గణేశ్ నిమజ్జనంలో ఆటంకాలు కలిగించొద్దు

  • ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ 

సూర్యాపేట, వెలుగు: గణేశ్ నిమజ్జనంలో ఎవరికీ ఆటంకాలు కలిగించొద్దని ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ నిర్వాహకులకు సూచించారు. శనివారం డీఎస్పీ రవి, సీఐ రాజశేఖర్, సూర్యాపేట రూరల్ సీఐ సురేందర్ రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్​స్పెక్టర్ వీరరాఘవులు, ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాంతో కలిసి సద్దుల చెరువు మినీ ట్యాంక్ బండ్ వద్ద నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు.

 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిమజ్జన సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. కట్ట వద్ద క్రేన్లు, లైటింగ్, గజ ఈతగాళ్లను ఏర్పాటు చేయాలన్నారు. 

ప్రజలు, భక్తులు పోలీసులకు సహకరిస్తూ ప్రశాంతమైన వాతావరణంలో నిమజ్జనం జరుపుకోవాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా 2,700 విగ్రహాలకు అనుమతి ఇచ్చామని, 16న అన్ని గణేశ్ విగ్రహాల నిమజ్జనం పూర్తి చేసుకోవాలని కోరారు. 

శోభాయాత్రను ప్రశాంతంగా నిర్వహించుకోవాలి

నల్గొండ అర్బన్, వెలుగు : గణేశ్ నిమజ్జన శోభాయాత్ర ప్రశాంతంగా నిర్వహించుకోవాలని ఎస్పీ శరత్ చంద్ర పవార్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని ప్రధాన రహదారులతోపాటు వివిధ కాలనీల్లో ప్రత్యేకంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ కెమెరాలను జిల్లా పోలీసు కార్యాలయానికి  అనుసంధానం చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. 

నల్లగొండలోని 9 అడుగుల లోపు విగ్రహాలను వల్లభరావు చెరువు వద్ద నిమజ్జనం చేసేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. 9 అడుగుల కంటే ఎక్కువ ఉన్న విగ్రహాలు 14 వ మైలురాయి వద్ద నిమజ్జనం చేయనున్నట్లు తెలిపారు. 

భద్రత కోసం ఎస్పీ, ఇద్దరు ఏఎస్పీలు, ఆరుగురు డీఎస్పీలు, 28 మంది సీఐలు, 70 మంది ఎస్సైలు, 620 మందికి పైగా ఏఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐలు, కానిస్టేబుళ్లు, హోంగార్డులు, ఏఆర్ సిబ్బంది, 250 మంది ట్రైనీ కానిస్టేబుళ్లు విధులు నిర్వహించనున్నట్లు వివరించారు. ఈనెల 16న గణేశ్ నిమజ్జనం నేపథ్యంలో సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించనున్న  గ్రీవెన్స్ డే ను రద్దు చేస్తున్నట్టు ఎస్పీ తెలిపారు.