వచన కవిత్వానికి నోబెల్..దక్షిణ కొరియా రచయిత్రి హాన్​కాంగ్​కు అవార్డు

  • 2016లో ‘ది వెజిటేరియన్’ బుక్​కు ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్‌

స్టాక్‌‌హోం : సాహిత్య రంగంలో విశేష సేవలు అందించిన దక్షిణ కొరియా రచయిత్రి హాన్ కాంగ్​కు ప్రతిష్టాత్మక నోబెల్‌‌ బహుమతి వరించింది. హాన్​కాంగ్.. తన కవితలతో మానవ జీవితపు దుర్బలత్వాన్ని, చారిత్రక విషాదాలను వచన కవిత్వంతో కండ్లకు కట్టించారు. ఈ నేపథ్యంలో ఆమెను లిటిరేచర్ విభాగంలో నోబెల్ బహుమతికి ఎంపిక చేసినట్లు స్వీడిష్‌‌ అకాడమీ పేర్కొన్నది. దక్షిణ కొరియా నుంచి సాహిత్య రంగంలో నోబెల్‌‌ పురస్కారం దక్కించుకున్న తొలి మహిళగా 53 ఏండ్ల హాన్‌‌ కాంగ్‌‌ రికార్డు సృష్టించారు.

ప్రైజ్ మనీ కింద ఆమెకు స్వీడిష్ అకాడమీ రూ.8.40 కోట్లను అందజేయనున్నది. 20‌‌‌‌23లో నార్వేకు చెందిన రచయిత జాన్ ఫోసె నోబెల్ పురస్కారం అందుకున్నారు. కాగా, హాన్ కాంగ్ 1970లో దక్షిణ కొరియాలోని గ్వాంగ్జులో జన్మించారు. ఆమె తండ్రి ప్రసిద్ధ నవలా రచయిత. 1993లో మున్హాక్ – గ్వా–సాహో (సాహిత్యం, సమాజం) శీతాకాల సంచికలో ‘వింటర్ ఇన్ సియోల్’ పేరుతో ఐదు కవితలను ప్రచురించారు. తర్వాత నవలా రచయిత్రిగా తన కెరీర్‌‌ను ప్రారంభించారు. 1994లో సియోల్ షిన్మున్ స్ర్పింగ్ లిటరరీ కంటెస్ట్​లో పాల్గొని ‘రెడ్ యాంకర్’ గెలుపొందింది.

1995లో యోసు పేరుతో చిన్న స్టోరీని పబ్లిష్ చేసింది. 1998లో కొరియా ఆర్ట్స్ కౌన్సిల్ సహకారంతో యూనివర్సిటీ ఆఫ్ లోవా ఇంటర్నేషనల్ రైటింగ్ ప్రోగ్రామ్​లో మూడు నెలల పాటు ఆమె పాల్గొన్నారు. ఫ్రూట్స్ ఆఫ్ మై వుమన్, ఫైర్ సాలమండర్, బ్లాక్ డీర్, యువర్ కోల్డ్ హ్యాండ్స్, ది వెజిటేరియన్, బ్రీత్ ఫైటింగ్, గ్రీక్ లెసన్స్, హ్యూమన్ యాక్ట్స్, ది వైట్ బుక్, ఐ డూ వంటి నవలలు రాశారు. 2016లో ‘ది వెజిటేరియన్’ పుస్తకానికి ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్‌‌ దక్కింది. 2023లో ‘ఐ డూ నాట్ బిడ్ ఫేర్​వెల్’ నవలకు ఫ్రాన్స్​లో మెడిసిన్ ప్రైజ్, 2024లో ఎమిలే గైమెట్ ప్రైజ్ దక్కింది.