పాలకూరతో కొత్తగా ఏదైనా ట్రై చేయాలనుకునేవాళ్లకు ఈ వంటలు బాగా నచ్చుతాయి. పాలకూరతో చాట్, చట్నీ, చక్లీ, చీజ్‌బాల్స్ వండేయొచ్చు. అంతేకాదు.. పాలకూరను ఎండబెట్టి, పొడికారం కొట్టి, నిల్వ చేయొచ్చు. ఈ స్పెషల్ చేసుకునేందుకు ఎక్కువ టైం కూడా పట్టదు. ఆకుపచ్చని పాలకూరతో ఆరోగ్యాన్నిచ్చే రెసిపీలు ఇవి.
చీజ్ బాల్స్
కావాల్సినవి :
నూనె - రెండు టీస్పూన్లు
అల్లం, వెల్లుల్లి తరుగు - ఒక్కో టీస్పూన్
పచ్చిమిర్చి - ఒకటి
ఉల్లిగడ్డ తరుగు - రెండు టేబుల్ స్పూన్లు
పాలకూర - రెండు కప్పులు
బ్రెడ్ పొడి - అర కప్పు
కార్న్ ఫ్లోర్ - రెండు టేబుల్ స్పూన్లు
చీజ్ క్యూబ్స్, ఉప్పు - సరిపడా
తయారీ : పాన్‌లో నూనె వేడి చేసి, అల్లం, వెల్లుల్లి తరుగు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ తరుగు, పాలకూర ఒకదాని తర్వాత ఒకటి వేసి వేగించాలి. ఆ తర్వాత వాటిని మిక్సీజార్‌లో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఆ పేస్ట్‌ని ఒక గిన్నెలో వేసి, అందులో బ్రెడ్ పొడి, కార్న్ ఫ్లోర్, ఉప్పు వేసి కలిపి ముద్ద చేయాలి. తర్వాత చిన్నచిన్న ఉండలు చేయాలి. వాటిని అరచేతిలో పెట్టుకుని గారెల్లా వత్తాలి. దానిపై చీజ్ క్యూబ్ పెట్టి, మళ్లీ ఉండలా చుట్టాలి. మరో పాన్‌లో నూనె వేడి చేసి, అందులో తయారుచేసిన ఉండలు వేగించాలి. వీటిని టొమాటొ కెచప్‌తో తింటే సూపర్ టేస్ట్ ఉంటాయి.
స్మూతీ
కావాల్సినవి :
పాలకూర ఆకులు - పదిహేను
అరటి పండు - ఒకటి
బాదం పప్పులు - ఐదు
పెరుగు - ఐదు టేబుల్ స్పూన్లు
నీళ్లు - అర కప్పు
వేడి నీళ్లు - సరిపడా
తయారీ : పాలకూర కాడలు తుంచేయాలి. ఆకుల్ని ఒక గిన్నెలో వేసి వేడి నీళ్లు పోసి శుభ్రంగా కడగాలి. తర్వాత వాటిని మిక్సీజార్‌లో వేయాలి. కడిగిన పాలకూరతోపాటు అరటి పండు ముక్కలు, పెరుగు, బాదం పప్పులు వేసి నీళ్లు పోయాలి. అన్నీ కలిసేలా మెత్తగా గ్రైండ్ చేయాలి. అంతే! ఎంతో ఆరోగ్యకరమైన గ్రీన్ స్మూతీ చిటికెలో రెడీ..
చక్రాలు
కావాల్సినవి :
పాలకూర - మూడు కట్టలు(చిన్నవి)
బియ్యప్పిండి - రెండు కప్పులు
శనగ పిండి - అరకప్పు
పుట్నాల పొడి - రెండు టీస్పూన్లు
జీలకర్ర - అర టీస్పూన్
ఇంగువ - చిటికెడు
ఉప్పు - సరిపడా
వెన్న - ఒక టీస్పూన్
పచ్చిమిర్చి - రెండు
నీళ్లు - పావు కప్పు
తయారీ : ఒక గిన్నెలో బియ్యప్పిండి, శనగ పిండి, పుట్నాల పొడి, జీలకర్ర, ఇంగువ, ఉప్పు, వెన్న వేసి కలపాలి. మిక్సీజార్‌లో పాలకూర, పచ్చిమిర్చి వేయాలి. అందులోనే కొన్ని నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఈ పేస్ట్‌ని బియ్యప్పిండి మిశ్రమంలో వేసి బాగా కలపాలి. కొంచెం కొంచెంగా నీళ్లు పోస్తూ పిండిని కలిపి ముద్ద చేయాలి. తర్వాత చక్రాలు పోసే గిద్దెల్లో పిండి ముద్ద పెట్టి, చక్రాల్లా వత్తాలి. వాటిని వేడి నూనెలో వేగించాలి.
