శబ్ద కాలుష్యం ఒక సైలెంట్ కిల్లర్

ఉత్సవాలలో, ఊరేగింపులలో అధిక వాల్యూమ్ డీజే  సౌండ్లతో హోరెత్తిస్తున్నారు. ఇది శబ్ద కాలుష్యానికి  దారి తీసి సామాన్య  ప్రజానీకానికి చాలా ఇబ్బందులను కలుగజేస్తున్నది. అదే విధంగా నివాస ప్రాంతాల మధ్యలో ఉన్న పబ్బుల నుంచి వెలువడే అధిక ధ్వని సైతం శబ్ద కాలుష్యానికి  దారితీస్తున్నది. సాధారణంగా ధ్వని తీవ్రతను డెసిబెల్స్ (డీబీ)లో కొలుస్తారు. ఈ శబ్ద కాలుష్యం  నివారించడానికి తెలంగాణ పోలీస్ విభాగం కఠినమైన నిర్ణయాలను తీసుకుంటున్నది.  అందులో భాగంగా,  హైదరాబాద్  కమిషనరేట్ పరిధిలో  మతపరమైన ఊరేగింపులు సందర్భంగా  డీజే సౌండ్ సిస్టమ్స్,  బాణసంచా  కాల్చడాన్ని నిషేధిస్తూ  హైదరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సీవీ ఆనంద్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు.

ఉత్తర్వుల ప్రకారం  ధ్వని తీవ్రత  పగటిపూట నివాస ప్రాంతాలలో 55 డీబీ, రాత్రివేళ 45డీబీ,   పగటిపూట  వాణిజ్య ప్రాంతాల్లో 65డీబీ,  రాత్రి 55 డీబీ,  పారిశ్రామిక ప్రాంతాల్లో పగటిపూట 75డీబీ,  రాత్రి 70 డీబీకి మించి ఉండరాదు. ‘రాత్రి10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు లౌడ్ స్పీకర్ లేదా పబ్లిక్ అడ్రస్​ సిస్టమ్ లేదా డీజే సిస్టమ్ ఉపయోగించరాదు’ అని ఆర్డర్​లో  పేర్కొన్నారు. దీంతో మ్యూజిక్​పరికరాలను అద్దెకు తీసుకునేవారికి,  సౌండ్ సిస్టమ్స్​ సరఫరా చేసేవారికి పోలీస్ క్లియరెన్స్ అవసరం ఉంటుంది.

శబ్ద కాలుష్యం కంటికి కనిపించని ప్రమాదం. ఇది ఒక సైలెంట్ కిల్లర్.  దీనిని కట్టడి చేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది.  మానవ చెవి నిర్దిష్ట  పౌనఃపున్య పరిధిలో అంటే సాధారణంగా 20  హెర్ట్జ్​ నుంచి 20,000 హెర్ట్జ్ మధ్య గల శబ్దాలను వినగలదు.  ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) పక్రారం.. 65 డెసిబెల్స్ కంటే ఎక్కువ శబ్దస్థాయిని శబ్ద కాలుష్యంగా పరిగణిస్తారు.  75 డీబీ కంటే ఎక్కువ శబ్దం స్థాయి చాలా హానికరం.  శబ్ద కాలుష్యం భూమిపైగల  జీవజాతులతో పాటుగా,  సముద్రంలో  నివసించే జీవజాతులను సైతంప్రభావితం చేస్తోంది.  

విద్యాసంస్థలపై తీవ్ర ప్రభావం

విద్యాసంస్థలలో  విద్యార్థులకు పాఠాలు చెప్పటంలో కమ్యూనికేషన్  ప్రముఖ పాత్ర పోషిస్తోంది.  ధ్వని కాలుష్యం,  కమ్యూనికేషన్​కు అంతరాయం కలిగించటం వలన ఉపాధ్యాయులు పాఠాలు చెప్పటంలో,  విద్యార్థులు పాఠాలు వినడంలో తీవ్ర అంతరాయం ఏర్పడి అది విద్యా వ్యవస్థపై  తీవ్రమైన  ప్రభావాన్ని చూపుతుంది.  డబ్ల్యూహెచ్ఓ  పక్రారం మంచి బోధన,  అభ్యాసం కోసం తరగతి గది శబ్ద స్థాయి 35  డెసిబెల్స్ కంటే  తక్కువగా ఉండాలి.  అదేవిధంగా  ఐ.ఐ.టీ,  నీట్,  గ్రూప్  పరీక్షలు మొదలగు ప్రతిష్టాత్మకమైన పరీక్షలకు  ప్రిపేర్ అయ్యే విద్యార్థులు చదువుకునేందుకు  తీవ్ర ఆటంకం కలగటం వలన వారు తీవ్ర ఒత్తిడికి గురి అవుతారు.

