దక్షిణ కొరియాలో ఎమర్జెన్సీ విధించిన దేశాధ్యక్షుడు.. ఊహించని ప్రకటనతో షాక్లో ప్రజలు

సియోల్: దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ (Yoon Suk Yeol) ఆ దేశంలో ఎమర్జెన్సీ విధించారు. ‘ఎమర్జెన్సీ మార్షల్ లా’ డిక్లేర్ చేస్తూ మంగళవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వాన్ని అస్థిరపరచి, ఉత్తర కొరియాపై సానుభూతి చూపిస్తూ ప్రతిపక్షాలు దక్షిణ కొరియా రాజ్యాంగ వ్యవస్థను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నాయని.. ఈ పరిస్థితుల్లో ఎమర్జెన్సీ విధించక తప్పని పరిస్థితి ఏర్పడిందని యూన్ సుక్ యోల్ తెలిపారు. ఊహించని ఈ ప్రకటనతో దక్షిణ కొరియా ప్రజలు కంగుతిన్నారు.

దేశ అధ్యక్షుడు ఉన్నట్టుండి ప్రసార మాధ్యమాల్లో ప్రత్యక్ష ప్రసారంలో కనిపించి ఇంతటి కీలక ప్రకటన చేయడంతో ప్రజలు విస్తుపోయారు. వచ్చే సంవత్సరం ప్రవేశపెట్టనున్న బడ్జెట్ విషయంలో పార్లమెంట్ వేదికగా దేశాధ్యక్షుడు యూన్ పీపుల్ పవర్ పార్టీకి, ప్రతిపక్షంలో ఉన్న డెమోక్రటిక్ పార్టీకి వివాదాలు తారా స్థాయికి చేరిన సంగతి తెలిసిందే. పార్లమెంట్ లో ప్రతిపక్షానికి మెజారిటీ ఉండటంతో దక్షిణ కొరియాలో ప్రభుత్వం చిక్కుల్లో పడింది. పార్లమెంట్ లో బిల్లులు ప్రవేశపెట్టిన ప్రతీ సందర్భంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.