పకోడీ చాట్
కావాల్సినవి :
పాలకూర - ఒక కట్ట
శనగపిండి - ఒక కప్పు
బియ్యప్పిండి - అర కప్పు
పసుపు, వాము - ఒక్కోటి పావు టీస్పూన్ చొప్పున
కారం, చాట్‌మసాలా, ఉప్పు - ఒక్కోటి అర టీస్పూన్ చొప్పున
నీళ్లు, నూనె - సరిపడా
ఆలుగడ్డ ముక్కలు (ఉడికించి) - కొన్ని
ఉల్లిగడ్డ తరుగు, క్యారెట్ తురుము, కొత్తిమీర - ఒక టేబుల్ స్పూన్
కారం, జీలకర్ర పొడి, ఆమ్చూర్ పొడి - ఒక్కోటి పావు టీస్పూన్
సేవ్, బూందీ - ఒక్కోటి రెండు టేబుల్ స్పూన్లు
తయారీ : ఒక గిన్నెలో శనగపిండి, బియ్యప్పిండి, పసుపు, వాము, కారం, చాట్‌మసాలా, ఉప్పు వేసి కలపాలి. అందులో నీళ్లు పోసి మరోసారి బాగా కలపాలి. పాలకూర ఆకుల్ని శనగపిండి మిశ్రమంలో ముంచి, వేడి నూనెలో వేగించాలి. ఒక ప్లేట్లో పాలక్ పకోడీ పెట్టి, అందులో ఆలుగడ్డ ముక్కలు వేయాలి. తర్వాత గ్రీన్ చట్నీ, పెరుగు వేసి, కారం చల్లాలి. ఆ తర్వాత ఉల్లిగడ్డ తరుగు, కారం, జీలకర్ర పొడి, ఆమ్చూర్ పొడి, సేవ్, బూందీ, క్యారెట్ తురుము వేసి, చివరిగా కొత్తిమీర చల్లితే పాలక్ పకోడీ చాట్ రెడీ.
చట్నీ
కావాల్సినవి :
పాలకూర - ఒక కట్ట
నూనె - మూడు టేబుల్ స్పూన్లు
మినపప్పు, శనగ పప్పు - ఒక్కో టీస్పూన్ చొప్పున
జీలకర్ర - అర టీస్పూన్
పచ్చిమిర్చి - మూడు
అల్లం - చిన్న ముక్క
కొబ్బరి తురుము - అర కప్పు
చింతపండు - కొంచెం
ఆవాలు, మినపప్పు - ఒక్కోటి అర టీస్పూన్
ఎండు మిర్చి - ఒకటి
కరివేపాకు - కొంచెం
తయారీ : పాన్‌లో నూనె వేడి చేసి మినప్పప్పు, శనగ పప్పు, పచ్చిమిర్చి, అల్లం వేసి వేగించాలి. అందులో పాలకూర తరుగు కూడా వేసి కాసేపు వేగించాలి. వేగించినవి అన్నీ చల్లారాక వాటిని మిక్సీజార్‌లో వేయాలి. వాటితోపాటు కొబ్బరి పొడి, చింతపండు, ఉప్పు కూడా వేయాలి. కొన్ని నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేయాలి. తాలింపు కోసం.. పాన్‌లో నూనె వేడి చేసి, ఆవాలు, మినపప్పు, ఎండు మిర్చి, కరివేపాకు వేగించాలి. ఆ తాలింపును చట్నీలో వేసి కలపాలి. ఈ పాలక్ చట్నీని ఇడ్లీ, దోశల్లో తింటే టేస్ట్ బాగుంటుంది.
పొడి కారం
కావాల్సినవి :
పాలకూర (ఆకుల్లో నీరుపోయ్యేంతవరకు ఎండబెట్టాలి) - రెండు కప్పులు
పెసరపప్పు, మినపప్పు, శనగపప్పు, కందిపప్పు, మిరియాలు, పుట్నాలు - ఒక్కోటి పావు కప్పు చొప్పున
ఎండు మిర్చి - ఐదు
జీలకర్ర - ఒకటిన్నర టేబుల్ స్పూన్
వెల్లుల్లి రెబ్బలు - ఎనిమిది
నెయ్యి - ఒక టీస్పూన్
ఉప్పు - సరిపడా
ఇంగువ - పావు టీస్పూన్
తయారీ : ఒక పాన్‌లో పుట్నాలు, జీలకర్ర, మిరియాలు, వెల్లుల్లి విడివిడిగా వేగించి పక్కన పెట్టాలి. తర్వాత పాన్‌లో నూనె వేసి ఎండు మిర్చి, శనగపప్పు, పెసరపప్పు, మినపప్పు, కందిపప్పు వేగించాలి. అవన్నీ వేగాక, ఎండబెట్టిన పాలకూర కూడా వేసి మరికాసేపు వేగించాలి. అందులో ఇంగువ కలపాలి. అన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసి, ఆరబెట్టాలి. చల్లారాక, వాటిని మిక్సీజార్‌లో వేయాలి. ఒకసారి మెత్తగా పొడి చేసి, అందులో ఉప్పు వేసి కలపాలి. ఈ పొడిని ఇడ్లీ, దోశ, రైస్ వంటివాటిల్లో తినొచ్చు. దీన్ని గ్లాస్ జార్లో వేసి గాలి చొరబడకుండా మూతపెడితే, రెండు నెలలు నిల్వ ఉంటుంది.