెలో వేసి, నీళ్లు పోసి ఉడికించాలి. తర్వాత వాటి తొక్క తీసేసి, మెత్తగా మెదపాలి. ఆ మిశ్రమాన్ని మిక్సీజార్‌లో వేయాలి. దానితోపాటు కొకొవా పొడి, కొబ్బరి పాలు, గింజలు తీసేసి, నానబెట్టిన కర్జూర, ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. దీన్ని ఒక కప్పులో వేసి అరగంటసేపు ఫ్రిజ్‌లో పెడితే చాలు తినేందుకు రెడీ అయిపోతుంది.
పైనాపిల్ చీజ్ కేక్
కావాల్సినవి :
గుమ్మడి గింజలు - అర కప్పు
బాదం పప్పులు - అర కప్పు
కర్జూర - అర కప్పు
రాతి ఉప్పు - పావు టీస్పూన్
చీజ్ కోసం :
పైనాపిల్ ముక్కలు - ఒక కప్పు
జీడిపప్పులు (నానబెట్టి) - ఒకటిన్నర కప్పు
బెల్లం పొడి - రెండు టేబుల్ స్పూన్లు
కర్జూర - నాలుగు
ఉప్పు - అర టీస్పూన్
నిమ్మరసం - రెండు టేబుల్ స్పూన్లు
తయారీ : పాన్ వేడి చేసి అందులో గుమ్మడి గింజలు, బాదం పప్పులు వేసి వేగించాలి. అవి చల్లారాక మిక్సీజార్‌లో వేయాలి. వాటితోపాటు గింజలు తీసేసిన కర్జూర, ఉప్పు వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టాలి.
చీజ్ తయారీ :
మిక్సీజార్‌లో పైనాపిల్ ముక్కలు, నానబెట్టిన జీడి పప్పులు, బెల్లం పొడి, కర్జూర, నిమ్మరసం, ఉప్పు వేసి గ్రైండ్ చేయాలి. ఆ పేస్ట్‌ని గిన్నెలో వేసి, అందులో సన్నగా తరిగిన పైనాపిల్ ముక్కలు వేసి కలపాలి.
ఒక గ్లాస్లో ముందు తయారు చేసుకున్న డ్రైఫ్రూట్స్ మిక్స్ వేయాలి. దానిపై పైనాపిల్ మిశ్రమం వేయాలి. ఆ గ్లాస్‌ని మూడు గంటలు ఫ్రిజ్‌లో పెట్టి, ఆ తర్వాత తింటే టేస్ట్ బాగుంటుంది.
వెజ్ మిల్లెట్ చీలా
కావాల్సినవి
జొన్న పిండి : రెండు టేబుల్ స్పూన్లు
గోధుమ పిండి : ఒక టేబుల్ స్పూన్
శనగపిండి : ఒక టేబుల్ స్పూన్
ఉప్పు, నీళ్లు, నెయ్యి : సరిపడా
పసుపు : చిటికెడు
మిరియాల పొడి : అర టీస్పూన్
బీన్స్, క్యారెట్, క్యాప్సికమ్, క్యాబేజి తరుగు : ఒక్కోటి రెండు టేబుల్ స్పూన్లు
తయారీ : ఒక గిన్నెలో జొన్న పిండి, గోధుమ పిండి, శనగపిండి, ఉప్పు, పసుపు, మిరియాల పొడి వేసి నీళ్లు పోస్తూ కలపాలి. అందులో బీన్స్, క్యారెట్, క్యాప్సికమ్, క్యాబేజి తరుగు వేసి కలపాలి. పాన్ వేడి చేసి, నెయ్యి పూయాలి. దానిపై రెడీ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని దోశలా పోసి రెండు వైపులా కాల్చాలి.
చైనీస్ మోచి
కావాల్సినవి :
రేగి పండ్లు (ఎండబెట్టినవి) - పది
బియ్యప్పిండి - పావు కప్పు
చక్కెర - ఒక టేబుల్ స్పూన్
నీళ్లు - కొన్ని
తయారీ : ఎండు రేగి పండ్లను కడిగి తుడవాలి. తర్వాత వాటిని నిలువుగా కట్ చేసి గింజను తీసేయాలి. ఒక గిన్నెలో బియ్యప్పిండి, చక్కెర వేసి, నీళ్లు పోసి మెత్తటి ముద్దగా కలపాలి. ఆ మిశ్రమం నుంచి చిన్న ఉండలు చేయాలి. ఆ ఉండల్ని రేగి పండ్ల మధ్యలో స్టఫింగ్ చేయాలి. స్టఫింగ్ చేసిన వాటన్నింటినీ ఒక ప్లేట్లో పెట్టాలి. ఆ తర్వాత పాన్‌లో ఆ ప్లేట్‌ని పెట్టి మూతపెట్టాలి. పది నిమిషాలు ఆవిరికి ఉడికిస్తే చైనీస్ మోచి రెడీ.