2500ఏళ్ల నిలిచి ఉండే అద్భుత ఆధ్యాత్మిక కట్టడం. ఇనుము వాడకుండా ప్రత్యేక శిలలతో అందమైన నిర్మాణం. ప్రపంచంలో మూడో అతిపెద్ద హిందూ ఆలయం. భారతీయ సంస్కృతి, వారసత్వాలకు నిలువెత్తు రూపం. ఇవి అయోధ్యలోని రామమందిర వైభవాన్ని చాటిచెప్పే విశిష్టతలు.
అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి ముస్తాబవుతోంది. కోట్లాది మంది భక్తులు ఆ కోదండ రాముడి దర్శనం కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే.. భవ్యమైన రామ మందిరంలో కొలువుదీరబోయే శ్రీరామచంద్రమూర్తి ఎలా ఉండబోతోతున్నారు..? దివ్య మంగళమైన రామ్ లల్లా విగ్రహం (Statue of Ram Lalla)రూపు ఎలా ఉండబోతోంది..?
అయోధ్య రామ మందిరంలో ప్రతిష్ఠించేందుకు మొత్తం 3 విగ్రహాలను తయారు చేయించింది శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ (Sri Ram Janmabhoomi Tirtha Kshetra Trust). ఈ మూడు విగ్రహాలు దైవత్వం ఉట్టిపడేలా అద్భుతమైన శిల్పసౌందర్యంతో రూపొందించినవే. అయితే.. ఇందులో ఐదేళ్ల బాల రాముడి విగ్రహాన్ని మౌఖిక ఓటింగ్ ద్వారా ఎంపిక చేసింది శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్. ఈ విగ్రహం ఎత్తు 51 అంగుళాలు. విల్లంబులు చేత పట్టుకుని, పద్మంపై ఉన్న చిన్న రాముడి విగ్రహాన్ని ప్రముఖ శిల్పి అరుణ్ యోగిరాజ్ రూపొందించారు. కేదార్‌నాథ్‌లోని ఆదిశంకరాచార్య, ఢిల్లీలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ (Subhash Chandra Bose) విగ్రహాలను కూడా రూపొందించినది అరుణ్ యోగిరాజే.
అయోధ్యలో ప్రతిష్ఠించబోయే రాముడి విగ్రహాన్ని ఆరు నెలల్లోనే తయారు చేశారు అరుణ్ యోగిరాజ్ (Arun Yogiraj). ఇక ఎంపిక చేసిన విగ్రహంతో పాటు తయారు చేయించిన మిగిలిన రెండు విగ్రహాలను కూడా అయోధ్య ఆలయంలోనే ఏర్పాటు చేయనున్నారు. ఇక అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠాపనకు ఆలయ ట్రస్టు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. జనవరి 22న జరిగే విగ్రహ ప్రాణప్రతిష్ట మహోత్సవ వేడుకల్లో ప్రధాని మోదీ (PM Modi) పాల్గొననున్నారు. మరోవైపు.. అయోధ్య రామ మందిరంలో ప్రతిష్టించబోయే విగ్రహాన్ని ఇప్పుడే వీక్షించే వీలు లేదు. ఆ బాల కోదండ రాముడిని దర్శించాలంటే ఈ నెల 22 వరకూ ఆగాల్సిందే...