ALSO READ | ఫార్మా పరిష్కారాలు భ్రమలేనా? 

నిత్యజీవిత పనులతో ధ్వని కాలుష్యం

ఇంటి నిర్మాణాల పనులు,  వంట గదిలో మిక్సీ వంటి వాటివలన,  ఇతర నిత్యజీవిత పనుల వలన కూడా ధ్వని కాలుష్యం ఏర్పడుతుంది. అయితే, అది తాత్కాలికం.  వాటిని మనం తప్పించలేం.  కానీ, పబ్బుల పేరిట, ఉత్సవాల పేరిట,  ఊరేగింపుల పేరిట వాడే  లౌడ్ స్పీకర్స్,  డీజే  సౌండ్స్  తీవ్ర శబ్ద కాలుష్యాన్ని కలుగచేయడమేకాక ఇవి అవసరం లేని ఆర్భాటం. ఇది సమాజానికి ఇబ్బందికరం.  డీజేలు100 డెసిబెల్స్ కంటే ఎక్కువ శబ్దస్థాయిని ఉత్పత్తి  చేయగలవు.  దీనిని ప్రజల సహకారంతో పూర్తిగా నివారించవచ్చును. 

 శబ్ద కాలుష్యం వలన అనారోగ్య సమస్యలు

శబ్ద కాలుష్యం కలిగించే అత్యంత సాధారణ అనారోగ్య సమస్య నాయిస్ ప్రేరిత వినికిడి నష్టం. పెద్ద శబ్దానికి గురికావడం వల్ల మానసిక ఒత్తిడి, అధిక రక్తపోటు,  గుండెజబ్బులు వంటి  హృదయ సంబంధ సమస్యల ప్రమాదం పెరుగుతుంది.  ఈ  ఆరోగ్య  సమస్యలు అన్ని వయసులవారిని,  ముఖ్యంగా పిల్లలను సైతం ప్రభావితం చేస్తాయి.  శబ్ద కాలుష్యం వలన జ్ఞాపకశక్తి,  శ్రద్ధ స్థాయి,  పఠన నైపుణ్యాల బలహీనత  వంటి సమస్యలతో పిల్లలు బాధపడుతున్నట్లు  పరిశోధనలలో  నిర్ధారణ అయింది.  మంచి ఆరోగ్యానికి,  చురుగ్గా  పనిచేయడానికి రోజుకు సుమారు ఎనిమిది గంటలపాటు గాఢనిద్ర అవసరం.  శబ్ద కాలుష్యం వలన నిద్రకు భంగం కలిగి  పనిచేసేవారి లేదా విద్యార్థుల మెదడు చురుగ్గా పనిచేయక పోవటం వలన వారు తమ శక్తి  సామర్థ్యాలను పూర్తిస్థాయిలో ప్రదర్శించలేరు.  

శబ్దంతో అనేక అసౌకర్యాలు

డబ్ల్యూహెచ్ఓ  ప్రకారం  పగటిపూట శబ్దస్థాయిలను 65డీబీ కంటే తక్కువగా ఉంచాలని,  ప్రశాంతమైన  నిద్రకోసం రాత్రిపూట  పరిసర శబ్ద స్థాయిలు 30 డీబీ కంటే  ఎక్కువ ఉండకూడదు.  డీజే  సౌండ్ వంటివి,  దానిని ఏర్పాటు చేసినవారికి ఆనందాన్ని కలుగచేస్తే,  దానితో సంబంధం లేని ఇతరులకు,  పర్యావరణానికి హాని కలుగచేస్తోంది.  

కాబట్టి,  ఇతరులకు  అసౌకర్యం కలగకుండా శబ్ద కాలుష్యాన్ని  సృష్టించకుండా  తక్కువ మోతాదు శబ్దంతో  మ్యూజిక్​ను  ఆనందించడానికి  అలవాటుపడాలి.  ప్రభుత్వాలతో సహకరించాలి.  చెట్లను నాటడం ద్వారా ధ్వని కాలుష్యం ప్రభావాన్ని తగ్గించవచ్చును.  ప్రజారోగ్యం కోసం  శబ్ద కాలుష్యం తగ్గించేందుకు  మనవంతు కృషి  చేయాలి.

- డా. శ్రీధరాల రాము, ఫ్యాకల్టీ ఆఫ్ కెమిస్ట్రీ అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్